ఎన్నికల కోసం పార్టీలో చకచకా మార్పులు చేసుకుంటూ పోతున్నారు వైసీపీ అధినేత వై.ఎస్ జగన్. ఈ క్రమంలోనే పలు వురు ఎమ్మెల్యేలు.. బాస్ పిలుపుతో తాడేపల్లికి వెళ్లివస్తున్నారు. అయితే..మరికొందరుమాత్రం తమను జగన్ పట్టించు కోవడం లేదని.. కనీసం ఆయన్ను చూసే అవకాశం అయినా ఇవ్వండంటూ బహిహంగంగా వ్యాఖ్యానించడం ప్రాధా న్యం సంతరించుకుంది.
సార్వత్రిక ఎన్నికలతో కలిసే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. మరో మూడు నెలల్లో రానున్న ఎలక్షన్ల కోసం పార్టీని సిద్ధం చేస్తున్నారు వైసీపీ అధినేత వై.ఎస్ జగన్. ఇందులో భాగంగా అత్యంత కీలకమైన అభ్యర్థులను ఖరారు చేసే పనిలో గత కొన్నిరోజులుగా నిమగ్నమయ్యారాయన. ఆయా సందర్బాల్లో చేసిన సర్వేల ఆధారంగా టికెట్లు కేటాయిస్తన్నారు. ఈ క్రమంలోనే కొందరు ఇంఛార్జ్‌లను మార్చడం,పలువురు సిట్టింగ్‌ల స్థానాలను మార్పుచేయడం, ఇంకొందరికి టికెట్లు నిరాకరించడం లాంటివి చేస్తున్నారు.
ఇప్పటికే 11 మంది ఇంఛార్జ్‌లను మార్చిన వైసీపీ అధినేత, సీఎం. వైఎస్ జగన్ ఉభయగోదావరి జిల్లాలు, అనంతపు రం, కర్నూలు, చిత్తూరు, ప్రకాశం, కృష్ణా సహా పలు జిల్లాల ఎమ్మెల్యేలను క్యాంప్ ఆఫీసుకు పిలిపించి మాట్లాడారు. త్వరలోనే రెండో విడత ఇంఛార్జ్‌ల మార్పులకు సంబంధించిన జాబితా విడుదలవుతుందన్న వార్తలు వస్తున్నాయి. ఇలా.. మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటుండడంతో టికెట్లు దక్కిన వారు సంతోషం వ్యక్తం చేస్తుంటే..స్థాన చల నం కలిగిన వారు కొంతలో కొంతైనా ఫరవాలేదులే అని భావిస్తున్నారు. ఇక, సీట్లు గల్లంతైన వారు మాత్రం వివిధ రూపా ల్లో తమ అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ఇందులో కొందరు పార్టీ మారే యోచనలో సైతం ఉన్నట్లుగా ప్రచారం జోరుగా సాగుతోంది.
వీళ్ల సంగతి ఇలా ఉంటే.. మరికొందరు మాత్రం తమను జగనన్న గుర్తించడం లేదంటూ బాహాటంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ఈ కోవలోనే పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తన ఆవేదన బయటపెట్టారు. దురదృష్ట వశాత్తూ జగన్‌మోహన్‌రెడ్డి తనను గుర్తించకపోయినా నియోజకవర్గ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకొని అభిమానిస్తు న్నారంటూ గద్గత స్వరంతో ప్రసంగించారు. పార్టీలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కార్యకర్తలు, ప్రజలు తనను కాపాడు కుంటూ వస్తున్నారని.. వాళ్లకు సేవకుడిగా ఉంటానంటూ చెప్పుకొచ్చారు పార్థసారథి.
ఇక, పార్టీకే చెందిన మరో సీనియర్ దళిత నేత డొక్కా మాణిక్య వరప్రసాద్‌ది మరో పరిస్థితి. తనను అడుగకుండానే ఇంచార్జ్‌ను చేశారని.. ఇప్పుడు మళ్లీ తప్పించారంటూ బాహాటంగానే కామెంట్లు చేశారాయన. అసలెందుకీ పరిస్థితి వచ్చిందో అర్థం కాలేదన్నారు. ఈ విషయంలో తనకు ఒక్కసారి జగన్‌ను చూసే అవకాశం కల్పించండంటూ బహిరంగ సభ నుంచి ఆయన కామెంట్లు చేయడం ఒక రకంగా చెప్పాలంటే కలకలమే రేపింది.
జగనన్న మమ్మల్ని గుర్తించలేదు.. ఆయన్ను ఓసారి చూసే అవకాశం కల్పించండి అంటూ సొంత పార్టీ నేతలే ఇలా వ్యాఖ్యానించడంతో ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చినట్లైందన్న కామెంట్లు విన్పిస్తున్నాయి.పార్టీలోని ఓ పదిమందికి తప్ప మిగిలిన వాళ్లకు జగన్ అపాయింట్‌మెంట్ లభించడం కష్టమని ఇప్పటికే విపక్ష నేతలు తరచుగా ఆరోపణలు గుప్పి స్తున్నారు. అలాంటి వేళ.. ఇప్పుడు వైసీపీ నేతలే ఈ కామెంట్లు చేయడం రాజకీయంగా కొంతమేర కాకరేపుతోం దన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి రాబోయే రోజుల్లో ఇది ఇక్కడితోనే ఆగుతుందా.. మరింత పెరుగుతుందా అంటే ఇప్పుడే చెప్పలేని పరిస్థితి.