తెలంగాణ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకొస్తామని అన్నారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. సమానత్వ మే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారాయన. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ..ఇవాళ అసెంబ్లీలో మంత్రి భట్టి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొత్తం 2.75 లక్షల కోట్లతో బడ్జట్ ను రూపొందించారు. వాస్తవాలను ప్రతి బింబించేలా బడ్జెట్‌ను రూపొందించామని భట్టి స్పష్టం చేశారు. మొత్తంగా లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి పెద్దపీట వేసింది. వాస్తవ రాబడులు, వ్యయాల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన జరిగింది.
కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టులు నిర్మించే విధానం రాష్ట్రానికి శాపంగా మారిందని మండిపడ్డారు మంత్రి భట్టి విక్రమార్క. ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల ఖర్చు చేశారని.. అవినీతి ఎంతో తేల్చాల్సి ఉందన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచాణ జరిపిస్తామని చెప్పారు భట్టి మూసీ నది రివర్ ఫ్రంట్ అబ్బివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు భట్టి. మూసీ నది పునరుజ్జీవం, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు రూపకల్పనలో భాగంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో భారీగా నిధులు కేటా యించారు. మూసీ అభివృద్ధికి 1000 కోట్లు కేటాయించారు. లండన్ థెమ్స్ నదిలా మూసీ నదిని అభివృద్ధి చేయను న్నట్టు చెప్పారు. పాదచారుల జోన్‌లు, చిల్డ్రన్స్ థీమ్స్ పార్కులు, ఎంటర్ టైన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. పర్యావరణ పద్దతిలో మూసి నదిని అభివృద్ధి చేస్తామని భట్టి తెలిపారు.
రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామన్నారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. రుణమాఫీ విధివిధానాలను త్వరలోనే ఖరారు చేయబోతున్నామని చెప్పారు. 2 లక్షలలోపు రుణాలను మాఫీ చేస్తామని తెలిపారు.రైతుబంధు మంచి పథకమే అయినప్పటికీ… సాగు చేయనివారికి కూడా పథకం వర్తింపజేయడం సరికాదని భట్టి అభిప్రాయ పడ్డారు. రైతుబంధు నిబంధనలను సవరిస్తామని చెప్పారు. రైతుభరోసా కింద పంటపెట్టుబడి సాయం అందజేస్తామని తెలిపారు. ఇక, బడ్జెట్ లో ఆరు గ్యారెంటీలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. 6 గ్యారెంటీల అమలు కోసం 53 వేల 196 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇందులో భాగంగానే అర్హులైన లబ్దిదారులు అందరికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించేందుకు సిద్ధమవుతున్నట్లు మంత్రి భట్టి తెలిపారు. త్వరలోనే ఈ హామీకి సంబంధించి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. అలాగే, మహాలక్ష్మి పథకం కోసం ఆర్టీసీకి ప్రభుత్వం నెలకు 300 కోట్ల రూపాయలను చెల్లిస్తోందని భట్టి విక్రమార్క చెప్పారు.రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు సత్వర చర్యలు తీసుకున్నామన్నారు ఆర్థిక మంత్రి భట్టి. ధరణి పోర్టల్ పై అధ్యయనం చేయడానికి ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. ధరణి కొంతమందికి భరణంగా మరికొంత మందికి ఆభరణంగా, చాలా మందికి భారంగా మారిందని తెలిపారు. గత ప్రభుత్వ తప్పులతో ఎంతోమంది సొంత భూమిని కూడా అమ్ముకోలేక పోయారని భట్టి చెప్పారు.