వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతకాలంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీలో ఎప్పుడు ఏం జరుగు తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియని పరిస్థితి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో నెలకొంది. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు.
ఓసారి నేపథ్యంలోకి వెళితే …2019 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 175 నియోజకవర్గాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. అయితే అభ్యర్థుల పేర్ల విషయమై ఈసారి జగన్మోహన్ రెడ్డి భిన్నమైన వైఖరి తీసుకు న్నారు. విడతలవారీగా నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లను ప్రకటిస్తున్నారు. దీంతో ఏ జాబితాలో తమ పేరు ఉంటుందో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తెలియడం లేదు. అసలు జాబితాలో పేరు ఉంటుందా ? లేక ఈసారి విశ్రాంతి తీసుకోమని అధినేత జగన్మోహన్ రెడ్డి అంటారో తెలియడం లేదంటున్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు. వై నాట్ 175 …అంటూ ఎంతో ధీమాతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇన్‌చార్జ్‌లను అటూ ఇటూగా మార్చడం సర్వసాధారణంగా మారింది. మొత్తం 175 నియోజకవర్గాల్లో ఇప్పటికే మూడో వంతుకు పైగా స్థానాల్లో సిట్టింగ్‌లను మార్చారు జగన్మోహన్ రెడ్డి. కొన్నిసార్లు మార్చిన ఇన్‌చార్జ్‌లను మళ్లీమళ్లీ మార్చారు. దీంతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో గందరగోళ పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. గెలుపుమీద నమ్మకం లేకనే…ఇన్‌చార్జ్‌లను ఎడాపెడా జగన్మోహన్ రెడ్డి మార్చివేస్తున్నారన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లోనే కాదు…సామాన్య ప్రజల్లోనూ కలుగుతోంది.
జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనపై సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కటొక్కటిగా సమాజంలోని అన్ని వర్గాలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కు దూరమయ్యాయి. జగన్ సర్కార్‌పై కొంతకాలం కిందట మునిసిపల్ కార్మికులు కదం తొక్కారు. ఈ సందర్భంగా ప్రతి జిల్లాకేంద్రంలోనూ మునిసిపల్ కార్మికులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మునిసిపాలిటీలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ వర్కర్లను పర్మినెంట్ చేయాలన్నది మునిసిపల్ కార్మికుల ప్రధాన డిమాండ్. అలాగే సమాన పనికి సమాన వేతనం చెల్లించాల న్నది మునిసిపల్ కార్మికుల మరో డిమాండ్. మునిసిపల్ కార్మికులే కాదు, అంగన్‌వాడి వర్కర్లు కూడా కొంతకాలం కిందట సమ్మె బాట పట్టారు. తమ డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడి వర్కర్లు సమ్మె చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రతినిధులతో అంగన్‌వాడి హెల్పర్లు చర్చలు కూడా జరిపారు. అయితే ప్రభుత్వం మంకుపట్టు కారణంగా చర్చలు ఫలప్రదం కాలేదు. దీంతో సమ్మె కొనసాగించారు అంగన్‌వాడి వర్కర్లు. కార్మికులతో చర్చలు అంటే ఒకపట్టాన ఫలప్రదం కావు. మొదట కార్మికుల సమస్యలను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి ఉండాలి పాలకవర్గాలకు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సర్కార్‌కు ఈ చిత్తశుద్దే లోపించిందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. దీంతో న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీ కార్యకర్తలు చేస్తున్న సమ్మెను ఉక్కుపాదంతో అణచివేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే అంగన్‌వాడి వర్కర్ల సమ్మెపై ఎస్మా చట్టం ప్రయోగానికి కూడా జగన్మోహన్ రెడ్డి సర్కార్ వెనుకాడలేదు.
ఎస్మా అంటే చిన్నాచితకా చట్టం కాదు. దీనిని నల్లచట్టం అని కూడా అంటారు. ఎస్మా చట్టం ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ వర్తించదు. కేవలం ప్రజలకు సంబంధించిన అత్యవసర సేవల నిర్వహణలో పాల్గొనే సర్వీసులకే ఎస్మా చట్టం వర్తిస్తుంది. సమ్మెలు, బంద్‌ల వల్ల ప్రజల దైనందిన జీవనానికి ఇబ్బంది కలగకుండా చూడటమే ఎస్మా చట్టం ముఖ్యోద్దేశం. ప్రజలకు అవసరమైన కొన్ని రకాల అత్యవసర సేవల నిర్వహణ కు ఎటువంటి ఆటంకం లేకుండా చూడటం కోసం 1981లో ఎస్మా చట్టాన్ని రూపొందించారు.అంగన్‌వాడీ వర్కర్లపై ఎస్మా చట్టం ప్రయోగిస్తూ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఉత్తర్వులు జారీ చేయడం అందరినీ ఆశ్చర్యపరచింది.అసలు అత్యవసర సర్వీసుల కిందకు అంగన్ వాడీలు ఎలా వస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. సహజంగా ప్రజల దైనందిన జీవితాలపై ప్రభావం చూపే రవాణా, విద్యుత్ లాంటి సర్వీసులనే అత్యవసర సేవలుగా పరిగణిస్తారు. అంగన్‌వాడీ వర్కర్లు సమ్మె చేస్తే, ఆ ప్రభావం ప్రజల దైనందిన జీవితాలపై ఏ విధంగానూ ఉండదంటారు సామాజిక శాస్త్రవేత్తలు. అంగన్‌వాడీలను ఎవరైనా ఒక పరిమిత గ్రూపుగానే చూస్తారు. సామూహికంగా ప్రజలు ఇబ్బంది పడటం అనేది అంగన్‌వాడీలు సమ్మె వల్ల జరగదు. అయితే ఎవరు సలహా ఇచ్చారో కానీ, అంగన్‌వాడీ వర్కర్ల డిమాండ్లను అంగీకరించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగీకరించారు. దీంతో అంగన్‌వాడీ కార్యకర్తలు సమ్మె విరమించారు.
జగన్మోహన్ రెడ్డి పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్న వర్గాల్లో యువత కూడా ఉంది. విభజనకు ముందు హైదరా బాద్‌ను ఐటీ హబ్‌గా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీర్చిదిద్దారు. హైదరాబాద్ ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందడంతో ఆంధ్ర ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో యువతీయువకులు హైదరాబాద్ వెళ్లేవారు. అక్కడి ఐటీ సెక్టార్‌లో ఉద్యోగాలు చేసుకునేవారు. దీంతో ఆంధ్రా ప్రాంత యువతకు నిరుద్యోగం అనే సమస్యే ఉత్పన్నం అయ్యేది కాదు. అయితే విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ సామాజిక పరిస్థితుల్లో పెనుమార్పులు సంభవించాయి. జగన్మోహన్ రెడ్డి సర్కార్ వస్తే తమకు ఉద్యోగాలు దొరుకుతాయని ఆంధ్రప్రదేశ్ యూత్ భావించింది.దీంతో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీకి యువత జై కొట్టింది. అయితే ఆంధ్రప్రదేశ్ యువత ఆనందం ఎక్కువకాలం నిలబడలేదు. యువత ఉద్యోగాల కల్పన విషయాన్ని జగన్మోహన్ రెడ్డి సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దీంతో ఉద్యోగాలు లేక ఆంధ్రప్రదేశ్ యువత రోడ్డున పడింది.