వైసీపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏ జిల్లాలో లేనన్ని సమస్యలు ప్రకాశం జిల్లాలో తలెత్తుతున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాను తన కనుసన్నల్లో నడిపించిన బాలినేని ప్రస్తుతం అసంతృప్తితో రగిలిపోతున్నారు. చీటికి, మాటికి అలక పాన్పు ఎక్కుతూ హైకమాండ్‌ను తెగ టెన్షన్ పెడుతున్నారు. తాజాగా ఒంగోలు ఎంపీ సీటు విషయంలో మళ్లీ యూటర్న్ తీసుకున్నారు. మొన్న పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్న బాలినేని.. మళ్లీ మాట మార్చడం జిల్లా లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ బాలినేని అలకకు ఎప్పుడు ఫుల్‌స్టాప్ పడుతుంది..? ఎన్నికల నాటికి బాలినేని పార్టీ మారుతారా..? లేదా..? అధిష్టానంతో సర్దుకుపోతారా..?
బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీలో సీనియర్ నేత. సీఎం జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కూడా. జగన్ కుటుంబంతో ఆయనకు బంధుత్వం ఉంది. అయితే కొంత కాలంగా బాలినేని తీరు వివాదాస్పదంగా మారుతోంది. ఆయన రోజుకో వైఖరి తీసుకోవడం హైకమాండ్‌ను తెగ టెన్షన్ పెడుతోందనే టాక్ వినిపిస్తోంది. తాజాగా ఒంగోలు ఎంపీ సీటు విషయంలో మళ్లీ మాట మార్చారు బాలినేని. మాగుంటకే సీటు ఇవ్వాలంటూ పట్టుపడుతున్నారు. దీంతో జిల్లాలో బాలినేని వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సీఎం జగన్ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల మార్పులు చేర్పులు చేపట్టారు. అందులో భాగంగా ఒంగోలు ఎంపీ సీటు మార్చాలని సీఎం జగన్ నిర్ణయిం చారు. అయితే జిల్లాకు చెందిన సీనియర్ నేత బాలినేని మాత్రం మాగుంట శ్రీనివాసుల రెడ్డిని ఎంపీగా కొనసాగించాలని కొద్దీ రోజులుగా వైసీపీ అధిష్టానం వద్ద పట్టు పడుతున్నారు. కానీ వైసీపీ అధిష్టానం మాత్రం ఒంగోలు ఎంపీ రేసులోకి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డిని తీసుకువచ్చింది. దీంతో ఒంగోలు ఎంపీ టికెట్ తన కుమారుడుకి ఇవ్వాలని మరో ప్రతిపాదన తీసుకువచ్చారు బాలినేని. అందుకు సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ రాక పోగా చెవిరెడ్డికే దాదాపు టికెట్ ఖరారు చేసినట్లు తెలిసింది. దీంతో సీఎం తీరుపై బాలినేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే బాలినేనిని పార్టీ ముఖ్య నేతలు సజ్జల, సాయిరెడ్డి బుజ్జగించే ప్రయత్నం చేశారు. దీంతో చివరకు మొత్తబడిన బాలినేని పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పారు. అలా చెప్పారో లేదో మళ్లీ ఒంగోలు ఎంపీ సీటు విషయంలో యూటర్న్ తీసుకున్నారు బాలినేని.
వచ్చే ఎన్నికల్లో తాను ఒంగోలు నుంచి పోటీ చేసే విషయంలోనూ, నియోజక వర్గంలో పేదలకు ఇళ్ల స్థలాల కు నిధుల విడుదల విషయంలోనూ సీఎం జగన్ తీరు పై బాలీనేని గతంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతే కాదు మూడు రోజుల పాటు సీఎం జగన్ అపాయింట్ మెంట్ కోసం ఎదురు చూసినా అపాయింట్మెంట్ దక్కక పోవడంపైనా మండి పడ్డారు. ఈ నేపథ్యంలో హైదరబాద్ వెళ్లిన బాలినేని అప్పట్లో ముఖ్య అనుచరులతో సమావేశం అయ్యారు. ఈ పరిణామాలతో దిగొచ్చిన వైసీపీ పెద్దలు అయన్ని బుజ్జగించి సీఎం దగ్గరకు తీసుకువెళ్లారు. సీఎంతో సమావేశం అయిన తరువాత ఒంగోలులో పేదలకు ఇళ్ళ స్థలాలకు విడుదల కి చర్యలు చేపట్టారు. అలాగే ఒంగోలు ఎంపి, మిగిలిన నియోజక వర్గాలో ఇన్‌చార్జ్‌ల బాధ్యత బాలినేని కి అప్పగించారు. ఇది ఇలా ఉండగా మళ్లీ చెవిరెడ్డినే వైసీపీ ఒంగోలు అభ్యర్థిగా తెర పైకి తీసుకురావడం, ఆయనకు రీజనల్ కో ఆర్డినేటర్ బాధ్యతలు ఇవ్వడం వంటి విషయాలు బాలినేనికి ఆగ్రహం తెప్పించాయని ఆయన అనుచరులు చెబుతున్నారు.
ప్రకాశం జిల్లాలో అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ల మార్పులు, చేర్పులలో మొదట్లో తనకు ప్రాధాన్యం ఇవక్కపోవడంపై బహిరంగంగానే బాలినేని అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా మంత్రి సురేష్‌కు కొండేపి ఇన్‌చార్జ్ బాధ్యతలు ఇవ్వడం, సంత నూతలపాడు ఇన్‌చార్జ్‌ల బాధ్యతలు మంత్రి మెరుగు నాగార్జునకు ఇవ్వడంపై అలకబూనారు. దీంతో కొత్త ఇన్‌చార్జ్‌లను నియోజక వర్గాలకు పరిచయం చేసే కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. రెండో విడత కేబినెట్‌లో చోటు దక్కక పోవడం మొదలు ఏదో ఒక విషయంలో ఆయన తీరు చర్చనీయాంశంగా మారుతూనే ఉంది. పైగా బాలినేని బంధువు, పార్టీలోని మరో సీనియర్ నేత సుబ్బారెడ్డితోను ఆయనకు తీవ్ర విభేదాలు వచ్చాయి. జిల్లాలో సుబ్బారెడ్డి ప్రాధాన్యం పెరగడం, అధికారుల బదిలీ విషయంలో కూడా తనమాట చెల్లకపోవడం వంటి వాటిపై అప్పట్లో బాలినేని అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ పదవికి సైతం రాజీనామా చేశారు. అయితే తాజాగా పరిణామాలతో మళ్లీ ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే సస్పెన్స్ రాజకీయవర్గాల్లో నెలకొంది. మొత్తానికి బాలినేని పార్టీ మారతారనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది. అయితే అది ప్రచారం మాత్రమేనని బాలినేని చెబుతున్నారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఎన్నికల నాటికి ఏదైనా జరగ వచ్చనేది విశ్లేషకుల మాట. మరి బాలినేని ఎపిసోడ్ ఎంత వరకు వెళుతుందో చూడాలి.