Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

మూసీ మురికి ఎవరి పాపం ? మూసీకి మోక్షం ఎప్పుడు ?

       ఒకప్పుడు పుష్కల జల నిధులతో కళకళలాడిన మూసీ న‌ది ఒడ్డున ప్రాణం పోసుకుందీ  భాగ్య‌న‌గ‌రం. సముద్రం లో చేపల్లా నగరమంతా మనుషులతో నిండిపోయింది. దీంతో నగర వ్యాప్తంగా ప్రజావాసాలు పెరిగిపోయాయి. అదే స్థాయిలో నగరం కూడా అంతంతై వటుడింతై అన్నట్టు పెరిగి పెద్ద‌దైంది. ఆ తరువాత మంచినీటి మూసీ నది మురికి మ‌యం అయ్యింది.  రోజు రోజుకు న‌గ‌రం విస్త‌రించ‌డం,ప‌రిశ్ర‌మ‌లు, వ్యాపార‌కేంద్రాలు పెర‌గ‌డం వాటి నుండి వెలువ‌ డే వ్య‌ర్థాల‌తో మూసీ నది మురుగు కాలువగా మారిపోయింది. హైద‌రాబాద్ లో భూముల ధ‌ర‌ల‌కు రెక్క‌లు రావ‌డం…. అధికారుల అల‌స‌త్వం కార‌ణంగా క‌బ్జాకోర‌ల్లో మూసీ నది నానాటికి బ‌క్క‌చిక్కిపోయింది. నగరం పెరిగి మూసీ కనుమ రుగైంది.

     హైదరాబాద్ చరిత్రలో మూసీ నదికి ఎంతో నేపథ్యం ఉంది. ఒకప్పుడు భాగ్యనగరం పేరు వినగానే మూసీ నది అందాలు సందర్శకుల్ని మంత్రముగ్దుల్ని చేసేవట. 1902 వరకు మూసీ నది పారే జల సిరులతో పక్షుల కిలకిలరావా లతో చూడ ముచ్చటగా విలసిల్లింది. జీవకోటి దాహార్తిని తీర్చే అమృత వాహినిగా ప్రఖ్యాతి చెందింది. ఇది నేటి తరానికి ఏమాత్రం తెలియదు. ఒకప్పుడు బాగా బతికిన నది. ఎన్నో బతుకులకు జవజీవాలు పంచిన జీవనది. మానవ సాంస్కృతిక వికాసానికి తనవంతు సాయం అందించి మానవాళిని మురిపిపించిన మూసీనది.. ఇప్పుడు ఒక మురికి కూపంగా మారింది. చెత్తా చెదారంతో కలుషితమైన కాసారంగా నగర ప్రజల బతుకులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

      వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ నది దారి పొడవునా జీవకోటి దాహం తీరుస్తూ…. 240 కిలో మీటర్లు పారుతూ నల్గొండ జిల్లాలో కృష్ణా నదిలో కలుస్తుంది. సముద్రమట్టానికి 2,168 అడుగుల ఎత్తులో పుట్టి తూర్పు దిశగా ప్రవహించి హైదరాబాద్ గుండా ప్రవహిస్తోంది. మూసీ నదికి 4వేల చదరపు మైళ్ల క్యాచ్ మేంట్ ఏరియా ఉంది.  హైదరాబాద్  నగరానికి ఆధారమైన మూసీని పూర్వం ముచుకుందా నదిగా వ్యవహరించేవారు. ఈ మూసీ నదికి పురాణ ప్రాశస్త్యం కూడా ఉంది. మూసీనది ప్రారంభ స్థలాన్ని ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు కూడా దర్శించాడంటారు.

