Site icon Swatantra Tv

కాంగ్రెస్, వామపక్షాల పొత్తులు ఫలించేనా ?

       లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణలోని ఆయా పార్టీల్లో టెన్షన్ పెరుగుతోంది. రాష్ట్రంలో ఉన్నటు వంటి 17 ఎంపీ సీట్లలో ఏయే పార్టీల బలాబలాలు ఎంత ? పొత్తు పెట్టుకోవడం వల్ల వచ్చే లాభం ఏంటి ? ఒంటరిగానే బరిలో దిగితే కలిగే ప్రయోజనాలు, నష్టాలు ఏంటన్న లెక్కలేస్తున్నాయి పార్టీలు. ప్రధానంగా కాంగ్రెస్‌, వామపక్ష పార్టీల మధ్య ఇప్పుడు ఇదే చర్చ ఎక్కువగా సాగుతోంది. అయితే.. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా పొత్తులు చివరి వరకు కుదరకుండా ఉంటాయా లేదంటే అతి త్వరలోనే సీట్ల సర్థుబాటు, పొత్తుల లెక్కలు పూర్తవుతాయా ? ఒక వేళ పొత్తులే కుదిరితే కాంగ్రెస్ పార్టీ.. ఎర్రన్నలకు ఏయే సీట్లు కేటాయించే అవకాశాలున్నాయి ? దీనిపైనే ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చోప చర్చలు సాగుతున్నాయి.

     సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ఎన్డీఏను అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది ఇండి యా కూటమి. ఇప్పటికే పదేళ్లుగా అధికారంలో ఉన్న కమలనాథులకు ఎట్టిపరిస్థి తుల్లోనూ హ్యాట్రిక్‌కు అవకాశం ఇవ్వ వద్దని భావిస్తోంది. కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ… తాను అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మెజార్టీ ఎంపీ సీట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టు కుంది. ఇందులో భాగంగా ఇటీవలె తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేసిన హస్తం పార్టీ.. ఫుల్ జోష్‌లో ఉంది. ఈ సమయంలోనే పార్లమెంటు ఎన్నికలూ వస్తుండడంతో అదే ఊపు కొనసాగించి సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లలో గెలుపొందాలని.. తద్వారా ఇండియా కూటమి విజయానికి సాయపడాలని భావిస్తోంది.

       ఈ సమయంలోనే పొత్తుల ఎత్తులు కూడా తెరపైకి వస్తున్నాయి. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లాలని మొదట్లో భావించాయి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు. కానీ, కాంగ్రెస్, సీపీఎం పొత్తులో సీట్ల సర్థుబాటు విషయంలో చర్చలు అంతగా ఫలించకపోవడం, సీట్ల కేటాయింపుల్లో ఏకాభిప్రాయం రాకపోవడంతో చివరకు సీపీఎం అసెంబ్లీ ఎన్నికల బరిలో సింగిల్‌గానే పోటీ చేసింది. కానీ, ఒక్కస్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది. అయితే… సీపీఐ మాత్రం చర్చల సమయం లో ఐదు స్థానాలు లేదా మూడు స్థానాలంటూ ముందుకొచ్చింది. చివరకు ఒక్కసీటుతో సర్థుకు పోయింది. అలాగే రెండు ఎమ్మెల్సీల హామీ పొందింది. చివరకు ఆ ఒక్కసీటులో విజయం సాధించి అసెంబ్లీలో మళ్లీ ఎంట్రీ ఇచ్చింది సీపీఐ.

     గత పదేళ్లుగా అసెంబ్లీలో ప్రాతినిథ్యం లేని సీపీఐ.. పొత్తులో పోటీ చేసి కొత్తగూడెం స్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే.. ఇదే మాదిరిగా లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌తో పొత్తులో వెళ్లాలని నిర్ణయించింది సీపీఐ. అదే సమయంలో ఈసారి తొందరపడకుండా ఒంటరిగా వెళ్లకుండా కాంగ్రెస్‌తో కలసి వెళ్లాలని అటు సీపీఎం కూడా యోచిస్తోంది. దీంతో.. ఉభయ కమ్యూనిస్టులు హస్తం పార్టీతో పొత్తు పెట్టుకొని లోక్‌సభలోకి రాష్ట్రం నుంచి అడుగు పెట్టాలని భావిస్తున్నారు. పైగా ఇటీవలె కూనంనేని సాంబశివరావు అసెంబ్లీలో పోషించిన పాత్రతో శాసనసభలో కమ్యూనిస్టుల పాత్ర మరింతగా అందరికీ తెలిసి వచ్చిందన్న వాదన విన్పిస్తోంది. అదే విధంగా రాష్ట్రం నుంచి ఉభయ కమ్యూనిస్టు అభ్యర్థులు లోక్‌సభకు వెళితే మరింత మేలన్న భావనను కొంత మంది విన్పిస్తున్నారు. దీంట్లో భాగంగానే ఇటీవలె సీపీఐ నేతలు ఢిల్లీ లో కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేను కలిసి పొత్తుల ప్రస్తావన తీసుకు వచ్చారు. ప్రధానంగా ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్‌ సహా మరికొన్ని సీట్లను ఆశిస్తున్నట్లు సమాచారం. అయితే… త్వరలోనే ఇందుకు సంబంధించిన చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది.

    బీజేపీని ఎలాగైనా రానున్న ఎన్నికల్లో కట్టడి చేయాలని భావిస్తున్న సీపీఎం కూడా కాంగ్రెస్‌తో పొత్తులోకి వెళ్లేందుకు సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుతో నష్టపోయామని గ్రహించిన సీపీఎం.. ఇండియా కుటమిలో ఇప్పటికే భాగంగా ఉండడం వల్ల రెండు పార్లమెంట్‍ స్థానాలు కేటాయించాలని ప్రతిపాదనలు చేస్తున్నారు. అయితే ఏయే స్థానాలు సీపీఎం ఆశిస్తోంది అనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇటీవలె రెండురోజుల పాటు సీపీఎం రాష్ట్ర విసృత స్థాయి సమవేశాలు హైదరాబాద్‍ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగాయి. ఇదే వేదికగా సీఎం రేవంత్‌రెడ్డితో తాము సమావేశం అయిన ప్పుడు పొత్తు విషయంలో ప్రస్తావనకు వచ్చిన అంశాలను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వివరిం చారు. అయితే.. ఏ విషయం అన్నది కాంగ్రెస్ చేతుల్లో ఉందని చెబుతున్నారు తమ్మినేని. ఎన్ని సీట్లు ఇవ్వాలి ఎక్కడెక్కడ ఇవ్వాలన్న దానిపై త్వరలోనే క్లారిటీ వస్తుందని అంటున్నారు. ఒకవేళ సీట్లు కేటాయించకపోయినా పొత్తు కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారాయన. మరి.. ఈ పొత్తుల లెక్కలు, ఎత్తులు సాధ్యమైనంత త్వరగాతేల్చాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కోరుతున్నాయి. మరి.. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఎప్పుడు క్లారిటీ ఇస్తుందన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది 

Exit mobile version