స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఇది గెలుపు మేనిఫెస్టో అని అభివర్ణించారు. తెలంగాణ భవితకు భరోసా ఇచ్చేలా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉందని తెలిపారు. ఇది బీఆర్ఎస్ మేనిఫెస్టో మాత్రమే కాదు, ప్రజల మేనిఫెస్టో కూడా అని హరీశ్ రావు స్పష్టం చేశారు. ముచ్చటగా మూడోసారి గులాబీ జెండాను రెపరెపలాడించే మేనిఫెస్టో అని వివరించారు. తొమ్మిదిన్నరేళ్లుగా ఇచ్చిన హామీలు అమలు చేసి, ఇవ్వని హామీలను కూడా ఆచరణలోకి తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని హరీశ్ రావు పేర్కొన్నారు. విజన్, కమిట్ మెంట్ ఉన్న నాయకుడిగా తాజా మేనిఫెస్టోలోని హామీలను సైతం వందశాతం అమలు చేస్తారని ప్రజలు నమ్ముతున్నారని స్పష్టం చేశారు. అందుకే బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించగానే ప్రజలు సంబరాల్లో మునిగిపోతే, ప్రతిపక్షాలు మాత్రం నిరాశలో మునిగిపోయాయని హరీశ్ వివరించారు. సీఎం కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్ తో విపక్షాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలవడం ద్వారా బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టబోతోందని, రికార్డు సృష్టించబోతోందని తెలిపారు.