Site icon Swatantra Tv

ఈ నెల 26 లేదా 27 తేదీల్లో వైసీపీ మేనిఫెస్టో

ఏపీలో ఎన్నికల యుద్దం కీలక దశకు చేరింది. ఓ వైపు నామినేషన్ల ప్రక్రియ.. మరోవైపు నేతల ఎన్నికల ప్రచారంతో ఏపీలో ఎన్నికల వేడి స్పష్టంగా కనిపిస్తోంది. అన్ని పార్టీలు ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ మేనిఫెస్టోపై సీఎం జగన్ తుది కసరత్తు చేస్తున్నారు. బస్సు యాత్రలో భాగంగా విశాఖలో పర్యటిస్తున్న జగన్..మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై ఇవాళ పార్టీ ముఖ్య నేతలతో చర్చించనున్నారు. కీలక నేతలతో చర్చల తర్వాత మేనిఫెస్టో హామీల పైన తుది నిర్ణయానికి రానున్నారు. ఈ నెల 26 లేదా 27 తేదీల్లో వైసీపీ మేనిఫెస్టో ప్రకటించనున్నారు.

బస్సు యాత్రలో భాగంగా జగన్ వివిధ వర్గాలతో సమావేశం అయ్యారు. వారి అభిప్రాయాలను సేకరించారు. సమావేశాల్లో ఒక బాక్స్ ఏర్పాటు చేసి సూచనలు, సలహాలు స్వీకరించారు. అయితే ప్రస్తుత సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే జగన్ కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అమ్మఒడి పరిధి పెంపు, పెన్షన్లు రూ 3 వేల నుంచి 4 వేలకు పెంచే ఛాన్స్ కనిపిస్తోంది. దీనితో పాటు రైతు రుణమాఫీ హామీపై కసరత్తు జరుగుతోంది. గత ఎన్నికల సమయంలో డ్వాక్రా సంఘాల రుణ మాఫీ హామీ ఇచ్చారు. ఈసారి రైతులకు రుణ మాఫీని అమలు చేస్తే ఎలా ఉంటుంది అనే దానిపైన చర్చలు జరుగుతున్నాయట. మరోవైపు రైతు రుణమాఫీ అమలు ప్రకటన చేస్తే ఎన్నికల్లో గేమ్ చేంజర్ గా ఉంటుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అలాగే మహిళల కోసం కొత్త నిర్ణయాలు కూడా ఎన్నికల్లో కలిసొస్తాయని అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈసారి వైసీపీ ఎన్నికల ప్రణాళికలో భారీగానే హామీలు ఉంటాయని అంటున్నారు. త్వరలోనే వైసీపీ మేనిఫెస్టో ప్రకటించేందుకు రంగం సిద్ధమవుతోంది.

Exit mobile version