23.7 C
Hyderabad
Tuesday, February 27, 2024
spot_img

తరిగిపోతున్న భూగర్భ జలాలు … ఎండిపోతున్న గొంతులు

ప్రపంచవ్యాప్తంగా నీటి సంక్షోభం నెలకొంది. గుక్కెడు నీటికి కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లే దారుణ పరిస్థితులు అనేక దేశాల్లో నెలకొన్నాయి ఆఫ్రికా దేశాల్లో నీటి సమస్య మరింత తీవ్రంగా ఉంది. భారత దేశం  కూడా నీటి ఎద్ద‌డికి మిన‌హా యింపు కాదు. మ‌న‌దేశంలో మరఠ్వాడా సహా అనేక ప్రాంతాల్లో ప్రజలు తాగునీటికి అల్లాడుతున్నారు.

      మనిషి బతకడానికి ఆహారం ఎంత అవసరమో…నీరు కూడా అంతే అవసరం. నీటి ఎద్దడికి దాదాపుగా ఏ దేశమూ మినహాయింపు కాదు. అయితే నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న జాబితాలో ఆఫ్రికా దేశాలు ముందున్నాయి. ఆఫ్రికాలోని అనేక దేశాల్లో ఇప్పటికీ మంచినీరు ప్రజలకు అందడం లేదు. అభివృద్ధిలో వెనకబడ్డ దేశాల్లో నీటి కొరత తీవ్రంగా ఉంద ని లెక్కలు చెబుతున్నాయి. ప్రపంచదేశాల్లో నీటి ఎద్దడిపై ఐక్యరాజ్యసమితి కిందటి ఏడాది ఏప్రిల్‌ నెలలో మూడు రోజుల పాటు కీలక సమావేశం నిర్వహించింది. నీటి ఎద్దడిని నివారించడానికి అంతర్జాతీయస్థాయిలో బలమైన యంత్రాంగాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు నీటిరంగ నిపుణులు. ప్రపంచంలోని ప్రజలందరికీ 2023 నాటికల్లా సురక్షిత తాగునీరు అందించాలని ఐక్యరాజ్యసమితి గతంలోనే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఆ లక్ష్యానికి ప్రస్తుతం అనేక దేశాలు చాలా దూరంలో ఉన్నాయి. అందరికీ సురక్షిత తాగునీరు అందించాలన్న లక్ష్యానికి చేరుకోవ డానికి ఏడాదికి 600 బిలియన్ల నుంచి ఒక ట్రిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని నీటిరంగ నిపుణులు చెప్పారు.అభివృద్ధి పేరుతో పర్యావరణానికి తూట్లు పొడవటం, రకరకాల కాలుష్యాలతో పాటు గ్లోబల్ వార్మింగ్…ఇవ‌న్నీ నీటి ఎద్దడికి ప్రధాన కారణాలని యునైటెడ్‌ నేషన్స్‌ వరల్డ్ వాటర్ డెవలప్‌మెంట్ తాజా నివేదిక తెగేసి చెప్పింది.

    మనిషి ఆరోగ్యంగా బతకడానికి సురక్షిత నీరు మ‌రీ ముఖ్యం. సురక్షిత నీరు అందకపోతే మనుషులు రోగాలపాలవు తారు. ప్రాణాలు కొడిగట్టి పోతాయి. ప్రపంచవ్యాప్తంగా సురక్షిత నీటికి కోట్లాదిమంది దూరంగాఉన్నారు.ప్ర‌పంచ‌జ‌నాభాలో దాదాపు 26 శాతం మంది సురక్షిత తాగునీటికి నోచుకోవడం లేదని లెక్కలు తేల్చి చెబుతున్నాయి. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం మధ్య ఆఫ్రికా, తూర్పు ఆసియా, దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాలు పర్యావరణ మార్పుల కారణంగా సీజన్ల వారీ నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. పశ్చిమాసియా, సహారా పరీవాహక ప్రాంతాల భవితవ్యం రానున్న రోజుల్లో మరింత దుర్భరం కానుందని నీటి ఎద్దడిపై ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక హెచ్చరించింది.

