29.4 C
Hyderabad
Tuesday, July 8, 2025
spot_img

అభివృద్ధికి ఆమడదూరంలో కొండపి

    కొండపి నియోజకవర్గం ఒక్క మాటలో చెప్పాలంటే దీని ప్రత్యేకతే వేరు. 2019 లో రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి వీస్తే, కేవ లం ఒక వెయ్యి నాలుగువందల ఇరవై నాలుగు ఓట్ల స్వల్ప తేడాతో పడుతూ లేస్తూ సైకిల్ విజయం సాధించింది. ఈ ఓటమికి కారణం ఎవరు? వైసీపీలో సొంత నేతలే కొంప ముంచారా? బహు నాయకత్వంతో వైసీపీ వర్రీ అవుతోందా? నియోజక వర్గ ముఖచిత్రం ఎలా ఉంది? కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత మార్పులేమైనా వచ్చాయా? లేదా అనే వివరాల్లోకి వెళదాం.

    ఒంగోలుకి 40 కి.మీ దూరంలో ఉన్నా అభివృద్ధికి మాత్రం ఆమడదూరంలోనే కొండపి నియోజకవర్గం ఉండిపో యింది. గతంలో జనరల్ నియోజకవర్గంగా ఉండి, 2009లో ఎస్సీ రిజర్వ్ అయ్యింది. ఇటు ఒంగోలు, అటు కందు కూరు, మార్కాపురం నియోజకవర్గాలను ఆనుకొని నియోజకవర్గం ఉంది. పొగాకు క్రయవిక్రయాల్లో జిల్లాలోనే నెంబర్ వన్ గా టంగుటూరు మండలం ఉంది. ఇక సింగరాయకొండ మండలం మత్స్య సంపదకు పెట్టింది పేరు. తీర ప్రాంత గ్రామాలు నిత్యం కళకళలాడుతూ ఉంటాయి. ఈ రెండు మండలాల నుంచి దేశ విదేశాలకు ఎగుమతులు-దిగుమతు లు జరుగుతూ ఉంటాయి. కొండపి నియోజకవర్గం 1955లో ఏర్పడింది. ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ 9 సార్లు, తెలుగుదేశం 4 సార్లు, కమ్యూనిస్టులు ఒకసారి విజయం సాధించారు. నియోజకవర్గ కేంద్రం కొండపి అయినా, టంగుటూరు మండలం నుంచే రాజకీయమంతా నడుస్తూ ఉంటుంది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్నిరకాలుగా నియోజకవర్గానికి టంగుటూరు కేంద్రబిందువుగా మారింది. సింగరాయకొండ కూడా నియోజకవర్గానికి పట్టుగొమ్మ అని చెప్పాలి. ప్రజలు ఆర్థికంగా బలోపేతం కావడానికి ఈ మండలమే ఆధారమని చెప్పాలి.

    నియోజకవర్గంలో అత్యధికంగా ఎస్సీలు ఉన్నారు. తర్వాత బీసీ, కమ్మ ఉన్నారు. ఈ మూడు సామాజికవర్గాలదే ఆధిపత్యం అని చెప్పాలి. అయితే కొండపి జనరల్ కేటగిరిగా ఉన్నప్పుడు 11 సార్లు జరిగిన ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే ఎమ్మెల్యేలయ్యారు. ఆఖరికి 1972లో కమ్యూనిస్టుగా గెలిచిన దివ్వి శంకరయ్య కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం.అయితే 2009 లో ఎస్సీ రిజర్వేషన్ కావడంతో వీరి ప్రభావానికి బ్రేక్ పడింది. 2019లో అంతటి వైసీపీ ప్రభంజనంలో కూడా కొండపి నుంచి తెలుగుదేశం అభ్యర్థి డోలా శ్రీ బాల వీరాంజ నేయ స్వామి గెలుపొందారు. తెలుగుదేశానికి ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో ఈయన కూడా ఒకరు. అయితే ఆయన కేవలం 1424 ఓట్ల తేడాతో మాత్రమే గెలిచి, బతుకుజీవుడా…అని ఒడ్డున పడ్డాడు. గతంలో ఇక్కడ నుంచి జీవీ శేషు, దామరచర్ల ఆంజనేయులు ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులయ్యారు. అలాగే తండ్రీ కొడుకులను గెలిపించిన చరిత్ర కూడా కొండపికి ఉంది. గుండపనేని పట్టాభి రామస్వామి వారసుడిగా వచ్చిన అచ్యుత్ కుమార్ కూడా ఎమ్మెల్యేగా గెలుపొందారు.

