27.1 C
Hyderabad
Monday, July 14, 2025
spot_img

అంగన్ వాడీ వర్కర్లపై కన్నెర్ర చేసిన ఏపీ సర్కార్

        అంగన్‌వాడీ వర్కర్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. సమ్మె చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలను ఎస్మా చట్టం పరిధిలోకి తీసుకువచ్చింది.ఈ మేరకు జీవో నెం.2 విడుదల చేసింది. అయితే అసలు అత్యవసర సర్వీ సుల కిందకు అంగన్‌వాడీలు ఎలా వస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన వివరణ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అంగన్‌  వాడీలు సమ్మె చేయడం వల్ల చిన్నారులకు, బాలింతలకు పోషకాహారం అందదు అనే ఓ వింత వాదనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చింది.

     సమ్మె చేస్తున్న అంగన్‌వాడీ వర్కర్లపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ కన్నెర్ర చేసింది. తమ డిమాండ్ల సాధన కోసం ఇరవై ఆరు రోజులకు పైగా శాంతియుతంగా సమ్మె చేస్తున్న అంగన్‌వాడీ వర్కర్లపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. ఎస్మా చట్టాన్ని ప్రయోగించడానికి వీలుగా అంగన్‌వాడీలను అత్యవసర సర్వీసుల క్రిందకి తీసుకొస్తూ జీవో నెంబరు 2న ఆంధ్రప్రదేశ్ సర్కార్ విడుదల చేసింది. జీవో నెంబరు 2 ప్రకారం అంగన్‌వాడీ వర్కర్లు ఆరునెలల పాటు ఎటువంటి సమ్మెలు చేయరాదు. అంతేకాదు నిరసన ప్రదర్శనలు చేయడాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ సర్కార్‌ నిషేధించింది.

        కథ అక్కడితో ఆగలేదు. ఏపీ సర్కార్ మరో దారుణానికి ఒడిగట్టింది. ఇప్పటివరకు సమ్మె చేసిన కాలానికి అంగన్‌ వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనంలో కోత విధించింది. నెలనెలా వర్కర్ల ఖాతాలో పడుతున్న రూ. 10 వేల వేతనం స్థానంలో ప్రభుత్వం ఈ నెల రూ.8050 మాత్రమే జమ చేసింది. ఎసెన్షియల్‌ సర్వీసెస్‌ మెయింటెనెన్స్‌ యాక్ట్‌నే సంక్షిప్తంగా ఎస్మా చట్టం అంటారు. ఎస్మా చట్టం ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ వర్తించదు. కేవలం ప్రజలకు సంబంధించిన అత్యవసర సేవల నిర్వహణలో పాల్గొనే సర్వీసులకే ఎస్మా చట్టం వర్తిస్తుంది. సమ్మెలు, బంద్‌ల వల్ల ప్రజల దైనందిన జీవనానికి ఇబ్బంది కలగకుండా చూడటమే ఎస్మా చట్టం ముఖ్యోద్దేశం. ప్రజలకు అవసరమైన కొన్ని రకాల అత్యవసర సేవల నిర్వహణకు ఎటువంటి ఆటంకం లేకుండా చూడటం కోసం 1981లో ఎస్మా చట్టాన్ని రూపొందించారు.ఎస్మా చట్టాన్ని ఒక్కోసారి అవసరార్థం పొడిగిస్తుంటారు కూడా. ఈ చట్టం ప్రకారం సమ్మె చేస్తున్న అత్యవసర సేవల ఉద్యోగులపై చర్య లు తీసుకోవచ్చు. సదరు ఉద్యోగులను సస్పెండ్ చేయడం, అవసరమైతే సర్వీసు నుంచి ఏకంగా డిస్మిస్‌ చేసే అధి కారం కూడా ప్రభుత్వాలకు ఉంటుంది. వీటితోపాటు సమ్మె చేస్తున్న ఉద్యోగులను ప్రాసిక్యూట్ చేసే అధికారం కూడా ప్రభుత్వాలకు ఉంటుంది.

