కృష్ణాజిల్లా మచిలీపట్నంలో అర్థరాత్రి జనసేన పార్టీ జెండా దిమ్మను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేయడం తీవ్ర కలకలం సృష్టించింది. 11వ డివిజన్ లో జనసేన ఇంచార్జ్ బండి కరుణాకర్ గత కొన్ని రోజుల క్రితం భాస్కరపురంలో జనసేన పార్టీ దిమ్మెను ఏర్పాటు చేయగా ఆ జెండా దిమ్మను గుర్తు తెలియని వ్యక్తులు శనివారం అర్థరాత్రి 1గంట సమయంలో ప్రొక్లైన్ తో కూల్చివేశారు. జెండా దిమ్మ కూల్చివేత దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అధికార వైసీపీ నేతల ఒత్తిళ్ల కారణంగా రెండు రోజుల క్రితమే ఈ జెండా దిమ్మను తొలగించేందుకు టౌన్ ప్లానింగ్ అధికారులు రాగా జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగటంతో వారు వెనుతిరిగి వెళ్లారు. ఈ క్రమంలో అర్థరాత్రి సమయంలో జెండా దిమ్మ కూల్చివేత వివాదాస్పదంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ కూల్చివేసిన జెండా దిమ్మను పరిశీలించారు. కూల్చిన జెండా దిమ్మ వద్ద జనసైనికులు ఆందోళనకు దిగారు.