    కొండపి నియోజకవర్గం చుట్టూ బోరు బావి ఆధారంగా సాగు చేసే పంట పొలాలు కనిపిస్తుంటాయి. వ్యవసాయమే ఇక్కడి ప్రజల జీవనాధారం. చారిత్రక దేవాలయాలు కొలువుదీరి ఉన్నాయి. ఇక్కడ నుంచి సినిమా ఇండస్ట్రీకి వెళ్లి రాణించినవాళ్లున్నారు. కమ్యూనిస్టులకి పట్టం కట్టిన చరిత్ర ఇక్కడ ప్రజలకు ఉంది. అలాగే రాజకీయంగా ఎదిగిన కుటుంబాలున్నాయి. మంత్రులైనవారున్నారు. అయితే ఇవన్నీ డబ్బాలు కొట్టుకోడానికే తప్ప, నియోజకవర్గానికి ఉపయోగం లేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు.

     సింగరాయ కొండ కు సమీపంలో ఆహ్లాదకరమైన తీర ప్రాంతం ఉంది. పాకల, ఉళ్లపాలెం గ్రామాల్లో బీచ్ లు ఉన్నా యి. అయితే పాకల బీచ్ కు రోడ్డు సౌకర్యం ఉండటంతో బాగా అభివృద్ధి చెందింది. తగినన్నిసౌకర్యాలు ఉండటంతో దూరప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. రాత్రిళ్లు ఉండాలనుకునేవారు ఉంటూ ఉంటారు. ఆదివారాలు,’సెలవు రోజులు, పండుగ రోజుల్లో వచ్చేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివ్రద్ధి చేయాలనే ప్రతిపాదనలున్నా, ఏ ఎమ్మెల్యే కూడా స్పందించ లేదనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తుంటాయి. ఎన్నికల సమయంలో ఇవన్నీ తెరపైకి వస్తుంటాయి. ఎన్నికలు కాగానే ఆ సముద్రపు కెరటాల్లాగే మాయమైపోతాయని స్థానికులు నిర్వేదంగా చెబుతుంటారు.నియోజకవర్గంలో వీటితో పాటు అత్యంత ప్రసిద్ది చెందిన శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం సింగరాయ కొండలోనే ఉంది. దీనికి పురాణ ప్రాశస్త్యం కూడా ఉంది. త్రేతా యుగంలో శ్రీరాముడు విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టుగా చెబుతారు. నాడు బ్రిటిష్ పాలకులు వ్యాపార లావాదేవీల కోసం పడవల మీద ఇక్కడ సముద్రతీరానికి వచ్చేవారు. ఒడ్డుకి రాగానే అవి అగ్నికి ఆహుతి అయ్యేవట. దీంతో స్వామి వారి మహిమగా గుర్తించి, వారు చేసే వ్యాపారంలో కొంత భాగాన్ని స్వామివారికి కప్పంగా సమర్పించేవారు. దానినే శాసనంగా కూడా మార్చారు. వాళ్లు వెళ్లిపోయిన భారత ప్రభుత్వం కూడా తహశీల్దార్ల ద్వారా కప్పం చెల్లించేదని అంటారు.