      హైద‌రాబాద్ నగరంలో మూసీ నది సూమారు 35 కిలో మీటర్లకు పైగా ప్రవహిస్తుంది. ఒకప్పుడు శుభ్రమైన నీటితో ప్రవహించే ఈ నది, హైదరాబాద్  పరిసరాల్లో సాగు తాగునీటి అవసరాలను తీర్చింది. కానీ ఇప్పుడు మురుగు నీటికి కేరాఫ్ అడ్రస్ గా మారింది. కాలుష్యానికి మానవ వ్యర్థాలు, రసాయనాల కలయికతో ప్రవహించే ఈ మురుగు నీరు కాలకూట విషంలా తయారైంది. ప్రస్తుతం భాగ్యనగర వాసులను తన విషకోరలతో బంధిస్తోంది. ఒకప్పుడు నదీ పరీవాహక ప్రాంతంలో అనేక పంటలకు సాగునీటిని అందించి, రైతులకు ఆదాయవనరుగా ఉంటూ, పుర ప్రజలకు ఆహార ఉత్పత్తులు అందించింది. మరి ఇప్పుడు కలుషితమైన నీటితో దోమలకు కేంద్రంగా మారింది. ఓపెన్ గా ప్రవహిస్తున్న ఈ మురుగు చుట్టుపక్కల ప్రాంతమంతా దుర్వాసనను వెదజుల్లుతుంది. ఈ ప్రాంతానికి కొత్తగా వచ్చిన వారు ముక్కు మూసుకోక తప్పదు. ఇక నిత్యం వేళ్లేవారు సైతం మూసీ మురుగువాసన భరించలేక ముక్కుపుటాలను మూసుకుని ఊపిరాడక నానాయాతన పడతారు. ఇదిలా ఉంటే ఈ మురికి కూపంలోనే వేలాది మంది నిరుపేదలు బతుకులీడుస్తున్నారు.

    ఒకవైపు మురుగు మరో వైపు కబ్జాలు మూసీ స్వరూపాన్ని మసకబారేలా చేశాయి. మూసీలోకి చేరుతున్న మురుగు విషంతో సమానంగా తయారైంది. ఇటివల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్వహించిన పరీక్షల్లో నీటిలో ఆక్సిజన్ స్థాయి అధోగతికి చేరిందనే సంగతి బయటపడింది. గండిపేట్…,బాపుఘాట్..,ముసారాంబాగ్…, నాగోల్..,పీర్జాదీగుడా…, ప్రతాప సింగారం.., పిల్లాయి పల్లి ప్రాంతాల్లో మూసీ నీటి నమూనాలను పరిశీలించగా..,గండిపేట్ వద్ద మాత్రమే నీటిలో ఆక్సిజన్ స్థాయి చెప్పుకోదగినట్లుగా ఉందని తేలింది.  మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ ఆక్సిజన్ స్థాయి తగ్గిపోయి జల చరాలు నీటిలో ఉండలేనంత పరిస్థితి ఎర్పడింది. పరిమితుల ప్రకారం లీటర్ నీటిలో ఆక్సిజన్ 4 మిల్లీ గ్రాములు ఉండాలి.. అంతకంటే తగ్గితే నీటిలో జల చరాలు మనుగడసాగించ లేవు. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్   – బివోడి ఒక లీటర్ నీటిలో 3మిల్లీ గ్రాములకు మించకూడదు. ఆక్సిజన్ తగ్గుతున్నకొద్ది బివోడి పెరుగుతుంది. ఇలా మూసీ నదిలో బివోడి పరిమాణం చాలా తీవ్ర స్థాయిలో ఉన్నట్లు గుర్తించింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు.

     నేనో అందమైన నదిని. నా ఒడ్డునే ఈ మహానగరం విస్తరించింది. అది చూసి నేనూ సంబరపడ్డాను. కానీ ఈ నగరమే నాకు శాపమైంది. నన్ను మురికి కూపంగా మార్చిందీ నగర ప్రజలే. నన్ను ఆశ్రయించిన లక్షలాది జీవ కోటే ఇప్పుడు నన్ను అసహ్యంగా చూస్తుంది. పవిత్రంగా ఉన్న నన్ను నాశనం చేసిన మనుషులే మళ్లీ నన్ను మురికి మూసీనా అంటూ చులకనగా మాట్లాడుతున్నారు. వాడి నోరు మూసీ నదిలాంటిదని నన్ను అనవసరంగా నిందల పాలు జేశారు…అంటూ రోధిస్తుంది. ఎవరో అనుకుంటున్నారా! సాక్షాత్తు భాగ్యనగర వికాసానికి మూలమైన మూసీనది మనో వ్యథ ఇది. మనసున్న ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన పర్యావరణ అవసరం ఇది.