     ప్రపంచవ్యాప్తంగా నీటి ఎద్దడి ఇంత తీవ్రంగా ఉన్నా, ఐక్యరాజ్య సమితి దీనిని ఒక తీవ్రమైన అంశంగా పరిగణించ లేదు. నీటి సంక్షోభంపై ఎప్పుడో 1977లో అర్జెంటైనాలో ఐక్యరాజ్యసమితి ఒక సమావేశాన్ని నిర్వహించింది. అప్పట్లో 118 దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆ తరువాత నీటి ఎద్దడిలాంటి కీలక అంశాన్ని ఐక్యరాజ్యసమితి మరచిపోయింది. తాజాగా 46 ఏళ్ల తరువాత మరోసారి ఐక్యరాజ్యసమితి మూడు రోజుల పాటు నీటి సంక్షోభంపై ఓ సమావేశాన్ని నిర్వహించింది. నీటి సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఐక్యరాజ్యసమితి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అనేక దేశాలు కోరుతున్నాయి. గొంతు త‌డుపుకోవ‌డానికి సురక్షిత నీరు అందేలా ఐక్యరాజ్యసమితి కీలక నిర్ణయాలు తీసుకోవాలని ప్రపంచదేశాలు కోరుతున్నాయి.

     నీటి విషయంలో భారత్‌లోనూ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. 2050 నాటికి భారత్‌లో తీవ్రమైన నీటి క‌ట‌క‌ట నెలకొంటుందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక తేల్చి చెప్పింది.మ‌న‌దేశంలో భూగర్భజలాలను అతిగా వినియోగించడమే నీటి ఎద్ద‌డికి ఒక కార‌ణ‌మంటున్నారు సైంటిస్టులు. మోతాదుకు మించి ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌న‌దేశంలోని అనేక ప్రాంతాల్లో భూగర్భజలాలు తరిగిపోయాయి. దీనిఫ‌లితంగా దైనందిన అవ‌స‌రాల‌కు కూడా నీటి కొర‌త ఏర్ప‌డింది. గత రెండు దశాబ్దాలలో దేశ‌వ్యాప్తంగా దాదాపు 300 జిల్లాల్లో భూగర్భజలాల నిల్వలు నాలుగు మీటర్లు తగ్గినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఒక అధ్య‌య‌నం ప్ర‌కారం దేశంలో మూడింట రెండు వంతుల మంది భూగర్భజల వనరులను అవ‌స‌రాల‌కు మించి వినియోగిస్తున్నట్లు స్ప‌ష్ట‌మైంది.భూమిలోకి నీరు ఇంకిపోవ‌డం ఒక స‌హ‌జ ప్ర‌క్రియ‌. భూమిలోకి ఎంత ఎక్కువ‌గా నీరు ఇంకితే అంత ఎక్కువ‌గా భూగర్భజలాల నిల్వ‌లు ఉంటాయి. అయితే నేల‌త‌ల్లిలోకి ఇంకే నీరు కాల‌క్ర‌మంలో త‌గ్గిపోయింది. దీంతో భూగర్భజల మట్టాలు ఏడాదికేడాది త‌గ్గ‌పోతు న్నాయి. పాతాళంలో కాసిన్ని నీళ్లుఉన్నా వాటిని కూడా ఎడాపెడా బోర్లు వేసి తోడేస్తున్నాం. ఒక‌వైపు నీటి ఎద్ద‌డి ఉంటే మ‌రో వైపు ఉన్న నీటిని అవ‌స‌రాల‌కు మించి ఎడాపెడా వాడేస్తున్నాం.

      భూగోళంపై 80శాతం నీరు విస్తరించి ఉంది. అయినప్పటికీ తాగడానికి ఉపయోగపడే సురక్షిత నీరు ప్రజలకు దొరకడం లేదు. స్వచ్ఛమైన నీటి లభ్యత మూడు శాతం కంటే తక్కువగా ఉంది. ఎక్కువ శాతం నీరు కలుషితమై ఉంటుంది. లభించే కొద్దిపాటి శుద్ధజలం మానవ చర్యలవల్ల పనికిరాకుండా పోతోంది. ఇదిలాఉంటే, ఇళ్ల నుంచి వచ్చే వ్యర్థాలు, చెత్తా చెదారం, పరిశ్రమల నుంచి వచ్చే విషతుల్య రసాయనాలు నదులలో కలుస్తున్నాయి. ప్ర‌భుత్వాల నిర్ల‌క్ష్య వైఖ‌రి కార‌ణంగా న‌దులు కాలుష్యానికి గుర‌వుతున్నాయి. అంతిమంగా దేశంలోని మెజారిటీ న‌దులు ఇవాళ పెద్ద మురికి కాలువలుగా మారిపోయాయి. ప్రజలకు సురక్షిత నీరు అందించాలంటే ముందుగా నదులను కాపాడుకో వాలి, కాలుష్యం నుంచి న‌దుల‌ను రక్షించుకోవాలి. ప్రభుత్వాలు ఈ దిశగా అడుగులు వేయాలి.

Latest Articles

‘ఆపరేషన్ వాలెంటైన్’ విజువల్ ఫీస్ట్ లా వుంటుంది – చిరంజీవి

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ ఎయిర్ ఫోర్స్ యాక్షనర్ ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
291FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్