Site icon Swatantra Tv

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ వస్తారా..?

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వస్తారా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రెండు సార్లు జరిగిన అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉన్నారు. తొలి అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమానికి అనారోగ్య కారణాలతో ఆయన హాజరు కాలేకపోయారు. ఆ తర్వాత అసెంబ్లీకి వచ్చి స్పీకర్ ఛాంబర్‌లో ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. రెండవ సారి తెలంగాణ ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. దీంతో అసెంబ్లీలో కేసీఆర్ టార్గెట్‌గా అధికారపక్షం విమర్శలు చేసింది. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తమకు సలహాలు, సూచనలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అనడంతో ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవుతారని బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది.

ఇప్పటికే అసెంబ్లీలో లేవెనెత్తాల్సిన అంశాలను బీఆర్ఎస్ ప్రకటించింది. రాష్ట్రంలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు, జాబ్ క్యాలెండర్ కోసం ఆందోళన సందర్భంగా నిరుద్యోగులపై పెట్టిన కేసులు, రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఆరు గ్యారంటీల అమలుకు శాసన సభలో చట్ట బద్దతతో పాటుగా రైతు రుణమాఫీ అమల్లో ఆంక్షలు, నష్టపోతున్న రైతాంగం పంటలకు మద్దతు ధరకు అదనంగా బోనస్ చెల్లింపుపై ప్రభుత్వ వైఫల్యంపై అధికార పక్షాన్ని నిలదీయనుంది.
రైతు భరోసా చెల్లింపులో జాప్యం వల్ల రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు.. గ్రామాలు ,పట్టణాలకు నిధుల విడుదలలో అలసత్వం, నిర్వహణ సరిగా లేక కుంటుపడుతున్న ప్రజారోగ్యం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల జాప్యంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది.

వీటితో పాటు ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో ఎదురవుతున్న ప్రోటోకాల్ సమస్యలు, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తాలని కారు పార్టీ భావిస్తోంది. ఈ సారి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు కావడంపై ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 25వ తేదీన ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు నుంచి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉంది. కేసీఆర్ బడ్జెట్ చర్చల్లో పాల్గొంటే రాజకీయం రసవత్తరంగా మారనుంది. దీంతో అధికార ప్రతిపక్ష పార్టీ మధ్య అసెంబ్లీలో ఎలాంటి చర్చ జరుగుతుందోననే ఆసక్తి నెలకొంది.

Exit mobile version