      ఒకప్పుడు హైదరాబాద్ కు వర ప్రదాయినిగా ఉన్న మూసీ ఇప్పుడు మురుగు కాలువగా మారడంతో తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. అటువైపు వెళ్లాలంటే చాలు ముక్కుమూసుకోవాల్సిందే. దుర్వాసనకు తోడు నదిలో ఆయా ప్రాంతాల్లో నీరు నిలిచి, దోమల పెరుగుదలకు ఆస్కారం పదంతలుగా పెరిగింది. దాంతో నగరంలో మూసీ ఒక దోమల ఉత్పత్తి కేంద్రంగా మారిపోయింది. మూసీ నదిలోకి ప్ర‌తి రోజు 1400మిలియ‌న్ లీట‌ర్ల మురుగు చేరుతుంది. ఇందులో మాన‌వ వ్య‌ర్థాల‌తోపాటు పారిశ్రామిక వ్య‌ర్థాలు ఉన్నాయి. న‌గ‌రంలోని 30కి పైగా  ప్ర‌ధాన‌ నాలాల ద్వారా మూసిలోకి మురుగు చేరుతుంది.  రాజేంద్ర న‌గ‌ర్.., నార్సింగ్ ప‌రిస‌ర ప్రాంతాల్లో స్వ‌చ్ఛంగా ఉండే మూసీ న‌గ‌రం న‌డి బొడ్డుకు రాగానే  మురికి కూపంగా మారిపోతుంది.  అయితే అత్తాపూర్, అంబ‌ర్ పేట్, నాగోల్.., న‌ల్లచెరువు ప్రాంతాల్లో  మురుగును శుద్ది చెయ్య‌డానికి  కొన్ని సివ‌రేజ్ ట్రీట్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్లు 650 మిలియ‌న్ లీట‌ర్ల మురుగు నీటిని శుద్ధి చెయ్య‌డం సాధ్యపడడం లేదని పరిశీలనలో తేలింది. దీంతో స‌గానికి పైగా మురుగు యధా విధిగా మూసిలోకే చేరుతుంది. ఇక మూసీ మురుగు కష్టాలకు తోడు నగర ప్రజలకు దుర్వవాసన ప్రధాన ఇబ్బందిగా మారింది. అనేక ప్రాంతాల్లో చెత్త డంప్ చేయ్యడంతోపాటు ఇతర వ్యర్థాలను మూసీలోకి వదులుతున్నారు. పశువుల వ్యర్థాలు.., చికెన్ షాపులు.., ఇతర మాంస సంబంధిత వ్యర్థాలు మూసీ పరిసరాల్లో పడెయ్యడంతో దుర్గంధం వ్యాపి స్తుంది. అంతే కాకుండా మూసీ నది వెంట అక్కడక్కడ నిలిచి ఉండేనీరు దోమల ఉత్పత్తికి ప్రధాన కారణం గా మారింది.

