Site icon Swatantra Tv

వైసీపీకి ప్రతిపక్ష హోదా ఉండదు.. అలా అయితే జర్మనీకి వెళ్లిపోవాలి- పవన్‌ కళ్యాణ్‌

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగంతో ఇవాళ్టి నుంచి సమావేశాలు ప్రారంభమయ్యాయి. కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాబోయే కాలంలో చేపట్టబోతున్న అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయల గురించి గవర్నర్‌ తన ప్రసంగంలో వివరించారు.

వైసీపీ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రెడ్డి సమావేశాలకు హాజరయ్యారు. గవర్నర్‌ ప్రసంగం ప్రారంభమైన 11 నిమిషాలకే వైసీపీ సభ్యులతో కలిసి బయటకు వెళ్లిపోయారు. అయితే గవర్నర్‌ ప్రసంగం సాగుతుండగానే సభలో వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. ప్రతిపక్షంగా గుర్తించాలని ఆ పార్టీ సభ్యులు నినాదాలు చేసి సభలో గందరగోళం సృష్టించారు.

ఏపీ శాసనసభ సమావేశాల్లో గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌ ప్రసంగం కొనసాగుతుండగా.. వైసీపీ సభ్యులు నినాదాలు చేయడంపై డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యుల తీరు సరిగా లేదని మండిపడ్డారు. సమావేశాల అనంతరం మీడియా పాయింట్ దగ్గర మాట్లాడిన పవన్‌ కళ్యాణ్‌.. గవర్నర్ నెల రోజులుగా తీవ్ర అనారోగ్యంలో ఉండి కూడా బడ్జెట్ పై సందేశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. గవర్నర్ ప్రసంగిస్తుండగా వైసీపీ సభ్యులు ప్రతిపక్ష హోదా కావాలని గందరగోళం సృష్టించారుని.. ఇది ఒకరు ఇచ్చేది కాదు.. ప్రజలు ఇచ్చేదని గుర్తించాలని వైసీపీకి చురకలంటించారు.

జనసేన కంటే ఒక స్థానం ఎక్కువ ఉన్నా వారికి ప్రతిపక్ష హోదా దక్కేదని అన్నారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద శాసన సభ్యులు జనసేనకు ఉన్నారని చెప్పారు. ప్రజలు వైసీపీకి 11సీట్లు ఇచ్చారు.. మీ స్థాయికి తగ్గట్లు మీకూ అవకాశం ఉంటుంది.. అని అన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో వారికీ అవకాశం ఉంటుందని చెప్పారు.

ఇంకా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ.. “వైసీపీ శాసన సభ్యులు హుందాగా ఉండాలి. లోటు పాట్లు ఏమైనా ఉంటే చెప్పాలి. అసెంబ్లీలోకి వచ్చి గొడవ పెట్టుకోవాలి, విభేదాలు పెట్టుకోవాలి అన్న ఆలోచనతో వస్తున్నారు. ఈ ఐదు సంవత్సరాలలో మీకు ప్రతి పక్ష హోదా ఉండదు. ఇది ఏ పార్టీ నిర్ణయం కాదు.. ప్రజల నిర్ణయం.

కేంద్ర ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఎన్డీఏ పక్ష నాయకుడిని ఎన్నుకున్నప్పుడు నేను ఉన్నా.. నిబంధనల ప్రకారమే సభలు వ్యవహారిస్తాయి. ఎవరైనా ప్రోటోకాల్స్ బ్రేక్ చేయము. 175 సీట్లలో కేవలం 11మాత్రమే ప్రజలు ఇచ్చారని గుర్తుంచుకోవాలి. వైసీపీకి వచ్చిన ఓటు శాతం ఆధారంగా ఇక్కడ ఉండదు.. అలా ఉంటే జర్మనీకి వెళ్ళిపోవాలి” .. అని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు.

Exit mobile version