Site icon Swatantra Tv

యాత్రలు కాంగ్రెస్ ను గెలిపిస్తాయా ?

రాహుల్ గాంధీ రాజకీయ ప్రస్థానంలో భారత్‌ జోడోయాత్ర ఓ కీలక ఘట్టం. జాతి సమైక్యతే లక్ష్యంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు. మనదేశంలో పాదయాత్రలు కొత్తకాదు. ఆధునిక భారతదేశ చరిత్రలో అనేకమంతి నాయకులు పాదయాత్రలు చేశారు.సామాన్య ప్రజలతో మమేకమయ్యారు. అయితే మెజారిటీ పాదయాత్రల మౌలిక లక్ష్యం ఎన్నికల్లో గెలిచి అధికారానికి రావడమే. అయితే రాహుల్ పాదయాత్రకు, ఎన్నికల రాజకీయాలకు ఎక్కడా రవ్వంత సంబంధం లేదు.

కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఈ పాదయాత్ర సాగింది. ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ సహా 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో రాహుల్ పాదయాత్ర నడిచింది. భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో పాటు వివిధ వర్గాల ప్రజలు రాహుల్ తో పాటు నడిచారు. కన్యాకుమారి లో యాత్ర ప్రారంభమైన తొలి రోజుల్లో రాహుల్ ను చాలా మంది లైట్ గా తీసుకున్నారు. ఆయన వేసుకున్న టీ షర్ట్ ఎంతో ఖరీదైనదంటూ బీజేపీ నాయకులు ఎడాపెడా కామెంట్లు చేశారు. అదేదో ఓ పెద్ద కుంభకోణం అనేంత రీతిలో విమర్శలు చేశారు. దీంతో ఆగ్రహం చెందిన కాంగ్రెస్ నాయకులు రియాక్ట్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని లక్షల రూపాయలు ఖరీదు చేసే డ్రస్సు వేసుకుం టారనీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వేలాది రూపాయలు ఖరీదు చేసే మఫ్లర్ వేసుకుంటారని కాంగ్రెస్ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దీంతో కమలనాధులు సైలెంట్ అయ్యారు.

తెల్లవారుజామున నిద్ర లేవగానే ఓ ఇరవై నిమిషాలపాటు వ్యాయామం. ఆ తరువాత తేలికపాటి బ్రేక్ ఫాస్ట్. ఇక రోజంతా నడకే నడక. అలసట అనేదే లేకుండా అడుగులో అడుగేసుకుంటూ మైళ్లకు మైళ్లు నడిచారు రాహుల్.తమిళనాడు యాత్ర కాస్తంత సరదాగా సాగింది. రాహుల్ అడుగులో అడుగేసిన ఓ పెద్దావిడ ఆయన పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చింది. మీరు ఊ అంటే చెప్పండి. నేనే ఓపిక చేసుకుని ఓ మాంఛి తమిళ అమ్మాయి సంబంధం వెతుకుతానంది.పెద్దావిడ మాట పూర్తయ్యిందో లేదో అంతటా నవ్వులే నవ్వులే. రాహుల్ కూడా ముసిముసిగా నవ్వుకున్నారు.గాంధీ కుటుంబానికి చెందిన నాయకుల కున్న పెద్ద ప్లస్ పాయింట్, జనంతో ఇంటరాక్షన్. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కూతురైనప్పటికీ ఇందిరా గాంధీ ఏ రోజూ అంతపుర రాజకీయాలకు పరిమితం కాలేదు. జనంలోకి వెళ్లింది. మారుమూల పల్లెల్లో తిరిగింది. అందుకే అప్పట్లో ఇందిరకున్న మాస్ ఫాలోయింగ్ మరే ఇతర నాయకుడికి రాలేదంటారు రాజకీయ విశ్లేషకులు. ఇందిర ఒక్కరే కాదు, రాజీవ్ కూడా జనం బాట పట్టిన నాయకుడే. రాష్ట్రాల పర్యటనలకు వెళ్లినప్పుడు రాజీవ్ భద్రతను పట్టించుకునేవారు కాదు. సెక్యూరిటీ సిబ్బంది వారించినా జనంలోకి వెళ్లేవారు.

