ఆగవమ్మా.. ఆగు.. అని ఎంత వెంట పరుగులు పెడుతున్నా.. మెయిల్, ఎక్స్ ప్రెస్ రైలు మాదిరి పరుగెడుతున్న బంగారం ధర ను ఎవరూ అడ్డుకోలేకపోతున్నారు. పరుగుల రాణులు, రన్నింగ్ రాజులు.. నీ సువర్ణ ధర ముందు దిగదుడుపే అని ఎంత మొత్తుకున్నా ఆగడం లేదు. నీ రన్నింగ్ గ్రేటే, మా బంగారానివి కదూ.. నీకు గోల్డ్ మెడల్ ఇస్తామన్నా రన్నింగ్ ఆపడం లేదు. బంగారం అని బతిమలాటలు, గోల్డ్ మెడల్స్ ప్రలోభాలు తన వద్ద జాంతా నహి అంటున్న బంగారం ధర, తానే బంగారం అయితే తనకు బంగారు మెడలా.. అంటూ కాస్త ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. అయితే తన పరుగును మాత్రం బంగారం ధర ఆపడంలేదు.
పోనీ బంగారం ధరను అందని ద్రాక్షలా వదిలేద్దామని అనుకుని.. బంగారం వెనకాలే పరుగెడుతున్న వెండి ధర ని బతిమలాడి తన రన్నింగ్ ఆపమంటే, వెండి సైతం ససేమిరా అనేసి బంగారం వెంటే పరుగులు పెట్టేస్తోంది. ఏదో మనుషులైతే.. హార్ట్ ఎటాక్ లో, మరో స్ట్రోక్ లో వస్తాయని నయాన్నో, భయాన్నో పరుగులు ఆపు చేయవచ్చు. అసలు జాలి, నాలి, గుండె, పోటు.. అనేవేమీ స్వచ్ఛమైన సువర్ణానికి, తళతళ మెరిసే వెండికి ఎందుకుంటాయి. కొండెక్కి కూర్చున బంగారం, వెండి ధరలు.. ఇప్పట్లో దిగిరామని స్పష్టం చేసేస్తున్నాయి. దేశీయంగా సువర్ణం ధర మరింత ధగధగలాడుతోంది. బంగారం ధర 88 వేల రూపాయలు దాటేసి సరికొత్త గరిష్ఠాలకు చేరుకుంది.
ఢిల్లీ మహానగరంలో ఏ గల్లీలోని జ్యుయలర్ షాపు చూసినా పది గ్రాముల మేలిమి పసిమి ధర 2,430 రూపాయలు పెరిగి.. 88,500 రూపాయల మార్కు వద్దకు చేరుకుంది. క్రితం వారం 99.9 స్వచ్ఛత కలిగిన పది గ్రాముల బంగారం ధర 86,070 రూపాయల వద్ద ఉండగా…ఇప్పుడు ద్వి సహస్ర రూపాయలకు చేరుకుని.. చూస్కోండి తడాఖా అంటోంది. హాఫ్ ఆఫ్ ది మంత్ పరిణయ ముహూర్తాల వల్ల బంగారం ధర భగభగలాడుతోందని సామాన్యులు చర్చించుకుంటుండా, ఇంటర్నేషనల్ ఛేంజస్, డిటీరియేషన్ ఆఫ్ రూపీ… బంగారం ధర పెరగడానికి కారణమని ఆల్ ఇండియా సరాఫా సంఘం తెలియజేస్తోంది.
మొండివాడు రాజు కంటే బలవంతుడు అంటారు.. అయితే, మొండి వ్యక్తే రాజు అయ్యి కూర్చుంటే.. ఓర్నాయనో అనుకోవడం తప్ప.. ఆయనగారి ఆదేశాలు ఎలా ఉంటాయో ఎవరూ చెప్పలేరు. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకో వాణిజ్య ప్రకటనతో ఊదరకొట్టడంతో.. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్లతో పాటు బంగారం ధరమీద పడుతోందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అల్యూమినియం, స్టీల్ ఇంపోర్ట్ లపై పాతిక శాతం సుంకం విధిస్తానని ట్రంప్ మహాశయుడు పేర్కొనడం ప్రస్తుత భయాలకు కారణమైనట్టు తెలుస్తోంది. అనిశ్చిత పరిస్థితుల్లో సురక్షిత పెట్టుబడి సాధనంగా పేరొందిన బంగారం డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. టారిఫ్ లు టాప్ అయితే, ఇన్ ఫ్లేషన్ హైక్ అయ్యి ఆర్థిక వృద్ధి బద్దకిస్తుందన్న భయాలు గోల్డ్ డిమాండ్ పెరుగుదలకు కారణమని విశ్లేషక గణం వెల్లడిస్తోంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఈ ఏడాది ఔన్స్ ..ఎన్ని వేల డాలర్ల మార్కులు దాటేసి.. ఎలాంటి డ్యాన్స్ లు చేస్తుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. అలుపు, సొలుపు లేకుండా బంగారం, వెండి ధరలు వాయు వేగంతో పరుగులు పెడుతుంటే.. వినియోగదారులు ఆపసోపాలు పడుతూ.. ఎక్కడికక్కడే చతికిలపడిపోతున్నారు.