   ఇక గ్రేటర్ పరిధిలో ఉత్పత్తి అవుతున్న మురుగు నీటిని సివరేజ్ ట్రీట్ ప్లాంట్ల ద్వారా శుద్ది చేసి మూసీలోకి వదిలితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ నగరంలో సివరేజ్ తోపాటు పలు ప్రాంతాల్లో ఉన్న పారిశ్రామిక వ్యర్థాలు కూడా పూర్తి స్థాయిలో శుద్ది కాకుండానే మూసీలో కలుస్తున్నాయి. ముగురును శాస్త్రీయ పద్దతిలో శుధ్ది చేసిన నీరు మూసీలోకి వస్తే జల చరాలకు గానీ…, పంటపొలాలకు గానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాడవచ్చని నిపుణులు చెప్తున్నారు. మూసీ మూసుకుపోయింది.. మూసుకు పోయిన మూసీని బాగు చేస్తాం..అందంగా తయారు చేస్తాం.. ఒకరు సబర్మతి నదిలా అంటే…. కాదు కాదు థేమ్స్ నదిలా తీర్చిదిద్దుతాం అని మరొకరు హడావిడి చేశారు. చెంబు ముంచుకొని మంచి నీళ్లు తాగేటట్టు చేస్తామని కోతలు కోసారు. ఈత కొట్టేట్టు చేస్తామని పిట్టల దొరల్లా మాటలు చెప్పారు. కొత్తగా అధికారం లోకి వచ్చిన పాలకులంతా పాడే ఫస్ట్ బ్యూటిఫుల్ పాట ఇదే.. కానీ ఆచరణలో ఒక్క అడుగూ ముందుకు పడదు.. మూసీ ప్రక్షాళన కోసం బోర్డులు ఏర్పాటు చేస్తారు. కార్పోరేషన్ లు పుట్టుకొస్తాయి. వాటి పేరు మీద అప్పులు కూడా చేస్తారు. కానీ మూసీ నది నుండి మాత్రం తట్టెడు మట్టి ఎత్తిన పాపాన పోలేదు. ఇంతలో ప్రజా ప్రయోజనాలను చేకూర్చని పంచాయితీలకు తెరలేపుతారు. ఇంతలో ప్రభుత్వాల కాల పరిమితి కూడా అయిపోతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ముఖ్య మంత్రి గా ఉన్నప్పుడు మూసీ సివరేజ్ బోర్డ్ ఏర్పాటు చేసి అప్పులు తీసుకొని శుద్ది కోసం ఉప్పల్,నాగోల్ ఏరియా లో ప్లాంట్ లు ఏర్పాటు చేశారు. అవి పూర్తి స్థాయిలో పని చేయ లేదని అప్పట్లో విమర్శలు కూడా వెల్లువెత్తాయి.

     తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన కోసం మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 4వేల కోట్ల అప్పు తీసుకుంది…40 చెక్ డ్యాంలు కట్టి నది పొడవునా 365 రోజులు నీళ్ళు నిల్వ ఉండేలా చేస్తాం.. మూసీ నది ఇరువైపులా రోడ్లు, పార్కులు ఏర్పాటు చేసి అవసరమైతే కృష్ణ ,గోదావరి నుండి లింక్ చేసి నీరు నింపుతామన్న మాటలు కేవలం మాటలు గానే మిగిలాయి…అక్కడ అక్కడ మూసీ నది ఇరువైపులా పార్కులు వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేసి సుందరీకరించారు… మూసీ నది ప్రక్షాళన అంటే సుందరీకరణ కాదు అనే విషయం అర్ధం కావడం లేదు. మూసీనది తీరం మొత్తం ఇప్పుడు ప్రభుత్వాలకు డబ్బు తెచ్చి పెడుతుంది… మూసీ ఆనుకుని ఉన్న భూములకు హెచ్ఎండీఏ స్వాధీనం చేసుకుని వ్యవసాయేతర జోన్లు గా మార్చి ప్లాట్లుగా అమ్ముకుంటున్నాయి ప్రభుత్వాలు..ఉప్పల్ బాగాయత్, ప్రతాప సింగారంలో 145 ఎకరాలు ప్లాట్స్ కోసం వ్యవసాయ భూములు తీసుకుంది హెచ్ఎండీఏ. ప్రభుత్వాలు మారిన ప్రతీ సారి మళ్లీ మూసీ ప్రక్షాళన అంశం తెరపైకి వస్తుంది..మళ్లీ సీన్ రిపీట్. ఇదే తంతు దశాబ్దాలుగా నడుస్తోంది.

