ఒకరూ..ఇద్దరూ..పది మంది కాదు..ఏకంగా 85 మంది బదిలీ.. అది కూడా ఒకే పోలీస్ స్టేషన్ నుంచి. అవును.. మీరు వింటున్నది నిజమే.. గత కొంత కాలంగా వివిధ కేసుల్లో.. ఆ స్టేషన్‌లోని ఖాకీలు వ్యవహరిస్తున్న తీరు.. కీలక సమాచారం బయటకు పొక్కడం లాంటి కారణాలతో.. హైదరాబాద్ సీపీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వివిధ రకాల కేసుల్లో హైదరాబాద్ పోలీసుల తీరు రోజురోజుకూ వివాదాస్పదమవుతోంది. పలు రకాల కేసుల్లో సెటిల్‌మెంట్లు చేసే వాళ్లు, దందాలకు కొమ్ముకాసేవాళ్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే వివిధ రకాల అవినీతి అక్రమాలకు పాల్పడుతూ నేరగాళ్లతో అంటకాగే పోలీసులపై ఇప్పటికే పలుమార్లు నగర కమీషనర్లు చర్యలు తీసుకున్న ఘటనలు ఉన్నాయి. కొందరిపై బదిలీ వేటు వేయగా.. మరికొందరిపై సస్పెన్షన్ విధించారు. అయినా ఇంకా వ్యవస్థలో మార్పు రాలేదన్న విమర్శలు విన్పిస్తూనే ఉన్నాయి. సరిగ్గా ఇలాంటి వేళ రేవంత్ సర్కారులో హైదరాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టిన కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని మార్చివేశారు. ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారి నుంచి హోంగార్డు వరకు ఏ ఒక్కరినీ ఉపేక్షించలేదు..అందరినీ బదిలీ చేశారు. అలాగని ఏ ఐదుగురో పదిమంది పైనే వేటు వేయడం కాదు.. ఏకంగా 85 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో రాష్ట్ర పోలీస్ శాఖ ఉలిక్కిపడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీరందర్నీ సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు హైదరాబాద్ సీపీ.
హైదరాబాద్ మహానగరంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉంటుంది. పైగా వీవీఐపీ జోన్ కూడా. అలాంటి పీఎస్ విషయంలో పోలీస్ కమీషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఇంతటి నిర్ణయం తీసుకోవడం వెనుక పెద్ద కథే ఉంది. గత కొంత కాలంగా పంజాగుట్ట పీఎస్‌లోని పోలీసుల తీరుపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతస్థాయి అధికారులు ఎంత చెప్పినా మేమింతే అన్నట్లుగా వారి వ్యవహార శైలి ఉండేదన్న ఆరోపణలూ ఎక్కువయ్యాయి. ఇటీవలె బోధన్ మాజీ ఎమ్మెల్యే తనయుడి వ్యవహారం.. అందులో ఆయా పోలీసుల తీరు ఎంతగానో వివాదాస్పదమైంది. పైగా వివిధ కీలక విషయాలు బయటకు పొక్కుతున్నాయన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. దీంతో.. తీవ్రంగా ఆగ్రహించిన సీపీ.. ఏకంగా అందరిపైనా బదిలీ వేటు వేశారు.
నిజానికి… గత ప్రభుత్వంలోని పెద్దలకు తెలిసేలా ప్రస్తుతం ఉన్న అధికారులు, సిబ్బంది కొందరు వ్యవహరిస్తు న్నారనే సమాచారం రేవంత్ సర్కారుకు అందించాయి నిఘా వర్గాలు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే ఇంటెలిజెన్స్ వర్గాలు సీఎం రేవంత్ రెడ్డి భద్రతా సిబ్బందిని మొత్తం మార్చాలని నిర్ణయించాయి. ఆ దిశగా ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఇది జరిగిన కొద్దిరోజులకే పంజాగుట్ట పీఎస్ నుంచి కీలక సమాచారం బయటకు పొక్కుతోందన్న ఆరపణలపై ఏకంగా మొత్తం సిబ్బందిపైనా ప్రభుత్వం వేటు వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరి.. సీపీ తీసుకున్న ఈ నిర్ణయంతో మిగిలిన వాళ్లలో మార్పు వస్తుందా .. ? అనేది ప్రశ్న తలెత్తుతోంది.


