వచ్చే పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్‌గా బీఆర్‌ఎస్ పార్టీ ప్రణాళికలు సిద్ధంచేసుకుంటోందా….? నీటి అంశాన్ని బలమై న నినాదంగా మార్చుకుంటోందా…? ఇదే నినాదం రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కలసి వస్తుందని గులాబీ బాస్ భావిస్తు న్నారా…? కేఆర్ఎంబీ అంశాన్ని అస్త్రంగా చేసుకొని నల్గొండ జిల్లా వేదికగా భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారా?. నీటి అంశంతోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి రానున్నారా…?
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత డీలా పడ్డ బీఆర్ఎస్ శ్రేణులకు బూస్ట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు గులాబీ బాస్ కేసీఆర్. ఓటమి నుంచి కోలుకుని రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం కావాలని ఇప్పటికే పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటి పునర్ వైభవం దిశగా అడుగులు వేయాలని దిశానిర్దేశం చేశారు. ఇటీవలే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ ఇక పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నారు.
పార్లమెంట్ ఎన్నికలకు వెళ్ళాలంటే బీఆర్ఎస్‌కు అస్త్రం కావాలి. ఇన్నాళ్లు కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ నేతలు. ఇప్పుడు కృష్ణా నదీ జలాల అంశం బీఆర్‌ఎస్‌కు ఎజెండాగా మారింది. కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులు కేఆర్ఎంబికి అప్పగించే అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడంతో పాటు ప్రజల్లోకి వెళ్లి పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇది పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి కలిసి వస్తుందని నేతలు భావిస్తున్నారు.కేఆర్ఎంబి అంశంపైనే గులాబీ బాస్ దృష్టి సారించారు. ఇదే అంశంపై పార్టీ ముఖ్య నేతలతో చర్చిం చారు. కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరే కించారు. కేఆర్ఎంబికి నాగార్జున సాగర్, శ్రీశైలం సహా కృష్ణా నదిమీద ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగిస్తూ ప్రభు త్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందనేది బిఆర్ఎస్ వాదన. ఇప్పుడు ఈ అంశంతోనే దక్షిణ తెలంగాణ రైతులను కదిలించాలని స్కెచ్ వేశారు కేసీఆర్. అందులో భాగంగానే నల్గొండ జిల్లాలో ఫిబ్రవరి 13న భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. ఈ బహిరంగ సభకు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుండి కార్యకర్తలను తరలించనున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలోను కేసీఆర్ బహిరంగ సభలను నిర్వహించారు. తెలంగాణ అంశం ప్రజల్లోకి వెళ్ళడంలో బహిరంగ సభలు బాగా ఉపయోగపడ్డాయి. ఇప్పుడు మరోసారి KRMB అజెండాతో కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లాలని ప్లాన్ చేశారు. ఈ అంశంపై ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బిఆర్ఎస్ పార్టీకి దక్షిణ తెలంగాణ జిల్లాలయిన ఉమ్మడి మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో చేదు ఫలితాలు వచ్చాయి. ఇక KRMB అంశం ద్వారా కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టడంతో పాటుగా బిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై ఒత్తిడి పెంచేందుకు కావాల్సిన కార్యచరణను కేసీఆర్ సిద్దం చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఆటో డ్రైవర్ల ఆత్మహాత్యలు, రైతు భరోసా, రుణమాఫీ , ఉద్యోగ నోటిఫికేషన్లతో పాటు ప్రజా పాలనలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం కోసం పార్టీ తరపున అందోళన చేసేలా అస్త్రాలు రెడీ చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా గులాబీ బాస్ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.