వచ్చే ఎన్నికల్లో పార్టీ సీనియర్ నేత బొత్స కుటుంబానికి మరింత ప్రాధాన్యం ఇవ్వనున్నారు సీఎం జగన్. బొత్స సతీమణి ఝాన్సీని విశాఖ ఎంపీగా బరిలో దింపేందుకు వైసీపీ అధిష్టానం దాదాపుగా ఖరారు చేసింది. అలాగే బొత్స కుటుంబానికే చెందిన మరో నేతను సైతం ఎంపీగా పోటీ చేయించే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారని తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో పార్టీ తిరుగులేని ఆధిపత్యం సాధించాలి అంటే సీనియర్ మంత్రి కుటుంబానికి ఎక్కువ సీట్లు ఇవ్వాలని వైసీపీ భావిస్తోంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా, కీలక మంత్రిగా వున్నారు బొత్స సత్యనరాయణ. జగన్ మొదటి విడత, రెండో విడత కేబినెట్ లో కూడా బొత్స బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాజకీయాల్లో సీనియర్ నేతగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ అధ్యక్షుడుగా, మంత్రిగా కూడా పని చేశారు బొత్స. రాష్ట్ర విభజన తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ తీర్థం తీసుకున్న తరువాత పార్టీని బలోపేతం చేయడంతోపాటు, వైసీపీ అధికారంలోకి రావడానికి తన వంతు కృషి చేశారు. దీంతో జగన్ ఆయనకు మంత్రి పదవి బాధ్యతలు కట్టబెట్టడంతోపాటు, ఉత్తరాంధ్రలో పార్వతీపురం, విజయనగరం జిల్లాల పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ గా కూడా బాధ్యతలు అప్పజెప్పారు. 2019 ఎన్నికలలో బొత్స కుటుంబానికి మూడు ఎమ్మేల్యే స్థానాలు ఇచ్చారు జగన్. చీపురుపల్లి నుంచి బొత్స, గజపతి నగరం నుంచి బొత్స సోదరుడు అప్పల నర్సయ్య , నెల్లిమర్ల నుంచి బొత్స బంధువు అప్పల నాయుడు ఎమ్మేల్యేలుగా విజయం సాధించారు. అలాగే బొత్స మేనల్లుడు చిన్న శ్రీను ప్రస్తుతం విజయనగరం జిల్లా పర్షత్ చైర్మన్ గా పని చేస్తున్నారు.
ఇక వచ్చే ఎన్నికల్లో కూడా బొత్స ఫ్యామిలీకి అధిక ప్రాధాన్యం ఇచ్చే యోచనలో ఉన్నారు సీఎం జగన్. సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాలతో పాటు, ఎంపీ స్థానాలు ఇవ్వాలని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో విశాఖ ఎంపీగా వైసీపీ నుంచి ఎవివి. సత్యనారా యణ విజయం సాధించారు. అయితే వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి ఎమ్మేల్యే గా పోటీ చేసేందుకు సిద్దం అయ్యారు. అదీకాక వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఇక విశాఖలో టీడీపీ బలంగా వుంది. దీనికి జనసేన కూడా తోడైంది. దీంతో విశాఖ ఎంపీ స్థానం గెలవాలి అంటే వైసీపీ కూడా బలమైన ఎంపీ అభ్యర్థిని రంగంలోకి దింపాలని భావిస్తోంది. అందులో భాగంగా విశాఖ ఎంపీ అభ్యర్థిగా మంత్రి బొత్స సతీమణి బొత్స ఝాన్సీ పేరును పరిశీలిస్తుంది వైసీపీ అధిష్టానం. గతంలో బొత్స ఝాన్సీ రెండు సార్లు విజయనగరం ఎంపీగా పని చేసిన సీనియార్టీ వుంది. అలాగే బొత్సకు ఉత్తరాంధ్రలో మంచి పట్టుంది. విశాఖలోనూ బొత్సకు పెద్ద ఎత్తున అనుచర గణం వుంది. దీనికితోడు ఓ ప్రధాన సామాజిక వర్గం అండ కూడా బొత్స కు మెండుగా వుంది. టీడీపీ, జనసేన డీ కొట్టేందుకు కావాల్సిన ఆర్థిక, అంగబలం బొత్సకు వున్నాయి. దీంతో బొత్స ఝాన్సికి ఎంపీ టికెట్ ఇస్తే, పార్లమెంట్ తోపాటు, ఎమ్మేల్యేల విజయానికి ఢోకా ఉండదని వైసీపీ లెక్కలు వేస్తోంది. అటు పార్టీ ఆదేశిస్తే విశాఖ ఎంపీగా పోటీకి సిద్ధం అంటున్నారు బొత్స ఝాన్సీ.
విజయనగరం నుంచి బొత్స మేనల్లుడు చిన్న శ్రీనుని పోటీ చేయించే యోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో అయన జిల్లాలో వైసీపీ విజయానికి కృషి చేశారు. జిల్లా రాజకీయాలపై ఆయనకు మంచి పట్టుంది. ప్రస్తుతం విజయ నగరం జిల్లా పరిషత్ చైర్మన్ గా వున్నారు చిన్న శ్రీను. ఇప్పటికే పార్లమెంట్ పరిధిలో బొత్స కుటుంబ సభ్యులు ముగ్గురు ఎమ్మేల్యేలు వున్నారు. ఎమ్మెల్యేల మార్పులు చేర్పుల్లో భాగంగా సిట్టింగ్ ఎంపీ బెల్లన చంద్ర శేఖర్ ని, ఎమ్మేల్యే గా పంపిస్తే చిన్న శ్రీనుకి లైన్ క్లియర్ అయినట్టే అంటున్నాయి వైసీపీ వర్గాలు.