      నదంటే కేవలం పారే నీరే కాదు….యుగాల నాటి మానవ నాగరిక వారసత్వానికి ప్రతీక. నగరం అంటే నాలుగు అందమైన పెద్ద భవంతులు కాదు. బతుకు నిచ్చే ఆధారం. అలానే మూసీ పారినంత దూరం వేల ఎకరాల భూమి సాగు అయ్యింది. కానీ రాను రానూ మూసీ చెత్త చెదారం ఫ్యాక్టరీల రసాయన మురుగుతో పనికి రాకుండా పోయింది. ఫలితంగా దోమల బెడద పెరిగింది. మూసీ తీరం ప్రజలంతా నిత్యం రోగాల బారిన పడుతున్నారు. ఆ నీరు సాగుకు పనికి రాకుండా పోయింది..హైదరాబాద్ మొత్తానికి సరిపడా కూరగాయలు, ఆకు కూరలు పండేది మూసీ పరివాహక ప్రాంతంలోనే….. ఇప్పుడు మూసీ మురికి నీరుతో సాగు చేయడం వలన కూరగాయలు, ఆకు కూరలు, వరి బియ్యం వద్దంటే వద్దు అంటున్నారు… ఆఖరికి మూసీ ఒడ్డున ఉండే గడ్డి పొలాలు బీడు పడ్డాయి….మూసీ గడ్డి తిన్న పశువులు, అనారోగ్య బారిన పడటమే కాకుండా,వాటి ద్వారా వచ్చిన పాలు వద్దు అని ఎక్కడి నుంచో వచ్చే ప్యాకెట్ పాలే ముద్దు అంటున్నారు నగర ప్రజలు.. ఒక్కసారిగా చేయకపోయినా దశల వారీగా చేసినా మూసీ ప్రక్షాళన అయిపోయేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.

      భాగ్యనగరంలో భూమికి రెక్కలు రావడంతో మూసీపై పడింది కబ్జాదారుల కన్ను. ఇంకేం నగర పరిధిలో ఉన్న మూసీపై పడ్డారు అక్రమార్కులు. ప్రవాహానికి రెండువైపులా చిన్న చిన్న నిర్మాణాలతో మొదలు పెట్టి, ఏకంగా నదీ మధ్యలోకి చొచ్చుకెళ్లారు. దీంతో.. కబ్జా కోరల్లో చిక్కుకుపోయి.. బక్కచిక్కింది మూసీ. నగరం మధ్యలో ఒకప్పుడు ఎంతో విశాలంగా ఉండేది మూసీ నది. కొన్ని ప్రాంతాల్లోనైతే ఏకంగా ఐదు వందల మీటర్ల నుంచి 8 వందల మీటర్ల వరకు వెడల్పు ఉండేది. కానీ, అదంతా గతం. మరి.. ప్రస్తుతం చూస్తే రోజురోజుకూ పెరుగుతున్న కబ్జాలు మూసీని బక్క చిక్కేలా చేశాయి. ఓవైపు నివాస సముదాయాలు, మరోవైపు.. వ్యాపారులు, రియల్ ఎస్టేట్‌ కాంట్రాక్టర్లు మూసిని ఎక్కడికక్కడ పూడ్చి మరీ తమ పనులు కానిచ్చేస్తున్నారు.

      నది మధ్యలో బోర్లు వేసి నీటిని తోడుకుంటున్నా.. రివర్ బెడ్‌లో వ్యాపారాలు చేస్తున్నా.. అధికార గణం మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ అంచనా ప్రకారం చూస్తే గత కొన్నేళ్లలో మూసీ నది పది నుంచి పదిహేను శాతం వరకు కబ్జాకు గురైందంటేనే ఈ ఆక్రమణలు, అక్రమార్కుల చర్యలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కారణంగా మూసీ రివర్ బెడ్‌ పెద్ద ఎత్తున కుంచించుకుపోయింది. ఇంకా చెప్పాలంటే రివర్‌ బెడ్‌లో దాదాపుగా 8 వేల వరకు నివాసాలు వెలిశాయంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అపార్ట్‌మెంట్లు, వాణిజ్య భవనాల కోసం మూసీ పరివాహక ప్రాంతంలో మట్టిని నింపుతూ ప్లాట్లుగా చేసి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు దళారులు. మరోవైపు.. మూసీ నదిలో నిర్మించారని తెలిసినా వినియోగదారులు ఆయా ప్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. వీటికి ఎలాంటి అనుమతులు ఉండవని తెలిసినా సంబంధిత శాఖల అధికారు లు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఒకప్పుడు హైదరాబాద్‌లో మూసీ నది ఉండేదని భవిష్యత్ తరాలు చెప్పకునే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు పర్యావరణ ప్రేమికులు.

