పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు నేతలు, ఆశావహులు పెద్ద ఎత్తున సిద్ధమయ్యారు. పార్టీ ఏదైనా టికెట్ వస్తే చాలు బరిలో దిగుతామని చెబుతున్నారు. అయితే.. తెలంగాణలోని కొన్ని నియోజక vవర్గాల విషయంలో మాత్రం ఈ సారి పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. ప్రత్యేకించి పలువురు ప్రభుత్వ ఉద్యో గులు ఎన్నికల బరిలో దిగి తమ అదృష్టం పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ స్థానా లుగా ఉన్నటువంటి వరంగల్, మహబూబాబాద్ విషయంలో ఈ పోటీ తీవ్రంగా ఉంది. అసలు ఎందుకీ పరిస్థితి ? ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారు రాజకీయాల్లోకి ఎందుకు రావాలని అంతగా ఉత్సాహం చూపు తున్నారు. ఇదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.
సార్వత్రిక ఎన్నికల వేడి దేశ వ్యాప్తంగా సెగలు పుట్టిస్తోంది. ఇప్పటికే అన్ని పార్టీలూ ఓవైపు మేనిఫెస్టోలు సిద్దం చేస్తూ .. మరోవైపు.. అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నాయి. దీంతో… రాజకీయ నేతలు తమ అదృష్టం పరీక్షించుకు నేందుకు క్యూ కడుతున్నారు. కొన్ని పార్టీలు ఇందుకోసం దర ఖాస్తులను ఆహ్వానించడంతో తమ అప్లికేషన్లు సమర్పిం చారు నేతలు. ఎప్పుడు హైకమాండ్ నుంచి పిలుపు వస్తుందా.. ఎప్పుడు ఎన్నికల బరిలో దిగుదామా అంటూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి కాస్త భిన్నంగా ఉందనే చెప్పాలి. మిగిలిన స్థానాల విషయంలో ఎలా ఉన్నా, అక్కడ మాత్రం ప్రభుత్వ ఉన్నతోద్యోగులు, అధికారులు ఎన్నికల గోదాలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి రెండు నియోజక వర్గాలైన వరంగల్, మహ బూబాబాద్ ఎంపీ స్థానాల పేర్లు ఎక్కువగా విన్పిస్తున్నాయి. ఇందులో వరం గల్ ఎస్సీ రిజర్వ్‌డ్ సీటు కాగా.. మహ బూబాబాద్ స్థానం ఎస్టీ రిజర్వ్‌డ్ సీటు. దీంతో… పెద్ద ఎత్తున ఆయా సామాజిక వర్గాలకు చెందిన ప్రభుత్వ ఉన్నతోద్యో గులు తమ అదృష్టం పరీక్షించుకునేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు. ఆయా పార్టీల తరఫున తమకు తెలిసిన పెద్ద నేతలు, గాడ్ ఫాదర్ల ద్వారా వ్యవహారం చక్కబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారనే చెప్పాలి.
వరంగల్ ఎస్సీ లోక్‌సభా స్థానం విషయానికి వస్తే… కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల టికెట్లకు యమా గిరాకీ ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక్కడ్నుంచి పోటీకి సీనియర్ కాంగ్రెస్ నేతలకు ఏమాత్రం తగ్గని రీతిలో… ప్రభుత్వ ఉన్నతోద్యోగులు సై అంటున్నారు. ఉమ్మడి వరంగల్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న హరికోట్ల రవి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఆయనకు…. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో సన్నిహిత సంబంధాలున్నాయన్న చర్చ జరుగుతోంది. వీరి సహాయ సహకారాలు, మద్దతుతోనే ఇటీవలె ఢిల్లీలో హస్తం పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో హరికోట్ల రవి సమావేశమైనట్లు ప్రచారం సాగుతోంది. ఈయనే కాదు…గతంలో ప్రభుత్వ వైద్యులుగా పనిచేసిన రాగమళ్ల పరమేశ్వర్ కూడా హస్తం పార్టీ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మాజీ పోలీసు అధికారి దొమ్మాటి సాంబయ్య కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం తనకు తెలిసిన మార్గాల్లో ప్రయత్నిస్తున్నట్లుగా జిల్లాలో విన్పిస్తోంది.
ఇక మహబూబాబాద్ స్థానం ఎస్టీ రిజర్వ్‌డ్‌గా ఉంది. ఇక్కడ్నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటీ చేస్తే విజయం తథ్యమనే ఆలోచనతో దాదాపు డజను మందికి పైగా ఆశావహులు అధిష్టానం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఈ క్రమంలోనే ఆశావహుల విషయానికి వస్తే.. గతంలో మహబూబాబాద్ డీఎస్పీగా పని చేసిన ఖమ్మం జిల్లా వాసి డుంగ్రోత్ నాగరాజు నాయక్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో ఏఐసీ అడ్మిన్‌గా పనిచేస్తున్నారు. టికెట్ వచ్చినట్లైతే స్వచ్చంధ పదవీ విరమణ చేసి ఎన్నికల బరిలో దిగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, తెలంగా ణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన భట్టు రమేష్ కూడా హస్తం పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక, సంగారెడ్డి జిల్లాలో ఎస్పీడీసీఎల్ డీఈగా పనిచే స్తున్న మహబూబాబాద్ వాసి ఎట్టి వెంకన్న కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవలె ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు భరత్ చంద్రారెడ్డిని కలిసి వెంకన్నకు ఎంపీ టికెట్ ఇవ్వాలని,తద్వారా ఆదివాసీలకు టికెట్ ఇచ్చినట్లు అవుతుందని విజ్ఞప్తి చేశారు. కేవలం వీరు మాత్రమే కాదు.. మరికొందరు ఉద్యోగులు సైతం అంతర్గతంగా ఎంటీ టికెట్ కోసం తమవంతు ప్రయత్నా లను తమకు తెలిసిన నేతల ద్వారా చేస్తున్నారు.
బీఆర్ఎస్ టికెట్ దక్కినా పోటీ చేసేందుకు పలువురు ఆశావహులు సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ కుమారుడు ఐఆర్‌ఎస్ జీవన్‌లాల్ నాయక్ మహబూబాబాద్ నుంచి
గులాబీ పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన మాలోతు భిక్షపతి నాయక్ ఎప్పటి నుంచో పార్లమెంటు టికెట్ ఆశిస్తున్నారు. ఈయన ప్రస్తుతం ఎల్‌ఐసీ వరంగల్ డివిజన్ డీవోగా విధులు నిర్వహిస్తున్నారు. ఇలా ఒకరూ ఇద్దరు కాదు.. ఇరవై మంది వరకు ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నత స్థానంలో ఉన్న అధికారులు వరంగల్, మహబూబాబాద్ ఎంపీ సీట్లు దక్కించుకునేందుకు నేతలతోపోటీ పడుతున్నారు. మరి.. ఆయా పార్టీల అధిష్టానాలు రాజకీయ నేతలను ఎన్నికల బరిలో దింపుతాయా లేదంటే ప్రభుత్వ ఉన్నతోద్యోగులను కదన రంగంలో దూకేలా చేస్తాయా అన్నది ప్రస్తుతా నికైతే మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది.