ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న పట్టణాల్లో పిఠాపురం ఒక్కటి. రాజులు పాలించిన ప్రాంతాల్లో పిఠాపురం కూడా హిస్టారికల్‌గా ప్రాముఖ్యత గల నియోజకవర్గం. రాజకీయ పరంగా చైతన్యవంతులైన నేతలకు కొలువైన కేంద్రం పిఠాపురం.
సామాజికపరంగా కాపు ఓట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ ఇక్కడ తీర్పు మాత్రం విలక్షణమనే చెప్పాలి. కాంగ్రెస్, టిడిపి, బీజేపీ, ఇండిపెండెంట్లు కూడా విజయం సాధించిన ఘనత ఈ నియోజకవర్గానికి ఉంది. కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రిగా పనిచేసిన కొప్పన మోహన్‌రావు రెండు సార్లు, టిడిపి నుండి వెన్నా నాగేశ్వరరావు మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. స్వతంత్య్ర అభ్యర్థిగా సంగిశెట్టి వీరభద్రరావు గెలుపొందారు. బీజేపీ నుండి పెండెం దొరబాబు, ప్రజారాజ్యం నుండి వంగాగీత గెలుపొంది రికార్డు సృష్టించారు. అనూహ్యంగా 2014లో టిడిపి రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన క్షత్రియ వర్గానికి చెందిన వర్మకు ఏకంగా 48 వేల ఓట్ల మెజార్టీ వచ్చిందంటే ఇక్కడ కుల ప్రాధాన్యత కన్నా వ్యక్తి ప్రాధాన్యత కూడా బలంగా ఉందనే చెప్పాలి. 2019లో మాత్రం జగన్ గాలిలో రెండోసారి పెండెం దొరబాబు ఎమ్మెల్యేగా గెలిచి కొనసాగుతున్నారు. ప్రస్తుతం పిఠాపురంలో రాజకీయ వాతావరణం హీట్ పెంచుతోంది. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు ఈసారి సీటు ఇవ్వడంలేదని అధిష్టానం తేల్చిచెప్పేసింది. ఆయన స్థానంలో కాకినాడ ఎంపీ వంగా గీతకు పిఠాపురం ఇన్‌ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. దీంతో ఇక్కడ వైసీపీ క్యాడర్‌లో గందరగోళం నెలకొంది. కొంత మంది ఎమ్మెల్యే వర్గంగా, మరికొంత మంది ఎంపీ వర్గంగా మారిపోయారు.
కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న పిఠాపురంలో జనసేన-టిడిపి పొత్తులో భాగంగా కేటాయించే సీట్‌పై హీట్ పెరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే వర్మ టిడిపి ఇన్‌ఛార్జిగా ఉన్నారు. అంతకముందు జనసేన ఇన్ ఛార్జిగా ఉన్న శేషుకు మారిని తప్పించి, ఆ బాధ్యతలను రాజమండ్రి దగ్గర కడియంకు చెందిన ఉదయ్ శ్రీనివాస్ కు అప్పగించారు. అయితే అనుకున్నస్థాయిలో ఉదయ్ శ్రీనివాస్ పిఠాపు రంలో పట్టు సాధించలేకపోయారు. రాజకీయంగా ఆయన ఒంటెద్దు పోకడలతో వ్యవహరించడంతో జనసేన క్యాడర్ వర్గాలుగా మారిపోయింది. పైగా ఉదయ్ శ్రీనివాస్ స్వస్థలం కడియం ప్రాంతం కావడంతో లోకల్ ఫీలింగ్ రావడం జనసేనకు సంకటంగా మారింది. ఇక టిడిపి విషయానికొస్తే, వర్మ క్షేత్రస్థా యిలో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. అయితే వర్మ జనసేనను కలుపుకోవడం లేదనే విమర్శలు ఎదుర్కొంటు న్నారు. ఆయన ఒంటెద్దు పోకడలు జనసేన కార్యకర్తలకు మంటపుట్టిస్తున్నాయి. ఈ ప్రభావంతో ఖచ్చితంగా జనసేన-టిడిపి క్యాడర్‌ను ఒక్కతాటిపైకి తీసుకురాక పోతే ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. మరోపక్క జనసేనకు సీటు కేటాయిస్తే మాజీ ఎమ్మెల్యే వర్మ మరోసారి రెబల్‌గా రంగంలోకి దిగుతారని అంటున్నారు. మొత్తంగా ఇక్కడ జనసేన-టిడిపి అంతర్గత రగడ మాత్రం క్యాడర్‌ను అయోమయానికి గురిచేస్తోంది.
వైసీపీ నుండి ఇన్‌ఛార్జిగా ఉన్న ఎంపీ వంగా గీత కూడా పిఠాపురం నియోజకవర్గంలో పూర్తి పట్టుసాధించలేకపోతు న్నారు. ఒకపక్క ప్రభుత్వ వ్యతిరేఖత, ఎమ్మెల్యే దొరబాబు వర్గం సహకారం లేకపోవడం గీతకు కూడా నియోజకవర్గంలో స్పందన లభించడం లేదు. దీంతో ఆమె జనసేన-టిడిపి పొత్తు అభ్యర్థిని ఎదుర్కోగలరా అనే అనుమానాలు కలుగుతు న్నాయి. జనసేన పార్టీ క్యాడర్ బలంగా ఉన్న నియోజకవర్గంలో పిఠాపురం ఒకటి. అయితే ఇన్‌ఛార్జి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తనవైపు ఆ బలాన్ని మలచుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఈ పరిణామాలతో జనసేనాని పిఠాపురం సీటు విషయంలో ఎటూ తేల్చలేకపోతున్నారు. పిఠాపురం నుండి పవన్ పోటీ చేస్తారన్న వార్తలు రావడం, ఉదయ్ శ్రీనివాస్ జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరం కావడం చూస్తుంటే నిజంగా పవన్ ఇక్కడ నుంచే బరిలోకి దిగుతారనే ప్రచారం ఊపందుకుంది….