     అంగన్‌వాడీ వర్కర్లపై ఎస్మా చట్టం ప్రయోగిస్తూ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఉత్తర్వులు జారీ చేయడం అందరినీ ఆశ్చర్యపరచింది.అసలు అత్యవసర సర్వీసుల కిందకు అంగన్‌వాడీలు ఎలా వస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. సహజంగా ప్రజల దైనందిన జీవితాలపై ప్రభావం చూపే రవాణా, విద్యుత్ లాంటి సర్వీసులనే అత్యవసర సేవలుగా పరిగణిస్తారు. అంగన్‌వాడీ వర్కర్లు సమ్మె చేస్తే, ఆ ప్రభావం ప్రజల దైనందిన జీవితాలపై ఏ విధంగానూ ఉండదంటారు సామాజిక శాస్త్రవేత్తలు. అంగన్‌వాడీలను ఎవరైనా ఒక పరిమిత గ్రూపుగానే చూస్తారు. సామూహికంగా ప్రజలు ఇబ్బంది పడటం అనేది అంగన్‌వాడీలు సమ్మె వల్ల జరగదు. అయితే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న వివరణ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

       2013 జాతీయ ఆహార భద్రత చట్టంలోని సెక్షన్ 39 కింద అంగన్‌వాడీలు అత్యవసర సర్వీసులు కిందకు వస్తాయని ఓ వింత వాదనను తెరమీదకు తీసుకువచ్చింది. అంగన్‌వాడీలు సమ్మె చేయడం వల్ల చిన్నారులకు, బాలింతలకు పోషకాహారం అందదు అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చన వాదన. ఎస్మా చట్టం కొత్తది కాదు. కొన్ని దశాబ్దాల నుంచి ఉన్న చట్టమే ఇది. అయితే కార్మికుల, ఉద్యోగుల సమ్మె హక్కును హరించే ఈ చట్టాన్ని ప్రభుత్వాలు చాలా తక్కువ సార్లు ప్రయోగించాయి. ఒకటికి పదిసార్లు ఆలోచించి ఇక తప్పదు అనుకున్న పరిస్థితుల్లోనే ఎస్మా చట్టాన్ని ప్రయోగించాయి. ఎస్మా చట్టం అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది జయలలిత సర్కార్ నిర్వాకం. 2003లో తమిళనాడు ప్రభుత్వ ఉపాధ్యాయులు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో అప్పట్లో తమిళనాట అధికారంలో ఉన్న జయలలిత ప్రభుత్వం ఏకంగా ఎస్మా ప్రయోగించింది. ఎస్మా చట్టాన్ని అడ్డుపెట్టుకుని తమిళనాడు వ్యాప్తంగా దాదాపు 1,70,000మంది టీచర్లను విధుల్లోంచి తొలగించింది.

           2006లో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా విమానాశ్రయాల సిబ్బంది సమ్మెకు దిగారు. ఈ నేపథ్యంలో విమానయాన మంత్రిత్వ శాఖ, సమ్మె చేస్తున్న వారితో చర్చలు జరిపింది. ఈ సందర్భంగా విమానాశ్రయాల సిబ్బంది కేంద్ర ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు పెట్టింది. అయితే ఈ డిమాండ్లను విమానయాన మంత్రిత్వ శాఖ ఆమోదించలేదు. దీంతో విమానాశ్రయాల సిబ్బంది సమ్మెకు దిగారు. ఫలితంగా దేశవ్యాప్తంగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది.

          2009లో ట్రక్కు రవాణాదారులు సమ్మె చేసినప్పుడు కూడా అత్యవసర సేవల నిర్వహణ చట్టాన్ని ప్రయోగించారు. ట్రక్కు రవాణాదారుల సమ్మె వల్ల మార్కెట్‌లో నిత్యావసర వస్తువులకు తీవ్ర కటకట ఏర్పడింది.బ్లాక్ మార్కెటింగ్ పెరిగింది. కాగా 2009 ఏడాదిలోనే చమురు, గ్యాస్‌ సిబ్బంది సమ్మె చేశారు. అప్పుడు కూడా చర్చలు ఫెయిల్ అయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. అంతేకాదు 2019లో తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నప్పుడు ఒక దశలో ఎస్మా ప్రయోగించడానికి అప్పటి కేసీఆర్ ప్రభుత్వం సిద్ధపడింది. అయితే చివరిక్షణంలో ఆ ఆలోచనను విరమించుకుంది. మొత్తంమీద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీ వర్కర్లను చర్చలకు పిలిచి, సమస్యకు పరిష్కారాన్ని కనుగొనాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షసాధింపునకు దిగిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్