ఏపీలో రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. ఎన్నికలు టైం దగ్గరపడుతుండడంతో పార్టీలు పోటాపోటీగా ప్రజల్లో కి దూసుకెళ్తున్నాయి. రెండో సారి అధికారం కోసం వైసీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. సిద్దం పేరుతో ఏపీ సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరించేందుకు రెడీ అవుతున్నారు. ఇన్నాళ్లూ జనానికి దూరంగా ఉన్నారనే విమర్శలను మూట గట్టుకున్న జగన్.. ఇప్పుడు ప్రజాబాట పట్టనున్నారు. ఇంతకీ వైసీపీ ప్రారంభిస్తున్న సిద్ధం ప్లాన్ ఏంటి..? షర్మిల విమర్శ లకు బ్రేక్ వెయ్యకపోతే, పార్టీకి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉందని జగన్ భావిస్తున్నారా..?
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ ఎన్నికలకు రెడీ అవుతోంది. తిరిగి మళ్లీ అధికారం చేపట్టడం లక్ష్యంగా జగన్ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక పై స్పీడ్ పెంచారు. ఇతర పార్టీల కంటే ముందే అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల ప్రచారానికి జగన్ శ్రీకారం చుట్టారు. ఈ నెల 27 నుంచి భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సిద్దం పేరుతో ఎన్నిక ల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేసిం ది వైసీపీ. మొదటి సభ విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో నిర్వహించనున్నారు. రెండో సభ ఈ నెల 30న ఏలూరు లో నిర్వహించనున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు, ఉభయ గోదావరి జిల్లాల క్యాడర్ ఈ సభకు హాజరు కానుంది. ఆ తరువాత రాయలసీమ జిల్లాలో మరో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. ఇప్పటకే ప్రతిపక్ష టీడీపీ రా..కదలి రా.. సభలతో ఫుల్ జోష్‌లో ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ నిర్వహిస్తున్న ఈ తొలి సభ ద్వారా తాము ఎన్నికల రణక్షేత్రంలో దిగేందుకు సిద్ధంగా ఉన్నామన్న మెసేజ్‌ను ఇచ్చేందుకు ఈ పేరును ఖరారు చేసినట్టు చెబుతున్నారు. పోరుకు తాము సిద్ధమన్న రీతిలో పోస్టర్ డిజైన్ కూడా ఉంది. సీఎం జగన్మోహన్‌రెడ్ది చిత్రంతోపాటు పిడికిలి పిగించిన చేతిని పోస్టర్‌లో డిజైన్ చేశారు. ఇది ఎన్నికల్లో వైసీపీ కేడర్ సాగించబోయే పోరాటానికి సంకేతంగా ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
మరోవైపు ఎన్నికల ప్రక్రియలో పార్టీ కేడర్ కీలక పాత్ర పోషిస్తారు. అందుకే కేడర్ తో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. పార్టీ అభ్యర్థుల మార్పు ఎందుకు చేయాల్సి వచ్చింది…ఎక్కడెక్కడ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి… వచ్చే ఎన్నికల్లో గెలుపునకు ఏం చేయాలి..కేడర్ క్రియాశీలత వంటి అంశాలపై జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇలా చేయడం ద్వారా కొత్తగా నియమించిన ఇంచార్జి లకు కేడర్ నుంచి మంచి సహకారం అందుతుందని భావిస్తున్నారు. అయితే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం జగన్ జనానికి దూరంగా ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పరదాల మాటున పర్యటనలు, ఆంక్షలు నడుమ సందర్శనలకు ఐదేళ్ల కాలాన్ని వెచ్చించారని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇక ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతున్నందున జగన్ ప్రజల్లోకి రావాల్సిన పరిస్థితి తప్పనిసరైందని..అందుకే జగన్ ఇప్పుడు ప్రజలను స్మరించుకుంటున్నారని ప్రతిపక్ష పార్టీలు కౌంటర్లు ఇస్తున్నారు.
మరోవైపు ఏపీ కాంగ్రెస్ సారధ్య బాధ్యతలు తీసుకున్న షర్మిల దూకుడు పెంచారు. ఆమె పర్యటనలు ఈ నెలాఖరు వరకు కొనసాగనున్నాయి. దాదాపు 13 ఉమ్మడి జిల్లాల్లో ఆమె పర్యటించనున్నారు. కాంగ్రెస్ సారధ్య బాధ్యతలు తీసు కున్నారో లేదో.. షర్మిల జగన్ ను టార్గెట్ చేసుకున్నారు. అవినీతిని ఎండగట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రానికి జగన్ అవసరం లేదని.. గత ఐదేళ్లలో అధోగతి పాలన చేశారని మండి పడటం ద్వారా కొత్త సంకేతాలు ఇచ్చారు షర్మిల. ఈ నేపథ్యంలో ఓవైపు టీడీపీ, జనసేన కూటమి మరోవైపు షర్మిల విమర్శలను తిప్పికొట్టేలా సభలు నిర్వహించాలని జగన్ భావిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ఐదేళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం చేస్తున్న వికేంద్రీకరణ అంశాన్ని ఎన్నికల ముందు ప్రజల్లోకి తీసుకెళ్లేలా వ్యూహం రచిస్తున్నారు. మొత్తానికి ఎన్నికలు దగ్గరపడుతుండడంతో రాజకీయపార్టీల్లో హడావిడి మొదలైంది. అన్ని పార్టీల అగ్రనేతలు ప్రజాబాట పడుతున్నారు. తాజాగా సీఎం జగన్ కూడా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. మరి జగన్ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందో లేదో..ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారో చూడాలి.