లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమిలో విభేదాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. సీట్ల కేటాయింపులో కాంగ్రెస్‌కు ఇతర భాగస్వామ్య పార్టీలతో గొడవలు వచ్చాయి. దీంతో ఒంటరి పోరుకు తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయం తీసుకున్నాయి. అలాగే సమాజ్‌వాదీ పార్టీ కూడా కాంగ్రెస్‌తో దూరంగా ఉంటోంది. కాంగ్రెస్ పార్టీ పెత్తందారీ పోకడలే ఈ విభేదాలకు కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మరికొన్ని నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ పక్కా ప్రణాళికతో సన్నద్ధమవుతోంది. ఈసారి 400 సీట్లను టార్గెట్‌గా పెట్టుకుంది ఎన్డీయే కూటమి. ఇందులో భాగంగా బీజేపీ స్వంతంగా 370 సీట్లను గెలు చుకుంటుందన్న ధీమా కమలనాథుల్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల తరువాత ఏర్పడే ఎన్డీయే సర్కార్ వెయ్యే ళ్ల దేశ చరిత్రకు పునాదులు వేసే అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అయితే అసలు లోక్‌సభ ఎన్నికలు జరగకముందే ప్రధాని నరేంద్ర మోడీకి హ్యాట్రిక్ కొడతామన్న ధీమా ఎలా వచ్చిందన్న ప్రశ్న రాజకీయవర్గా ల్లో వినిపిస్తుంది. దీనికి అనేక కారణాలు చెబుతున్నారు రాజకీయ పండితులు. ఇండియా కూటమి పరి స్థితి ప్రశ్నార్థకంగా మారడమే దీనికి కారణం అంటున్నారు. మొత్తం 28 బీజేపీయేతర పార్టీలు కలిసి పెట్టు కున్న ఇండియా కూటమి పరిస్థితి గందరగోళంగా మారింది.
ఇండియా కూటమి ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన బీహార్ ముఖ్యమంత్రి, జేడీ ( యూ ) అధినేత నితీశ్ కుమార్ ఇటీవల ప్లేటు ఫిరాయించారు. ఇండియా అలయన్స్ నుంచి నితీశ్ కుమార్ బయటకు వెళ్లారు. బీహార్‌లోని మహా ఘట్‌బంధన్ నుంచి జేడీ ( యూ ) వైదొలగింది. బీజేపీ సాయంతో మరోసారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. నితీశ్ కుమార్ సంగతి ఇలా ఉంటే, ఇండియా కూటమిలో గొడవలు ఇటీవల బయటపడుతు న్నాయి. ఇండియా కూటమికి తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ షాక్ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ వరకు కాంగ్రెస్‌తో తమ పార్టీ ఎటువంటి పొత్తు పెట్టుకోదని మమత కుండబద్దలు కొట్టారు. లోక్‌సభ ఎన్నికలు తరుముకువస్తున్న తరుణంలో మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయం బీజేపీయేతర పార్టీ లకు షాక్ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్‌లో సీట్ల సర్దుబాటుకు సంబంధించి తాను చేసిన ప్రతిపాదనపై కనీసం చర్చించ డానికి కూడా కాంగ్రెస్ నాయకులు ఆసక్తి చూపలేదన్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో తాము ఒంటరిపోరుకు సిద్దమైనట్లు మమతా బెనర్జీ తేల్చి చెప్పారు.
మరోవైపు కాంగ్రెస్‌కు దూరమైన మిత్రపక్షాల్లో కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఉంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌వరకు ఒంటరిగా పోటీ చేయాలన్న ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయం తీసుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో తాము ఎటువంటి పొత్తు పెట్టుకోవడం లేదని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పష్టం చేశారు. పంజాబ్‌లోని మొత్తం 13 నియోజకవర్గాల్లోనూ ఆప్ ఒంటరిగా బరిలోకి దిగుతుందని భగవంత్ మాన్ తేల్చి చెప్పారు. వాస్తవానికి ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీతో ఆమ్ ఆద్మీ పార్టీకి ఆది నుంచి మంచి సంబంధాలు లేవు. ఢిల్లీ రాజకీయాల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య గతంలో హోరాహోరీ పోరు నడిచిన సంగతి తెలిసిందే. హస్తినలో బలపడటానికి ఒకవైపు బీజేపీ పెద్దలతోనూ మరో వైపు కాంగ్రెస్ సీనియర్లతోనూ కేజ్రీవాల్ పోరాటం చేశారు. ఇదిలా ఉంటే, ఇండియా అలయన్స్‌లోని మరో భాగస్వామ్యపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ కూడా కాంగ్రెస్‌కు దూరమ య్యిందనే సంకేతాలు అందుతున్నాయి. దీనికి కారణం మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలే. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ ఎన్నికల్లో అఖిలేశ్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ కూడా పోటీ చేసింది. అయితే పొత్తులో భాగంగా తమకు కొన్ని సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీని కోరింది. అయితే సమాజ్‌వాదీ పార్టీ కోరినన్ని సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ అగ్రనాయకత్వం అంగీకరించలేదు. ఇండియా కూటమిలో గొడవలకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ పెత్తందారీ పోకడలేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి.కూటమిలోని అన్ని భాగస్వామ్యపక్షాలతో సమన్వయం చేసుకోవడంలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం విఫలమైందన్న ఆరోపణలు వస్తున్నాయి. కూటమిలో అతి పెద్ద పార్టీ తమదే కాబట్టి, మా మాటే చెల్లుబాటు కావాలన్న ధోరణితో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందన్న విమర్శలు కూటమి భాగస్వామ్యపక్షాల నుంచి వినిపిస్తోంది.