కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తు వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేసింది సీబీఐ. ఈ ప్రాజెక్టు నిర్మాణంలోని అక్రమాలపై దర్యాప్తునకు సిద్ధంగా ఉన్నమంటూ హైకోర్టులో కౌంటర్ సైతం దాఖలు చేసింది. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కానీ, లేదంటే రేవంత్ సర్కారు కానీ ఆదేశిస్తే దర్యాప్తు చేస్తామంటూ సీబీఐ అధికారులు పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కేసీఆర్ నేతృత్వంలోని నాటి బీఆర్ఎస్ సర్కారు చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం రోజురోజుకూ తీవ్ర చర్చనీ యాంశంగా మారుతోంది. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేసింది సీబీఐ. కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తుపై హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన సీబీఐ అధికారులు… అందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టు నిర్మాణంలో చోటు చేసుకున్న అక్రమాలపై దర్యాప్తునకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు సీబీఐ అధికారులు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు లేదంటే రేవంత్ రెడ్డి సర్కారు ఆదేశిస్తే దర్యాప్తు చేస్తామని కౌంటర్‌లో పేర్కొన్నారు. అయితే.. దర్యాప్తునకు అవసరమైన వనరులు, సౌకర్యాలు ప్రభుత్వం కల్పించాలన్నారు. ఒక అదనపు ఎస్పీతోపాటు ముగ్గురు డీఎస్పీలు, ఆరుగురు ఇన్‌స్పెక్టర్లు, నలుగురు ఎస్‌ఐలతోపాటు ఇతర సిబ్బంది కావాలన్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని, ఉత్తర ప్రత్యుత్తరాలు జరగ లేదంటూ హైకోర్టుకు విన్నవించింది సీబీఐ. కాళేశ్వరంలో అవినీతిపై దర్యాప్తు చేయాలని కోరుతూ ఫిర్యాదు చేసినా సీబీ ఐ నుంచి ఎలాంటి స్పందన లేదని పేర్కొంటూ న్యాయవాది రామ్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటీషన్ వేశారు. దీనికి కౌంటర్ దాఖలు చేసింది సీబీఐ. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు రుణాలుగా ఇచ్చిన బ్యాంకుల కన్సార్షియం సైతం ఎలాంటి ఫిర్యాదు చేయలేదని హైకోర్టుకు తెలిపింది సీబీఐ. దీంతో.. సంబంధిత ఆరోపణలపై నేరుగా జోక్యం చేసుకునే విష యంలో తమకు కొన్ని పరిమితులున్నాయని, అందుకే స్పందించలేదని కౌంటర్‌లో పేర్కొన్నారు సీబీఐ అధికారులు. అయితే.. పిటీషనర్ అందచేసిన ఫిర్యాదుపై పరిశీలన చేస్తున్నామని కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది సీబీఐ. ఇదే ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది.