విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అంటే ఒక ప్రత్యేకత సంతరించుకుంది. విజయవాడ నడి బొడ్డున ఉండే ఈ నియోజకవర్గం రాజకీయంగా, విద్యా, వ్యాపారానికి ఒక ప్రధాన ఆయుపట్టుగా ఉంటుంది. అంతే కాకుండ విజయవాడ నగరంలో ఏలూరు రోడ్డు, బందర్ రోడ్డు, బిఆర్టియస్ రోడ్డు ల ను కలిపే విధంగా రహదారులు సైతం ఉండే ఒక ప్రధాన నియోజకవర్గం గా చెప్పుకోవచ్చు.ఈ నియోజ కవర్గం 2008 సంవత్సరంలో స్థాపించటంతో సరికొత్త ఒరవడి ఏర్పడింది.22 వార్డులతో కూడిన మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటున్న ఈ నియోజకవర్గంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
విజయవాడ నగరం అంటే ప్రతి ఒక్కరు చూడాల్సిందే అని చెప్పుకునే ప్రదేశం. ఇక్కడ రాజకీయ చరిత్ర అనేది కథలు కథలుగా చెప్పుకుంటారు. గతంలో రక్త చరిత్ర కలిగిన నియోజకవర్గం కావటంతో ప్రతి ఒక్కరికి విజయవాడ నగరం అంటే ఒక విధంగా భయందోళనకి గురైన పరిస్థితులు కూడా ఉండేవి. ఇక్కడ ప్రధాన ప్రభుత్వ కళాశాలలు ఉండేవి. కళాశాలలో రాజకీయం సైతం ఉందంటే ఇక్కడ రాజకీ యాలకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అర్ధమయ్యేది.ఇక కాల క్రమేణా రక్త చరిత్ర బ్యాక్ గ్రౌండ్ కి స్వస్తి పలకటంతో విద్యా, వర్తకం వ్యాపార వాణిజ్య కేంద్రాలకి స్వాగతం పలికారు.
విజయవాడసెంట్రల్ నియోజకవర్గం లో ఉన్న మహాత్మా గాంధీ రోడ్ కు మరొక ప్రముఖ పేరు బందరు రోడ్ గా పేరుంది.భారతీయ నగరాల్లో ఒకటి అయిన విజయవాడలో ఒక ప్రధాన రహదారిగా ఉంది.ఈ రోడ్డు లీలా మహల్ థియేటర్ వద్ద మొదలవుతూ మచిలీపట్నం వరకు సాగుతుంది. బందరు కాలువకు సమాంతరంగా ఈ రోడ్డు విస్తరించింది. ఈ బందరు రోడ్ రహదారికి సమాంతరంగా, నేషనల్ హైవే 9 బందరు కాలువకు మరొక వైపు కొనసాగుతూ బెంజ్ సర్కిల్ వద్ద బందరు రోడ్ లోకి విలీనం అవుతుంది. ప్రస్తుత మచిలీపట్నం పూర్వపు నామము బందరు.దీని అధికారిక పేరు ఇరవయ్యో శతాబ్దంలో భారతీయ స్వాతంత్ర్య ఉద్యమం స్ఫూర్తి దాయక నాయకుడు మహాత్మా నుండి వచ్చింది.
ఈ విజయవాడలో ఒకప్పుడు రాజుల కాలం నాటి గుహలు సైతం మనకి ఇంకా కనిపిస్తాయి. మొగలరాజపురం గుహలు అంటే ప్రతి ఒక్కరికి తెలిసిన ప్రదేశం.ఒకప్పుడు విజయవాడ విష్ణుకుండి నుల్లో కొందరి రాజధానిగా ఉండేది. విష్ణుకుండిన వంశ రాజైన మాధవ వర్మ విజయవాడ కేంద్రంగా పరిపాలించాడు. అతని కుమారుడు నగరంలో రథం నడుపుతూ బాటపక్కన చింతచిగురు అమ్మే ముసలమ్మ కుమారుడిపై రథాన్ని ఎక్కించాడు. ఆ పిల్లాడు చనిపోయాడు. మహారాజు పుత్రవాత్సల్యాన్ని పక్కనపెట్టి శిక్షగా అదే రథం మీద ఎక్కించి రాకుమారుడిని చంపాలని ఆజ్ఞాపించాడు. మల్లీశ్వరాల యంలో బయటపడ్డ విష్ణువర్ధనుని శాసనం, మరోచోట లభించిన కల్యమబోయ శాసనం, విజయనగరం జమీందారుల వంశ చరిత్ర.అక్కన్న, మాదన్న గుహలు, మొగల్రాజపురం గుహలు 3, 4 శతాబ్దాలకు చెందినవి కావటంతో ఇవి బౌద్ధారామాలనీ, తర్వాతి కాలంలో శైవులకు ఆలవాలమై శైవ దేవతా ప్రతిమలు అక్కడ ఏర్పడ్డాయని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. మరికొందరు ఆ వాదాన్ని తిరస్కరిస్తూ ఇవి హిందూ సంబంధ ఆరాధనా స్థలాలేనని వాదిస్తున్నారు. వీటిని విజయవాడను పరిపాలించిన శాలంకాయనులు కానీ, కృష్ణకు దక్షిణాన పాలించిన పల్లవులు కానీ నిర్మించారని భావిస్తున్నారు.