     గతంలో మూసీ సుందరీకరణ కోసం ఎన్నో సంస్థలు తీవ్రంగా కృషి చేశాయి. మరోసారి మూడు వేల కోట్లతో మూసీ ప్రక్షాళన, సుందరీకరణ ప్రాజెక్టు చేపట్టాలని, జిహెచ్ఎంసి వాటర్ బోర్డు అధికారులు, నగర ప్రజా ప్రతినిధులు సంకల్పించారు. ఈ నేపథ్యంలోనే గుజరాత్ సబర్మతి రివర్‌ను సందర్శించారు. అక్కడి నదిని సుందరీకరించినట్టే హైదరాబాద్ మూసీ నదిని కూడా అభివృద్ధి చేయ్యాలని నిర్ణయించారు. మూసీ నదికి ఇరువైపుల రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. కానీ అది కార్యాచరణలో సాధ్యం కాలేదు. అప్పట్లో ఏర్పాటు చేసిన కార్పోరేషన్ కు చైర్మన్ ను నియమించారు. 13వేల కోట్లతో వివిధ ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా మూసీని డెవలప్ చెయ్యాలని ప్లాన్ చేసింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఆచరణలో అది విఫలమైంది…

     మూసీ నదిని మురికి నుంచి విముక్తి కల్పించడం కోసం గత రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేయ్య డానికి ప్ర‌ణాళిక‌లు వేశాయి.  అటు పారిశ్రామిక వ్యర్థాలు, ఇటు సివరేజ్ మురుగు కలుస్తుండడంతో ఈ నదిని రక్షించా లని సేవ్ మూసీ క్యాంపెయిన్ పేరుతో  ఎబేట్మెంట్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ మూసీ రివర్‌ను హైదరాబాద్ మెట్రోవాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు చేపట్టాలని….మూసీ రెవిటలైజేషన్ ప్రాజెక్ట్ పనులను జిహెచ్ఎంసి చేపట్టాలని… మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ అదేశించింది. ఇక మూసీ సుంద‌రీక‌ర‌ణ ప్రాజెక్టు 2005 ఆగస్ట్ లో ప్రారంభించారు. 30నెలల్లో  ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాల్సి ఉంది. అయినా ఇప్పటికీ పనులు నత్తనడకనే సాగుతున్నాయి. వాటర్ వర్క్స్ ద్వారా 367కోట్లు, జిహెచ్ఎంసి ద్వారా 32కోట్లు ఖర్చు చేశారు.  అయినా ఇప్పటికీ మూసీ నదిలో ఏ మాత్రం మురుగు తగ్గలేదు. ఎలాంటి ప్రక్షాళన, సుందరీకరణ జరగలేదు. హైకోర్టు వద్ద భారీగా నిధులు వెచ్చించి  రబ్బర్ డాం  నిర్మించారు. పైనుండి వ‌చ్చే నీటిని ఇక్క‌డ నిల్వ చేసి ఆహ్లాదంగా ఉండేందుకు ప్ర‌క్కనే వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు.  ఇది ఏర్పాటుచేసిన కొద్ది రోజులకే అటకెక్కింది.  ఇక వాక్ ట్రాక్ ఏర్పాటు చేసినప్పటికీ ఈ మురుగు వెదజల్లే వాసనకు ప్రజలెవ్వరూ ఇక్కడ కన్నెత్తి చూడటం లేదు. దాంతో ట్రాక్ , ఇతర సొగసులు మూసీలో పోసిన పన్నీరయ్యాయి.   