     చెన్నై- కోల్ కత్తా జాతీయరహదారిపై ఒంగోలు, నెల్లూరు జిల్లాల మధ్య కొండపి నియోజకవర్గం ఉంది. మండలా లను చూస్తే …టంగుటూరు, సింగరాయకొండ, కొండపి, మర్రిపూడి, పొన్నలూరు, జరుగుమల్లి నియోజకవర్గంలో 6 మండలాలున్నాయి. మూడు మండలాలైన కొండపి, టంగుటూరు, సింగరాయకొండ ను అనుకొని మూసీనది ప్రవహిస్తూ ఉంటుంది. ప్రస్తుతం అది జీవం కోల్పోయి ఉంది. దానిని పట్టించు కునే నాథుడే లేడు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు. కానీ అధికారంలో వైసీపీ ప్రభుత్వం ఉంది. అందుకనేం చేయలేకపోతున్నామని ఎమ్మెల్యే శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటాడు. అయితే 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈయనే ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడెందుకు? చేయలేకపోయారంటే ఆయన దగ్గర ఆన్సర్ లేదు.

      కొండపి నియోజకవర్గంలో రైతులు వాణిజ్య పంటలపై ఆసక్తి ఎక్కువ చూపిస్తుంటారు. ముఖ్యంగా పొగాకును అధికంగా సాగు చేస్తారు. అందువల్ల ప్రతి ఏడాది ఇక్కడి వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి దేశవిదేశాలకు పొగాకు ఎగుమతులు అధికంగా జరుగుతుంటాయి. నియోజకవర్గ పరిధిలోని టంగు టూరు, సింగరాయకొండలలో పొగాకు అధారిత కంపీనీలు ఉన్నాయి. తీరప్రాంతానికి దగ్గరలో ఉన్న టంగుటూరు, సింగరాయకొండలలో అనేక రొయ్యల చెరువులతోపాటు ఆక్వా ఆధారిత పరిశ్రమలు ఉన్నాయి. వరి ప్రధాన పంటగా ఉంది. అయితే బోర్లు లేనిచోట ఎక్కువ వర్షాధార భూములున్నాయి. వరుణుడు కరుణిస్తేనే, ఈప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. ఇప్పటికి సాగు నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు.

       రాజకీయంగా చైతన్యం తప్ప, నియోజకవర్గ పరంగా అభివృద్ధి శూన్యం. సంఘమేశ్వర ప్రాజెక్టు పూర్తి కాలేదు. 15 ఏళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. ఇప్పటికి వర్షాధారంపైనే ఆధార పడాలి. లేదంటే బోర్ల మీద ఆధారపడి చేయాలి. తీర ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదు. సింగరా యకొండలో ఆలయ మన్యం భూముల సమస్య పరిష్కారం కాలేదు. అక్కడ క్రయవిక్రయాల్లేక ప్రజలు అల్లాడిపోతున్నారు.ఇక్కడ ప్రధానంగా నీటి సమస్య తీరాలంటే సంఘమేశ్వర ప్రాజెక్టు పూర్తి కావాలి. అది జరిగితే సుమారు 10వేల ఎకరాల భూములకు సాగునీరు అందుతుంది. ఎప్పుడో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన పనులే తప్ప, నేటికి ముందడుగు పడిన దాఖలాలు లేవు. ఆ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందా? అని ఇక్కడి ప్రజలు ఎదురుచూస్తుంటారు. అందువల్ల నీరు లేక, పంటలు పండక ఉపాధి లేక, ప్రజలు ఎక్కువగా వలసలు వెళ్లిపోతుంటారు. పిల్లా పాపలను వదిలేసి కొందరు, తల్లి దండ్రులను వదిలేసి కొందరు వెళుతుంటారు. బొంబాయి, బెంగళూరు లాంటి మహానగరాలకు వెళ్లి భవన నిర్మాణ రంగంలో కూలీలుగా పనిచేస్తుంటారు. అవకాశం ఉన్నవాళ్లు గల్ఫ్ దేశాలకు వెళుతుం టారు. టంగుటూరు మండల పరిధిలో ఎర్పాటు చేసిన పొగాకు గ్రేడింగ్ కేంద్రాలు కొంతమంది మహిళల కు ఆసరాగా నిలుస్తున్నాయి.

