తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలున్నాయి. అయితే, బీఆర్ఎస్ లో కొన్ని పార్లమెంట్ స్థానాలకే పోటీ ఎక్కువగా వున్నట్టు తెలుస్తోంది. ఇంతకు ఆ పార్లమెంట్ స్థానాల్లోనే పోటీ చేస్తామని బీఆర్ ఎస్ నేతలు ఎందుకు అంటున్నారు…? బీఆర్ఎస్ పార్టీలో డిమాండ్ వున్న పార్లమెంట్ స్థానాలు ఏవి…? బీఆర్ఎస్ అధిష్టానం ఆలోచన ఏంటి…?
రాష్ట్రంలో త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. బీఆర్ఎస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానానికి పరిమితం అయింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో పరువు నిలబెట్టుకోవాలని ప్రయత్నాలు సాగిస్తోంది. నియోజకవర్గాల వారీగా బిఆర్ఎస్ సమీక్ష సమావేశాలను నిర్వహిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలతో సమీక్ష సమావేశాలకు గులాబీ అధిష్టానం శ్రీకారం చుట్టింది.
తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాలు వున్నాయి. అందులో హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని మినహాయిస్తే 16 పార్లమెంట్ స్థానాలు వుంటాయి . బీఆర్ఎస్ పార్టీలో మాత్రం మూడు పార్లమెంట్ స్థానాలకు మాత్రమే పోటీ ఎక్కువగా వుంది. దీంతో ఈ మూడు స్థానాల్లో అభ్యర్థులుగా ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చ ఆ పార్టీలో సాగుతోంది. బీఆర్ఎస్ పార్టీలో మల్కాజిగిరి,మెదక్, సికింద్రాబాద్ ఈ మూడు పార్లమెంట్ స్థానాలకు పోటీ ఎక్కువగా వుంది. మెదక్ పార్లమెంట్ స్థానం మొదటి నుండి బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట కాగా మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలోను బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఇక సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఆరు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తే తమకు భారం తగ్గుతుందనే భావనలో బీఆర్ఎస్ పార్లమెంట్ ఆశావాహులు ఉన్నారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లోను బీఆర్ఎస్ పార్టీ ఆరు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. అయితే, 2019లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన తలసాని సాయి కిరణ్ యాదవ్ ఓడిపోయారు. ఈ సారి జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో టిక్కెట్ కోసం తలసాని సాయికిరణ్ యాదవ్,హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురులో ఒకరికి బీఆర్ఎస్ టిక్కెట్ దక్కే అవకాశం ఉన్నట్లుగా గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది.
దేశంలోనే అతి పెద్ద పార్లమెంట్ నియోజకవర్గంగా ఉన్న మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం టిక్కెట్ కోసం బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. గత లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన మర్రి రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి మల్కాజ్ గిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి టిక్కెట్ కోసం మాజీమంత్రి మల్లారెడ్డి తన కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సైతం మల్కాజిగిరి పార్లమెంట్ రేసులో ఉన్నారు. ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, తమకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
మెదక్ పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుండి కంచుకోటగా వుంటూ వస్తుంది. మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ దక్కించుకుంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ కచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న స్థానంగా మెదక్ పార్లమెంట్ స్థానానికి పేరు ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ నుండి రేసులో మాజీ ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి, గాలి అనిల్ కుమార్, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి రేసులో ఉన్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో మెదక్ నుండి ఎంపీగా గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
ఈ మూడు పార్లమెంట్ స్థానాల పరిధిలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వుండటంతో ప్రచార భారం మొత్తం పార్లమెంట్ అభ్యర్థులపై పడకుండా ఎమ్మెల్యేలు సైతం బాధ్యతలు తీసుకుంటారు. ప్రచార ఖర్చు కొంత తగ్గడంతోపాటుగా అసెంబ్లీ ఎన్నికల్లో సానుకూలంగా ఫలితాలు వచ్చాయనే భావన రేసులో వున్న అభ్యర్థుల్లో నెలకొంది. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల తీర్పు అదే విధంగా ఉంటుంది అని లెక్కలు వేస్తూ మూడు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయడం కోసం రేసులో వున్న వారు పావులు కదుపుతున్నారు. ఈ మూడు పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎవరికి అవకాశం ఇస్తారు అనేది చూడాలి.