సిద్ధం సభకు జనాన్ని తరలించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అబద్దాలను తెరపైకి తీసుకువచ్చింది. రాప్తాడు సభ లో ఎన్నికల మేనిఫెస్టో ప్రకటన అంటూ భారీగా జన సమీకరణ చేసింది. సిద్ధం సభలో రైతు రుణమాఫీ ప్రకటిస్తారం టూ పెద్ద ఎత్తున వైసీపీ నేతలు ప్రచారం చేశారు. అయితే సీఎం జగన్ ఎక్కడ మేనిఫెస్టో గురించి కానీ, రైతు రుణమాఫీ గురించి కానీ మాట్లాడకపోవడంతో సభకు వచ్చిన జనాలు పెదవివిరుస్తున్నారు. కేవలం సిద్దం సభ నీ విజయవంతం చేసుకోవడం కోసమే మేనిఫెస్టో అంటూ తప్పుడు ప్రచారం చేశారని మండిపడుతున్నారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు కార్యకర్తలను సన్నద్ధం చేసేందుకు సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. విశాఖజిల్లా భీమిలి, ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గాల్లో సభలు నిర్వహించిన జగన్, తాజాగా అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించారు. రాయ లసీమ ఉమ్మడి నాలుగు జిల్లాల నుంచి ఈ సభకు పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు నేతలు తరలివచ్చారు. దాదాపుగా 10లక్షల వరకు కార్యకర్తలు ఈ సభకు తరలివ చ్చినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ ఇంత పెద్ద భారీ సభ జరిగిన సందర్భం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి.
పెద్ద ఎత్తున జనాన్ని తరలించేందుకు వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాన్ని ఎన్నుకున్నారనే విమర్శలు సొంత పార్టీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. రాప్తాడు సిద్ధం సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటిస్తారంటూ కొద్దిరోజులుగా వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అంతేకాకుండా మొదటిసారిగా రైతు రుణమాఫీ పైన సీఎం జగన్ ప్రకటన చేసే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చారు. ఒక్కో రైతుకు లక్షన్నర రుణమాఫీ చేసే అవకాశం ఉందని, ఈ అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టో ద్వారా రాప్తాడు బహిరంగ సభలో ప్రకటించబోతున్నారంటూ పార్టీ కేడరకు రైతులకు ఆశలు కల్పించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అంతేకాకుండా డ్వాక్రా రుణమాఫీ, దీంతోపాటు ఇతర కీలక అంశాలకు సంబం ధించిన మేనిఫెస్టోను జగన్ ప్రకటిస్తారంటూ వైసీపీ నేతలు పదేపదే ప్రచారం చేశారు. దీంతో రాయలసీమ నాలుగు జిల్లాల నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున వైసీపీ నేతలు కార్యకర్తలు రాప్తాడు సిద్ధం సభకు తరలివచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టో ఎలా ఉంటుంది… ఏ ఏ అంశాలు ప్రకటిస్తారో అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగంలో ఎక్కడ వచ్చే ఎన్నికలకు సంబం ధించి మేనిఫెస్టో పై ప్రకటన చేయలేదు. ఇక రైతు రుణమాఫీ అంశానికి సంబంధించి కనీస ప్రకటన కూడా చేయకపో వడంతో సభకు వచ్చిన వైసీపీ కార్యకర్తలు తీవ్ర నిరాశ చెందారు. కేవలం రాప్తాడు సభను విజయవంతం చేయడం కోసమే మేనిఫెస్టో అంటూ తప్పుడు ప్రచారం చేశారని సభకు వచ్చిన కార్యకర్తలు నేతలు మండిపడుతున్నారు.
కొత్త మేనిఫెస్టో సంగతి పక్కన పెడితే గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు విషయంలోనూ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగంపై రాప్తాడు సభకు వచ్చిన నేతలు కార్యకర్తలలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. గత ఎన్ని కలకు ముందు వైసీపీ అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తాం, బెల్ట్ షాపులు రద్దు చేస్తామంటూ ఎన్నికల హామీని ఇచ్చారు. కానీ ఆ హామీ ఇంతవరకు ఎక్కడా అమలు కాలేదు. పైగా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిం చడం పైన తీవ్ర విమర్శలు ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల సిపిఎస్ రద్దు చేస్తామని గత ఎన్నికలకు ముందు సీఎం జగన్ హామీ ఇచ్చారు. కానీ ఆ హామీని తుంగలో తొక్కి జిపిఎస్ పేరుతో కొత్త స్కీమ్ తీసుకు రావడం పై ఉద్యోగులు మండిపడుతున్నారు. మరోవైపు ప్రతి యేటా జాబు క్యాలెండర్ ప్రకటిస్తామంటూ ఎన్నికల కు ముందు యువతకు సీఎం జగన్ హామీ ఇచ్చారు. కానీ ఆ హామీని సైతం అమలు చేయడం లేదు. దీంతో నిరుద్యోగు లు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అయినా సీఎం జగన్ మాత్రం మేనిఫెస్టోలో పెట్టిన 99 శాతానికి పైగా హామీలు అమలు చేశామని చెప్పడం ఆ పార్టీ నేతలకే నమ్మశక్యంగా లేదు అనే వాదన వినిపిస్తోంది. ఒకవైపు సీఎం జగన్ ఎన్నికల హామీలు అమలు చేశామంటూ కార్యకర్తల్ని ప్రజల్లోకి వెళ్లాలని చెప్తున్నారు. అయితే లేవనెత్తితే ఏం సమాధానం చెప్పాలంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు వైసిపి కార్యకర్తలు. మొత్తం మీద సిద్ధం సభలను విజయవంతం చేయడం కోసం వైసీపీ నేతలు మేనిఫెస్టో అని అబద్ధాన్ని ప్రచారం చేశారని వాదన రాప్తాడు సభ తర్వాత వినిపిస్తోంది.