    టంగుటూరు, సింగరాయ కొండలలో రైల్వేస్టేషన్లు పేరుకే ఉన్నాయి. వీసమెత్తయినా అభివ్రద్ధి కనిపించదు. కొన్ని పాసింజర్ రైళ్లు తప్ప ఎక్స్ ప్రెస్ లకు హాల్ట్ లేదు. దూరప్రాంతాలకు వెళ్లేవాళ్లు దగ్గరలోని ఒంగోలు స్టేషన్ కు వెళ్లి రైలు ప్రయాణం చేస్తుంటారు. ఆఖరికి తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లాలన్నా ఒంగోలు వెళ్లాల్సిందే. రైల్వే సౌకర్యం ఉన్నచోట వ్యాపారాలు బాగుంటాయని అంటారు. ఆ అదృష్టం కూడా నియోజకవర్గానికి లేదు. ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆపడానికి నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రయత్నించిన పాపాన పోలేదనే విమర్శలున్నాయి. రాజకీయంగా ఎదగడా నికి, ఒకడిని ఒకడు తొక్కే డానికి తమలో తాము కొట్టుకోవడమే తప్ప నియోజకవర్గానికి చేసిందేమీ లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండపి నియోజకవర్గంలో జన్మించి వివిధ ప్రాంతాల్లో స్థిరపడినవారున్నారు. వీరిలో ప్రము ఖులు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో దర్శకులుగా చక్రం తిప్పిన స్వర్గీయ టి.కృష్ణ, బి . గోపాల్, ఇంకా హీరోలు టి . గోపిచంద్, టి . వేణు, అలాగే నటుడు నర్రా వెంకట్రావు ఇక్కడి వారే.ప్రముఖ రాజకీయనాయకులు ఉన్నారు. వీరిలో మంత్రులుగా చేసినవారిలో గంటా శ్రీనివాసరావు, బాలినేని శ్రీనివాసరెడ్డి, జూపూడి ప్రభాకరరావు తదితరులున్నారు.

    కొండపి నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2 లక్షల 35 వేల 960 మంది ఉన్నారు. వీరిలో పురుషుల సంఖ్య 1 లక్షా 16 వేల 837 మంది అయితే, మహిళలు 1 లక్షా 19 వేల 121 మంది ఉన్నారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించిన తెలుగుదేశం అభ్యర్థి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి 98వేల 142 ఓట్లు సాధించారు. సమీప వైసీపీ అభ్యర్థి మాదాసి వెంకయ్య 97వేల 118 ఓట్లు సాధించారు.కేవలం ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై నాలుగు ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. బీఎస్పీ అభ్యర్థికి 2 వేల 983 ఓట్లు వస్తే, నోటా కింద 2 వేల 99 ఓట్లు పోలయ్యాయి. కొండపి నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు తీయాలంటే ప్రజలే ముందడుగు వేయాలి. టంగుటూరు, సింగరాయకొండ రెండు మండ లాలని మున్సిపాలిటీలుగా మార్చి, పట్టణాలుగా అభివృద్ధి చేయాలి. తీర ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి. అలాగే దేశ విదేశాలకు ఎగుమతులవుతున్న పొగాకు ఉత్పత్తులకు తగినట్టుగా ట్రాన్స్ పోర్టు ఇతర రంగాల్లో ప్రోత్సాహకాలు ఇచ్చి ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలి. ఇవి ఎవరైతే చేస్తారో వారికే ఈసారి ఓటు వేయాలని యువత డిమాండ్ చేస్తోంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్