విద్వాన్ సర్వత్ర పూజితే అంటారు. అయితే, విద్వాంసులకు, పండితులకు, గురువులకు అందరికీ గురువు విద్యాదేవత వాగ్దేవీ మాత. సరస్వతీ మాత ఉదయించిన శుభోదయ తిథి మాఘ శుద్ద పంచమి. అదే వసంత పంచమి. ఈ సందర్భంగా చిన్నారులకు చదువుల తల్లి ఆలయాల్లో పెద్ద ఎత్తున అక్షరాభ్యాసాలు జరిగాయి. దీంతో సరస్వతీ తల్లి గుడులన్నీ పిల్లల బడులుగా దర్శనమిచ్చాయి.
ప్రకృతి సొబగులకు అద్దం పట్టేలా..పూ మొగ్గలు, పిందెలు, పుష్పరాజాలు, తరువులు వికసించడం ఆరంభించే కాలం వసంత కాలం. ప్రారంభనికి సంకేతమైన వసంతంలోని పంచమి దినాన చదువుల తల్లి సరస్వతీమాత ఉద్భవించింది. వసంత ఋతువు ఆగమనానికి గుర్తుగా, జ్ఞాన, విజ్ఞాన, సాహితీ, సంగీత, కళా వైభవ దేవత సరస్వతీ అమ్మవారి జన్మదినాన్ని బసంత్ పంచమి, వసంత పంచమిగా నిర్వహించుకుంటారు. మేధో సంపత్తి, సృజనాత్మకత, తెలివి తేటల రాణింపునకు అమ్మను ఆరాధించడం అత్యంత ఆవశ్యకం. ప్రతి నిత్యం ఆరాంధించేదానికి కోట్ల రెట్ల ఫలం ఒక్క వసంత పంచమి నాడు సర్వస్వతీ అమ్మవారిని ఆరాధిస్తే కలుగుతుందని భక్తజనులు చెబుతున్నారు. అమ్మవారి జన్మించిన రోజు వసంత పంచమి నాడు భక్తులతో వాగ్దేవీ మాత ఆలయాలు కిక్కిరిసిపోవడం ప్రతి ఏటా జరుగుతుంది. ఇప్పుడు ఆ పర్వదినం కావడంతో..సరస్వతీమాత దేవళాలన్ని భక్తజన సందోహంతో నిండిపోయి ఉన్నాయి.
విశ్వవ్యాప్త కీర్తి గడించిన బాసర జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయం తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాలో నెలకొనివుంది. నిర్మల్ కు దాదాపు 75 కిలో మీటర్ల దూరంలో నిర్మల గోదావరి నది ఒడ్డున బాసర సరస్వతీ మాత ఆలయం ఉంది. దేశంలోని అష్టాదశపీఠాల్లో ఒకటిగా కాశ్మీర్ సరస్వతీ మాత ఆలయానికి పేరుంది. లంకాయాం శాంకరీ దేవి.. అంటూ మొదలయ్యే.. అష్టాదశపీఠాల్లోని అమ్మవార్ల ఆరాధన శ్లోకంలో..కాశ్మీరేతు సరస్వతి అని ఉంటుంది. అంతటి గొప్ప కాశ్మీర్ సరస్వతీ ఆలయానికి ఎంత పేరుందో.. అదే రీతిలో బాసర సరస్వతీ అమ్మవారి ఆలయానికి పేరుంది.
బాసరలో జ్ఞాన సరస్వతీ అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువై ఉన్నారు. అత్యంత రమణీయంగా ప్రకృతిసిద్ధ వాతావరణంలో నెలకొని ఉన్నఈ సరస్వతీ మందిరం చాళుక్యల కాలంలో నిర్మితమైనట్టు చరిత్ర చెబుతోంది. ఇక పురాణపరంగా చూస్తే బాసర పుణ్యక్షేత్రాన్ని వేదవ్యాసుడు ప్రతిష్ఠించినట్టు ఇక్కడి ఆలయ స్థలపురాణం తెలియజేస్తోంది. వ్యాస ప్రతిష్ఠితమైన వాగ్దేవీ అమ్మవారి ఆలయం వ్యాసపురిగా, వ్యాసరగా…కాలక్రమేణా బాసరగా మారినట్టు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలోనే వర్గల్ సరస్వతీ ఆలయానికి విశేష చరిత్ర ఉంది. బాసర తరువాతి స్థానంలో వర్గల్ సరస్వతీ అమ్మవారి ఆలయం భక్తజనులతో కళకళలాడుతోంది. కంచి శంకరమఠం ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న ఈ దేవాలయ అధిష్ఠాన దేవత సరస్వతీ అమ్మవారు. బాసర మాదిరి పిల్లల అక్షరాభ్యాసాలు, వసంత పంచమి వేడుకలు, ఇతర పండుగలు, పర్వదినాలు.. అన్ని ఇక్కడ అత్యంత సంప్రదాయబద్ధంగా, శాస్త్ర సమ్మతంగా నిర్వహిస్తారు. ఈ ఆలయ ప్రాంగణ నిర్మాణం అపర దైవ భక్తులు, సరస్వతీ ఆరాధకులు యాయవరం చంద్రశేఖర శర్మ ఆలోచన ఫలితంగా నిర్మితమైనట్టు ఆలయ వర్గాలు తెలియజేస్తున్నాయి.
జన్మకు కారణమైన తల్లిదండ్రులకు ప్రథమస్థానం ఇచ్చిన వేదాలు.. మాతృదేవో భవ, పిత్రు దేవో భవ.. అని ప్రవచించాయి. ఇక మూడో స్థానాన్ని ఆచార్యదేవో భవ అని గురువుకు ఇచ్చాయి. ఆ గురువులందరికీ గురువైన చదువుల తల్లి విషయానికి వచ్చేసరికి….ప్రప్రథమ స్థానం ఇస్తూ కీర్తిస్తాం. వసంత పంచమి నాడు సరస్వతీ ఆరాధనకు ద్విగుణీకృత ఫలితాలు ఉంటాయని పండితశ్రేష్టులు, ధార్మిక స్రష్ఠలు, పురాణ ప్రముఖులు తెలియజేస్తున్నారు.
తల్లీ నిన్నుదలంచి పుస్తకము చేతన్ బూనితిన్.. అంటూ పోతనామాత్యుని సరస్వతీ ఆరాధన శ్లోకాన్ని విద్యార్థులతో తొలుత గురువులు పలికించి..విద్యాబోధన చేయడానికి సంసిద్ధం అవుతారు. ఇప్పుడు ఈ తంతులన్నీ సరస్వతీ మాత ఆలయాల్లో జరిగాయి. సృష్టికర్త అర్థాంగి సరస్వతీ దేవికి అనంతకోటి నామాలు ఉన్నాయి. సరస్వతీదేవి సహస్రనామాల్లో…ప్రతి పేరుకు ఒక్కోవిశిష్ట అర్థం కనిపిస్తుంది. అక్షర కుక్షి.. సరస్వతీ అమ్మవారి శత సహస్రకోటి నామాలను పఠించే సామర్థ్యం, శక్తి అందరికీ ఉండదు కాబట్టి.. పర్వదినాలకే పర్వదినమైన వసంత పంచమి నాడు అమ్మవారి అష్టోత్తర, సహస్రనామావళిని పఠించి, సరస్వతీమాతకు పూజలు చేస్తే.. అమిత ఫలాలు సిద్ధిస్తాయని సరస్వతీ ఉపాసకులు, పురాణ ప్రముఖులు తెలియజేస్తున్నారు.