2024 ఏడాదికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఏడాది 40కి పైగా దేశాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 324 కోట్లమంది ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఎన్నికలకు వెళుతున్న దేశాల్లో అమెరికా, రష్యా, తైవాన్, భారత్, మెక్సికో, ఇరాన్‌తో పాటు మరికొన్ని దేశాలున్నాయి. ప్రపంచ జనాభాలో 40 శాతానికి పైగా ప్రజలు ఈ ఎన్నికల క్రతువులో పాల్గొనబోతున్నారు.
అంతర్జాతీయంగా ఇది ఎన్నికల నామ సంవత్సరం. ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా దేశాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకే ఏడాది ఇన్ని దేశాల్లో ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి అంటున్నారు అంతర్జాతీయ వ్యవ హారాల నిపుణులు. ఎన్నికలు జరగనున్న దేశాల్లో రష్యా, అగ్రరాజ్యమైన అమెరికా, భారత్, బ్రిటన్, మెక్సికో, దక్షిణాఫ్రికా, ఇరాన్, దక్షిణ సూడాన్, తైవాన్, భూటాన్ ఉన్నాయి. వీటితో పాటు ఇదే ఏడాది కీలకమైన యూరోపియన్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. వీటిలో రష్యా, అమెరికా, భారత్, తైవాన్ ఎన్నికలను యావత్ ప్రపంచం ఆసక్తిగా గమని స్తోంది.
అందరి దృష్టి అమెరికా ఎన్నికలపైనే !
కొంతకాలంగా అంతర్జాతీయ వ్యవహారాల్లో అమెరికా ప్రాభవం తగ్గింది. చైనా, అడుగడుగునా అమెరికా ఆధిపత్యానికి చెక్ పెడుతోంది. అంతర్జాతీయ వాణిజ్య రంగంలో చైనా నుంచి అమెరికా తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది. అయినప్పటికీ అమెరికా అంటే అగ్రరాజ్యమే. అమెరికా అధ్యక్ష పదవికి ఈ ఏడాది నవంబరులో ఎన్నికలు జరగబోతున్నాయి. డెమొక్రటిక్ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి పోటీ చేయడానికి తహతహలాడుతున్నారు. అయితే రహస్య పత్రాల వివాదం జోబైడెన్ మెడకు చుట్టుకుంది. ఇక రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేయడానికి మాజీ అధ్య క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో అమెరికాలో అత్యంత వివాదాస్పద మాజీ అధ్యక్షుడి గా డొనాల్డ్ ట్రంప్ అప్రదిష్ట మూటగట్టుకున్నారు. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్‌కు ఈసారి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం దొరకడం అసాధ్యం అంటున్నారు అమెరికా రాజకీయ రంగ నిపుణులు.
మార్చిలో రష్యా ఎన్నికలు
ఈ ఏడాది ఎన్నికల క్రతువులో పాల్గొంటున్న దేశాల జాబితాలో రష్యా కూడా ఉంది. ఈ ఏడాది మార్చి నెలలో రష్యా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. రష్యాలో గత రెండు దశాబ్దాలుగా వ్లాదిమిర్ పుతిన్ అధికారంలో కొనసాగుతు న్నారు. ఒకప్పటి సోవియట్ పాలకుడు జోసెఫ్ స్టాలిన్ కన్నా వ్లాదిమిర్ పుతిన్ యే ఎక్కువ కాలం పాటు అధికారంలో ఉన్నారు. మరోసారి అధ్యక్ష బరిలో నిలబడుతున్నట్లు ఇటీవలే పుతిన్ ప్రకటించారు. పుతిన్ విజయంపై ఎవరికీ అనుమానాలు లేవు అంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు.
జనవరిలో తైవాన్ అధ్యక్ష ఎన్నికలు
తైవాన్ అధ్యక్ష పదవికి జనవరి 13న ఎన్నికలు జరగబోతున్నాయి. చైనా – తైవాన్ మధ్య కొంతకాలంగా వివాదం రగులు తోంది. తాజాగా చైనా -తైవాన్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. తైవాన్ తమ భూభాగమే అంటోంది చైనా. ఏదో ఒక రోజు తైవాన్ దేశాన్ని తమలో కలిపేసుకుంటామన్నారు చైనా అధినేత జిన్‌పింగ్. అయితే తమది స్వతంత్ర దేశం అంటున్నారు ప్రస్తుత తైవాన్ అధ్యక్షురాలు త్సాయి ఇంగ్‌వెన్. తైవాన్‌తో చైనా గొడవలు ఇప్పటివి కావు. కొన్ని దశాబ్దాల నుంచి ఈ గొడవలు కొనసాగుతున్నాయి. ఒకవైపు వివాదాలు నడుస్తూనే ఉన్నా మరో వైపు 1980లో రెండు దేశాల మధ్య సంబంధాలు కాస్తంత మెరుగుపడ్డాయి. ఈ సమయంలోనే తైవాన్ ను బుజ్జగించడానికి చైనా ఒక ప్రతిపాదన చేసింది, ఒక దేశం- రెండు వ్యవస్థలు….అంటూ ఓ ప్రతిపాదన చేసింది చైనా. అంతేకాదు తమ సామ్రాజ్యంలో కలిసిపోవడానికి తైవాన్ అంగీకరిస్తే, పాలనలో జోక్యం చేసుకోబోమని హామీ కూడా ఇచ్చింది. కొంతవరకు స్వతంత్రత కల్పిస్తామని డ్రాగన్ చైనా మాట ఇచ్చింది. అయితే తైవాన్ పగ్గాలు మాత్రం తమ దగ్గరే ఉంటాయని పరోక్షంగా సంకేతాలిచ్చింది. దీనికి తైవాన్ ప్రజలు అంగీకరించలేదు. చైనాకు వ్యతిరేకంగా తైవాన్ లో భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఏమైనా, 40కి పైగా దేశాల్లో ఎన్నికలతో ఈ ఏడాది అంతర్జాతీయంగా కీలకంగా మారింది.


