Site icon Swatantra Tv

పుంగనూరులో గెలుపెవరిది ?

     ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకూ హాట్‌హట్‌గా సాగుతున్నాయి. ప్రత్యేకించి కొన్ని సీట్లలో గెలుపోటములు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. అలాంటి వాటిలో పుంగనూరు నియోజక వర్గం ఒకటి. వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా మారిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడ్నుంచి ప్రాతినిథ్యం వహిస్తుండడమే ఇందుకు కారణం. మరి.. ఇలాంటి చోట ప్రత్యర్థుల ఆటలు సాగుతాయా ?

సార్వత్రిక ఎన్నికలకు అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు దాదాపుగా అభ్యర్థులను ఖరారు చేశాయి. దీంతో.. ఒక్కో సీటును కైవసం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి అన్ని పార్టీలు. వైసీపీ నుంచి సీనియర్‌ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి పోటీలో ఉన్నారు. టీడీపీ తరఫున చల్లా రామచంద్రారెడ్డి బరిలో దిగగా.. కొత్తగా ఏర్పాటైన బీసీవై పార్టీ అభ్యర్థిగా.. ఏకంగా ఆ పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నిజానికి పుంగనూరు నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేది. మాజీ ఎంపీ దివంగత నేత నూతన కాల్వ రామకృష్ణారెడ్డి ఓటమి ఎరుగని నాయకుడిగా పుంగనూరు నుంచి పలుసార్లు ఎమ్మెల్యేగా, ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎంపీగా తెలుగుదేశం జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన కుమారుడు మాజీ మంత్రి నూతన కాల్వ అమరనాథరెడ్డి పుంగనూరు నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దారు. నియోజకవర్గాల పునర్విభజన తరువాత అమరనాథ రెడ్డి పలమనేరు నియోజకవర్గం వెళ్లారు. సదుం, పులిచెర్ల, రొంపిచర్ల మండలాలు పుంగనూరులో కలవడంతో ప్రస్తుత రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీలేరు నియోజకవర్గం వదిలి పుంగనూరు నుంచి బరిలో దిగారు.

2009 నుంచి పుంగనూరును కంచుకోటగా మార్చుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 2009లో కాంగ్రెస్ తరఫున గెలిచిన ఆయన.. 2014, 2019లో వైసీపీ తరఫున విజయం సాధించారు. జగన్ మంత్రివర్గంలో కీలకంగా మారారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ రాజకీయలను కనుసైగలతో శాసిస్తున్నరు పెద్దిరెడ్డి. మరోసారి తిరుగులేని విజయాన్ని 2024లో సాధించేందుకు సిద్ధమయ్యారన్న వాదన ఆయన వర్గీయులు విన్పిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కేవలం ఇక్కడ ప్రేక్షక పాత్రకే పరిమితమైందన్న అభిప్రయం విన్పిస్తోంది. 2009, 2014, 2019.. ఇలా ఎన్నిక ఎప్పుడైన ఓటమి పాలవ డం సర్వసాధారణంగా మారిందన్న అభిప్రాయం విన్పిస్తోంది. అయితే.. పెద్దిరెడ్డి కుటుంబంపై అవినీతి ఆరోపణలు, ఒంటెత్తు పోకడలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ముందుకెళుతోంది టీడీపీ. స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం తమ కార్యకర్తలపై కేసులు, తన రోడ్‌షోలో జరిగిన ఘటన లను ప్రజల్లోకి తీసుకెళ్లారు. టీడీపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మరోవైపు..భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్.. పుంగనూరు నియోజకవర్గంపై తనదైన ముద్ర వేయాలని పావులు కదుపుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికలో జనసేన తరఫున బరిలో దిగిన ఈయన 16 వేలకుపైగా ఓట్లు సాధించారు. రాజకీయ అనుభవం పెద్దగా లేకున్నా అంతు చిక్కని వ్యూహాలతో ప్రత్యర్థి నాయకులకు సవాళ్లు విసురుతుంటారన్న పేరు తెచ్చుకున్నారు రామచంద్రయాదవ్. ఈయనకు ఢిల్లీ స్థాయిలో జాతీయ నేతలతో, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మంచి సంబంధాలు ఉండడం, యాదవ సామాజిక వర్గం అండదండలు ప్లస్ పాయింట్‌గా చెబుతు న్నారు. మరి.. అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన 2024 ఎన్నికల్లో మరోసారి పెద్దిరెడ్డి విజేతగా నిలుస్తారా… లేదంటే టీడీపీ లేదా బీసీవై అభ్యర్థుల్లో ఒకరిని విజయం వరిస్తుందా తెలియా లంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.

Exit mobile version