Site icon Swatantra Tv

జనసేనతో పొత్తు ఉంటుందా? లేదా?

– కలసి కదనమా? ఒంటరి పోరాటమా?
– బీజేపీ రాజకీయ తీర్మానంలో కనిపించని జనసేన పొత్తు అంశం
– ఒంటరి పోరాటం చేద్దామన్న కేంద్ర పార్టీ ప్రముఖులు
– భావసారూప్యత ఉన్న పార్టీతోనే పొత్తు అంటూ అందుకు విరుద్ధంగా రాజకీయ తీర్మానం
-తీర్మానంలో జనసేన పేరు ప్రస్తావించకపోవడంలో మతలబేమిటి?
– ప్రెస్‌మీట్‌లో మాత్రం జనసేనతో కలసి పోటీ చేస్తామన్న నేతలు
– ఇంకో వైపు ప్రాంతీయ పార్టీలతో ప్రమాదమని హెచ్చరిక
– అవి కుటుంబపార్టీలని విమర్శలు
– మరి జనసేన ప్రాంతీయ పార్టీనా? జాతీయ పార్టీనా?
– బీజేపీతో కాదంటే ఒంటరి పోరేనన్న పవన్‌
– కాకపోతే కొత్త పొత్తులన్న వ్యాఖ్యతో గంరగోళం
– పొత్తులపై ఏపీ బీజేపీలో గందరగోళం

( మార్తి సుబ్రహ్మణ్యం)

ఆలూ లేదు చూలూ లేదు. కొడుకుపేరు సోమలింగం అన్నట్లుంది ఏపీలో పొత్తుల వ్యవహారం. ప్రధానంగా జాతీయ పార్టీ అయిన ‘కమలం కోయిల’, ఈ విషయంలో తొందరపడి మరీ కూస్తోంది. అయితే ఆ కూతలో రకరకాల విరుపులు, మరెన్నో అర్ధం గాని మాటలు లీడర్లు, క్యాడర్‌ను గందరగోళ పరుస్తున్నాయి. ఏపీలో పొత్తులపై ఇప్పటిదాకా అధికారికంగా మాట్లాడుతున్న బీజేపీ-జనసేన నేతల మధ్య, ఆ పొత్తులపైనే స్పష్టత లేకపోవడం మరో వైచిత్రి.

తాజాగా భీమవరంలో జరిగిన ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో, పొత్తుల ప్రస్తావన వచ్చింది. నిజానికి ముఖ్య అతిథిగా హాజరయిన కేంద్రమంత్రి-రాష్ట్ర పార్టీ ఇన్చార్జి మురళీధరన్‌, బీజేపీ జాతీయ సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్‌జీ.. రాష్ట్రంలో ఎవరితో పొత్తులు లేకుండా వెళ్లాలని సూచించారు. ఆ మేరకు రాష్ట్రంలో పార్టీ బలం పెంచుకుని, ప్రత్యామ్నాయశక్తిగా ఎదగాలని పిలుపునిచ్చారు.

అయితే.. అదే కార్యవర్గంలో ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానంలో మాత్రం.. భిన్నాభిప్రాయం వ్యక్తం చేయడం, నేతలను గందరగోళపరిచింది. ‘టీడీపీ -వైసీపీతో కాకుండా భావసారూప్యత కలిగిన పార్టీతో మాత్రమే, బీజేపీ ముందుకు వెళ్లాలని ప్రజలు కోరుకుంటున్నారు’ అని పేర్కొనడం, ఇంకో గందరగోళానికి దారి తీసింది. ఎందుకంటే ప్రస్తుతానికి జనసేన మాత్రమే బీజేపీకి మిత్రపక్షం. ఆ విషయం అటు జనసేన-ఇటు బీజేపీ నేతలు స్పష్టం చేస్తూనే ఉన్నారు.

ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉంటుందన్న విషయాన్ని.. రాజకీయ తీర్మానంలో స్పష్టం చేయకపోవడం వల్ల, క్యాడర్‌కు తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని, బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ తీర్మానంలో అసలు జనసేనతో పొత్తు ప్రస్తావించనందున, ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉండదన్న సంకేతాలు, కింది స్థాయి కార్యకర్తలకు వెళుతున్నాయని బీజేపీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. జనసేన లేకపోతే బీజేపీ పరిస్థితి ఏమిటన్నది గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు రుజువుచేశాయని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

అయితే కార్యవర్గ సమావేశాల సందర్భంగా.. మీడియాతో మాట్లాడిన బీజేపీ అగ్రనేతలంతా, జనసేనతో పొత్తు ఉంటుందని చెప్పడంతో.. రాష్ట్ర నాయకత్వం ఆమోదించిన రాజకీయ తీర్మానం నమ్మాలా? అగ్రనేతల మీడియా ప్రకటనలు నమ్మాలా? అన్న కొత్త గందరగోళానికి తెరలేచింది.

ఇప్పటికే.. బీజేపీ కార్యక్రమాల్లో జనసేన జెండా పెడితే.. జనసేన జెండా ఎందుకు పెడుతున్నారంటూ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఒకరు, పల్నాడు నర్సరావుపేట జిల్లా మాజీ అధ్యక్షుడు సైదారావుకు ఫోన్‌ చేసి హెచ్చరించారట. ఈ విషయాన్ని తాజాగా సైదారావు ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. అంటే జనసేనతో బీజేపీకి, అంతంతమాత్రం సంబంధాలు మాత్రమే ఉన్నాయని అర్ధమవుతోంది.