     ఇక మూసీ రివర్ ప్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని నియమించింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. కొన్నేళ్ల క్రితం మూసీ ప్రక్షాళన సుందరీకరణకోసం 13వేల 400 కోట్లతో ఒక డిపిఆర్ ను సిద్దం చేశారు అధికారులు. ఇందులో ప్రధానంగా మురుగునీరు మూసీలోకి చేరకుండా దానిని శుద్ది చెయ్యడానికి ఎస్టీపిల నిర్మాణం…. వాటి మెయింటెనెన్స్ తోపాటు  ఇప్పటికే ఉన్న సివరెజ్ ట్రీట్ ప్లాంట్ల అధునికీకరణ…, మూసీ సుందరీకరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు.  చైర్మన్ నియామకంతో అయినా మూసీ పనుల్లో వేగం పెరుగు తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఇంతలోనే బీఆర్ఎస్ ఓటిమిపాలై కాంగ్రెస్ అధికార పీఠమెక్కింది. మూసీ నదికి పునర్వైభవాన్నే కాదు భాగ్యనగరానికి అందమైన మణిహారంగా తీర్చిదిద్దుతామని నూతన కాగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో వెల్లడించింది. ఆ మేరకు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో మూసీ నది ప్రక్షాళనకు, సుందరీకరణకు భారీగా నిధులు కేటాయించింది. గత ప్రభుత్వాల్లాగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మూసీ నది అభివృద్ధి పై స్పెషల్ ఫోకస్ పెట్టిందనే చెప్పాలి. నగరంలోని మూసీ నదిని మురికిని ప్రక్షాళన చేస్తూ…. పర్యాటకంగా అభివృద్ది చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించింది. మూసీ నది పునరుజ్జీవం, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు రూపకల్పనలో భాగంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో భారీగానే నిధులను కేటాయించింది. ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో 2,75,891 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అందులో మూసీ అభివృద్ధికి రూ. 1000 కోట్లు కేటాయించడం జరిగింది.

     భాగ్యనగరం అభివృద్థిలో భాగంగా వచ్చి న సంపద అధికారులు, నాయకుల స్వార్ధ ప్రయోజనాలకు చెందింది కాదు. ఈ నగరంలో నివసించే ప్రజలకు చెందాలనే లక్ష్యంతో పని చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే పాలనలో భాగమైన అన్ని సంస్థలను…వ్యవస్థలను పునర్వవస్థీకరణ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే మాసీ నది పరివాహక ప్రాంతం అంతా ఉపాధి కల్పనా జోన్ గా మార్చడానికి ప్రభుత్వం సిద్ధమైంది. మూసీ దరిదాపులకు వస్తేనే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితుల నుండి మూసీ నదిని లండన్ లోని థేమ్స్ నదిగా సుందరీకరణ చేస్తామన్నారు. ఏ మాత్రం కాలుష్యం లేకుండా మూసీ నదిని లండన్‌ నగరం మధ్య నుంచి ప్రవహిస్తున్న థేమ్స్ నది తరహాలోనే మూసీ రివర్‌ ఫ్రంట్‌ను అభివృద్ది పరుస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఈ క్రమంలో

     మూసీ రివర్‌ ప్రంట్‌ డెవలప్మెంట్ ప్రాజెక్టు ద్వారా మూసీ నది ప్రక్షాళను చేపడతాం అని స్పష్టం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీనిలో భాగంగా పాదచారుల ప్రత్యేక జోన్లు, పీపుల్స్‌ ప్లాజాలు, పాతనగరంలో హెరిటేజ్‌ జోన్లు, హాకర్స్‌ జోన్లు, పిల్లల కోసం చిల్డ్రన్ ధీమ్‌ పార్కులతోపాటు ఎంటర్‌ టైన్మెంట్ జోన్లుగా మూసీ నదిని అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. మరి నూతనంగా ఏర్పడిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళన సుందరీ కరణపై ఎలాంటి చర్యలతో ముందుకెళుతుందో …. మూసీ నది సుందరీ కరణకు ఎంతకాలం పడుతుందో…. లండన్ థేమ్స్ నదిలా మార్చడంలో ఎంతమేరకు కృతకృత్యమవుతుందో వేచి చూడాల్సిందే…. మూసీకి మోక్షం ఎప్పటికి సిద్ధిస్తుందో ….మరి.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్