రాహుల్ కు కూడా సరిగ్గా అవే లక్షణాలే వచ్చాయి. బహుదూరపు బాటసారిలా వేలాది కిలోమీటర్లు గతుకుల రోడ్లమ్మట నడుచుకుంటూ వెళ్లారు. ఎలాంటి శషభిషలు లేకుండా సామాన్య జనంతో మమేకమయ్యారు. మాట్లాడ్డం తగ్గించి, వినడానికి ప్రాధాన్యం ఇచ్చారు. రాహుల్ అంతటి వాడు తమ పల్లెల్లోకి వస్తే. జనం ఊరుకుంటారా ? ఇందిర మనవడిని చూడటానికి పరుగులు తీవారు. కష్టంసుఖం చెప్పుకున్నారు. బిడ్డ పెళ్లి గురించి, కొడుకు చదువు గురించి ఏదో ఇంటికొచ్చిన చుట్టంతో మాట్లాడినట్లు రాహుల్ తో మాట్లాడారు.రాష్ట్రాలు దాటుతున్న కొద్దీ భారత్ జోడో యాత్రకు సామాన్య జనంలో ఆదరణ పెరిగింది. రాహుల్ చుట్టూ యువకులు, మహిళలు, పిల్లలు. ఏ రాష్ట్రంలో చూసినా ఇదే దృశ్యం కనిపించింది. సామాన్య ప్రజలు రాహుల్ వెంట అడుగులో అడుగేశారు. ఆయనతో పాటు మైళ్ల దూరం నడిచారు. ఏ రాష్ట్రానికి వెళ్లినా స్థానిక నాయకులతో రాహుల్ ఇంటరాక్ట్ అయ్యారు. ఆయా ప్రాంత సమస్యలపై అవగాహన పెంచుకున్నారు. అలాగే రాహుల్ ఏ రాష్ట్రానికి వెళ్లినా అక్కడి యువతతో బాగా కనెక్ట్ అయ్యారు.ఈ జనరేషన్ చెప్పేదిశ్రద్ధగా ఆలకించారు. భవిష్యత్ భారత్ ఎలా ఉండాలని వాళ్లు కోరుకుంటున్నారో అడిగి తెలుసుకు న్నారు. దేశ సామాజిక పరిస్థితులపై తనను తాను అప్ డేట్ చేసుకున్నారు.

రాహుల్ పాదయాత్ర ఉత్తరాదిలో ప్రవేశించినప్పుడు అక్కడ చలిగాలులు వీస్తున్నాయి. వణికించే చలిలో కూడా రాహుల్ టీ షర్ట్ పైన పాదయాత్ర చేశారు. ఎక్కడా స్వెట్టర్ వేసుకోలేదు. కన్యాకుమారిలో భారత్ జోడో యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి టీ షర్ట్ పైనే కనిపించారు రాహుల్.కర్ణాటకలో జోడోయాత్ర నడుస్తు న్నప్పుడు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ కూడా కలిశారు. రాహుల్ అడుగులో సోనియా, ప్రియాంక అడుగులో అడుగేసుకుంటూ నడిచారు. కాగా జోడోయాత్ర విజయవంతమైన నేపథ్యంలో ఇటీవల మరో యాత్ర చేపట్టారు రాహుల్ గాంధీ. ఈ ఏడాది జనవరిలో భారత్ జోడో న్యాయ్‌ యాత్ర పేరుతో మరో యాత్ర చేశారు రాహుల్ గాంధీ. గతంలో చేసిన భారత్ జోడోయాత్రకు కొనసాగింపుగా ఈ న్యాయ్‌ యాత్రను చెప్పుకోవచ్చు. ఈశాన్య ప్రాంతమైన మణిపూర్‌లో ప్రారంభమైన న్యాయ్ యాత్ర పశ్చిమ భారతం మీదుగా కొనసాగి చివరకు ముంబైలో ముగిసింది. మణిపూర్ నుంచి న్యాయ్ యాత్ర ప్రారంభించడం వెనుక ఓ పరమార్థం ఉంది. బీజేపీ ప్రభుత్వ హయాంలో సంభవించిన మణిపూర్ అల్లర్లను దేశమంతా వివరించ డానికే రాహుల్ ఈశాన్య రాష్ట్రం నుంచి యాత్ర ప్రారంభించారంటారు రాజకీయ పరిశీలకులు. మొన్నటి జోడోయాత్ర నిన్నటి న్యాయ్‌యాత్రలతో సామాన్య ప్రజల్లో రాహుల్ గాంధీ తనకంటూ ఓ సరికొత్త ఇమేజ్ తెచ్చుకున్నారు. రాహుల్ అంతపుర రాజకీయ వేత్త కాదని ప్రజలు గ్రహించారు. ముఖ్యంగా యువతలో రాహుల్ గుడ్‌విల్ తెచ్చుకున్నారు. అయితే ఈ యాత్రలు, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఏమేరు గెలుపుతీరాలకు చేరుస్తాయా అనే ప్రశ్న తెరమీదకు వచ్చింది.

Exit mobile version