అదీగాక.. ఇటీవలి కాలంలో చంద్రబాబు-పవన్‌కల్యాణ్‌ భేటీ అయిన నేపథ్యంలో.. జనసేన-టీడీపీ కలసి పోటీచేస్తాయన్న చర్చ, తీవ్రస్థాయిలో నడుస్తోంది. బహుశా ఈ అంశాలన్నీ బీజేపీ రాజకీయ తీర్మానంలో.. జనసేన పేరు ప్రస్తావించకపోవడానికి ప్రధాన కారణమయి ఉండవచ్చని బీజేపీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు.

ఇక ప్రాంతీయ పార్టీల వల్ల దేశానికి ప్రమాదమని, రాష్ర్టాలకు ప్రాంతీయ పార్టీలతో నష్టమంటూ.. బీజేపీ అగ్రనేతలు తరచుగా చేస్తున్న వ్యాఖ్యలు, జనసేన నేతలకు మనస్తాపం కలిగిస్తున్నాయి. కుటుంబ పార్టీలంటూ తమ అగ్రనేతలు చేస్తున్న వ్యాఖ్యలపై సీనియర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అటు బీజేపీ సీనియర్లు సైతం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని అనేక రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీలతో బీజేపీ కలసి పోటీ చేస్తున్న సమయంలో, ఇలాంటి వ్యాఖ్యలు పార్టీకే బెడిసికొడతాయని వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్‌డీఎ 1లో ప్రాంతీయ పార్టీలే ఎక్కువ ఉన్న వాస్తవాన్ని, తమ రాష్ట్ర నేతలు మర్చిపోవడం వింతగా ఉందని బీజేపీ సీనియర్లు గుర్తు చేస్తున్నారు.

గతంలో ఏపీలో టీడీపీ, కర్నాటకలో జనతాదళ్‌, బీహార్‌లో జనతాదళ్‌ యు, తాజాగా మహారాష్ట్రలో శివసేన వంటి ప్రాంతీయ పార్టీలతో కలసి ప్రభుత్వాలు ఏర్పాటుచేసినప్పుడు.. అవి ప్రాంతీయ పార్టీలని గుర్తురాలేదా? అని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో జనసేన కూడా జాతీయ పార్టీయేమీ కాదని, అది కూడా ప్రాంతీయ పార్టీ అని గుర్తు చేస్తున్నారు. మరి ఆ వాదన జనసేనకూ వర్తిస్తుంది కదా విశ్లేషిస్తున్నారు. వీటిలో దేవెగౌడ, థాకరే, చంద్రబాబు నాయకత్వం వహించిన కుటుంబపార్టీలతో కలసి బీజేపీ పోటీ చేసి, ప్రభుత్వంలో వారిని తీసుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

అటు పవన్‌ ల్యాణ్‌ సైతం పొత్తులపై.. తరచూ చేస్తున్న పరస్పర విరుద్ధ ప్రకటనలు, రెండు పార్టీల్లో గందరగోళం రేపుతున్నాయి. గతంలో ఒకసారి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వనని పవన్‌ ప్రకటించారు. తర్వాత తనను ముఖ్యమంత్రి చేసి అధికారం ఇస్తే, తానేంటో చూపిస్తానని విజయనగరంలో కోరారు.

మళ్లీ చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత, వైసీపీ ప్రభుత్వంపై కలసి కదం తొక్కుతామన్నారు. వైసీపీ వ్యతిరేక ఓట్లు ఎట్టి పరిస్థితిలో చీలినివ్వనని స్పష్టం చేశారు. వీటన్నింటికంటే ముందు.. తాను గతంలో ఒకసారి తగ్గానని, ఈసారి ఎదుటివారు తగ్గాలని వ్యాఖ్యానించారు. మరోసారి వైసీపీని గద్దె దింపేందుకు అవసరమైతే తానే తగ్గుతానని స్పష్టం చేశారు.

తాజాగా కొండగట్టులో పవన్‌ చేసిన వ్యాఖ్యలు మరింత గందరగోళానికి తెరలేపాయి. ‘‘ప్రస్తుతానికి బీజేపీతో పొత్తు ఉంది. అందువల్ల ఆ పార్టీతో కలసి వెళ్తాం. కాదంటే ఒంటరిగైనా వెళ్తాం. లేదా కొత్త పొత్తులు కలిస్తే వారితో కలసి వెళ్తాం’ అని, ఒక్క ఐదు నిమిషాల్లో పరస్పర విరుద్ధ వ్యాఖ్యలతో, గందరగోళానికి తెరలేపారు.

దానితో.. ఏపీలో బీజేపీతో జనసేన పొత్తు ఉంటుందా? లేదా?… కాదంటే బీజేపీని పక్కనపెట్టి టీడీపీతో కలసిపోటీ చేస్తుందా? లేదా? అసలు ఇవేమీ కాకుండా.. ఒంటరిగానే పోటీ చేస్తుందా అనే కొత్త సందేహాలకు పవన్‌ తన వ్యాఖ్యలతో తెరలేపారు.

Exit mobile version