స్వాతంత్రోద్యమం నుంచి నియోజకవర్గానికి ఎంతో చరిత్ర ఉంది. విశ్వనాథ సత్యనారాయణ, మంగళం పల్లి బాలమురళీకృష్ణ వంటి వారు ఈ ప్రాంతానికి చెందిన వారే . ఘంటసాల సంగీత కళాశాల, రామకోటి మైదానం ఎంతో ప్రసిద్ధి చెందినవి.ఈ నియోజకవర్గంలో గవర్నర్‌పేట, లెనిన్‌సెంటర్, బీసెంట్ రోడ్డు వ్యాపార, వాణిజ్య కేంద్రాలుగా భాసిల్లుతున్నాయి. వైద్యశాలలకు కేంద్రంగా ఉంది. జాతిపిత మహాత్మా గాందీ నడయాడిన గాంధీనగరం ఈ నియోజకవర్గంలోనే ఉంది.ఎంతో చరిత్ర కలిగిన స్వరాజ్ మైదానం, జింఖానా మైదానాలు ఈ నియోజకవర్గంలోనివే. .నియోజకవర్గ పరిధిలోని ఘంటసాల సంగీత కళాశాల ఎంతో సుప్రసిద్ధమైనది, 107 సంవత్సరాల కిందట నిర్మించిన కాశీవిశ్వేశ్వర దేవాలయాలు ప్రసిద్ధి చెందినవి ఉన్నాయి.
విద్యలతో పాటు ఈ నియోజకవర్గంలో ప్రధానంగా చెప్పాలంటే సినిమా థియేటర్ లు ఎక్కువుగా ఉంటాయి. తమ అభిమాన నటుడి చిత్రం విడుదల అయిందంటే థియేటర్ లు పెళ్లి కూతురు ల ముస్తబు చేసి అంగరంగ వైభవంగా వాటికీ స్వాగతం పలుకుతారు. సినిమా చూడాలంటే గాంధీ నగర్ సెంటర్ కి ప్రతి ఒక్కరు రావాల్సిందే.అంతే కాకుండా సినిమా హిట్టా? ఫట్టా? అనేది కూడా ఇక్కడ నుంచే టాక్ తీసుకునేవారు సినీ ఇండస్ట్రీ పెద్దలు. దీనితో సినిమా విడుదల అయిందంటే విజయవాడ టాక్ ఏవిధంగా ఉందొ చూసి సినిమా సక్సెస్ నీ చెప్పేసేవారు. అలా తమ అభిమాన హీరో ల సందడి అనేది అంతా ఇంతా కాదు అనేలా ఉండేది. బ్యానర్ల తో విజయవాడ నగరం అంతా కళకళ లాడుతుంటుంది. అందుకే ఈ నియోజకవర్గంలో ఎక్కువుగా ప్రింటింగ్ దుకాణాలు ఉంటాయి.
ఇంక విజయవాడ గాంధీ నగర్ లో గుర్తొచ్చేది ధర్నా చౌక్. ఇక్కడ ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేర్చ కపోతే నిరసనలు తెలియచేసే ప్రదేశంగా చెప్పుకోవచ్చు. పెద్ద పెద్ద ధర్నాలు సైతం ఇదే ప్రదేశంలో జరగటంతో ధర్నా చౌక్ అని నామకరణం పెట్టడం జరిగింది. ఎలాంటి నిరసనలు అయిన సుదీర ప్రాంతాల నుంచి విజయవాడ బస్టాండ్, రైల్వే స్టేషన్ కి దగ్గరగా ఉండటంతో అందరికి అనువైన ప్రదేశంగా ఈ ధర్నా చౌక్ పేరు గాంచింది.సీపీఐ,సిపిఎం లాంటి ప్రధాన కార్యాలయాలు సైతం ఇదే నియోజకవర్గంలో ఉన్నాయి.ఇక ఈ నియోజకవర్గంలో మొత్తం జనాభా సుమారు 3,64,149 మంది ఉన్నట్లు సర్వే ఆధారంగా చెప్పుకోవచ్చు.రాజకీయంగా ఓటర్లు చూసుకుంటే మొత్తం ఓట్లు 2,35,723 ఉండగా అందులో పురుషుల ఓట్లు 1,15,752 మంది ఉన్నారు. స్త్రీలు 1,19,905 ఓట్లు ఉండగా ఇతరులు 66 మంది ఓటర్లు ఉన్నారు.
రాజకీయం గా చూసుకుంటే 2008 లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏర్పాటైంది. అంతకు ముందు విజయవాడ తూర్పు నియోజకవర్గం భాగంగా ఉండేది. నియోజకవర్గానికి 2009లో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్లాది విష్ణు విజయం సాధించారు.మల్లాది విష్ణుకు 52,426 ఓట్లు, ప్రత్యర్థి వంగవీటి రాధాకృష్ణకు 51,578 ఓట్లు రాగా 848 ఓట్ల మెజార్టీతో మల్లాది విష్ణు గెలు పొందారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు విజయం సాధించారు.ఈ ఎన్నికల్లో బొండా ఉమామహేశ్వరరావుకు 82,669 ఓట్లు పోలవ్వగా ప్రత్యర్థి పూనూరు గౌతంరెడ్డికి 55,508 ఓట్లు రాగా, బొండా ఉమా 27,161 ఓట్ల మెజార్టీ సాధించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పూనూరు గౌతంరెడ్డిపై బొండా ఉమామహేశ్వరరావు 27,161 ఓట్ల తేడాతో గెలుపొందారు.2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు టీడీపీ అభ్యర్థి బోండా ఉమా పై అత్యల్ప మెజారిటీ తో గెలుపొందారు. నియోజకవర్గానికి ఇప్పటి వరకు మూడు సార్లు ఎన్నికలు జరగగా ఇక్కడి ప్రజలు వేర్వేరు పార్టీలను గెలిపించారు. దీనితో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ -1, టీడీపీ -1, వైసీపీ -1 అధికారం ఛేజిక్కించుకున్నాయి


