Site icon Swatantra Tv

కాకతీయ గడ్డపై గెలుపు గుర్రం ఎవరు?

కడియం కావ్య ఊహించని ట్విస్ట్‌ ఇవ్వడంతో వరంగల్‌ ఎంపీ అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది బీఆర్‌ఎస్‌. కడియం చిర కాల రాజకీయ శత్రువైన రాజయ్యను దించేందుకు పావులు కదుపుతూనే.. మరికొందరి పేర్లను పరిశీలిస్తోంది. మరి పార్టీ ఫిరాయింపుతో ఖాళీ అయిన స్థానాన్ని ఎవరు భర్తీ చేయనున్నారు..? హైకమాండ్‌ ఎవరిని ఓకే చేయనుంది..?

పార్లమెంట్‌ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. మీ పార్టీ వద్దూ మీ టికెట్‌ వద్దూ అంటూ వలసబాట పడుతున్నారు గులాబీ నేతలు. మొన్నటికి మొన్న సిట్టింగ్‌ ఎంపీలైన రంజిత్‌రెడ్డి, బీబీపాటిల్‌ పార్టీ ఫిరాయించి కేసీఆర్‌కు పెద్ద షాక్‌ ఇవ్వగా.. ఎంపీ అభ్యర్థిగా టికెట్‌ ఇచ్చినా బీఆర్‌ఎస్‌కు హ్యాండిచ్చి హస్తంతో చేయి కలిపింది కడియం కావ్య. దీంతో వరంగల్‌ స్థానం ఖాళీ అవడంతో అభ్యర్థి కోసం వేట మొదలుపెట్టింది గులాబీ హైకమాండ్.

     అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌.. లోక్‌సభ ఎన్నికల్లో అయినా తమ సత్తాచాటాలన్న వ్యూహంలో ఉంది. ఈ నేపథ్యంలోనే కడియం కావ్య పార్టీ మార్చడంతో.. ఆ స్థానంలో బలమైన అభ్యర్థిని దించే దిశగా కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే క‌డియం శ్రీహ‌రికి చిర‌కాల రాజ‌కీయ శ‌త్రువుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను బరిలో దించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం రాజయ్యతో బీఆర్‌ఎస్‌ వర్గా లు సంప్రదిం పులు జరుపుతున్నట్టు సమాచారం. జ‌న‌గామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఇప్పటికే రాజ‌య్యతో మాట్లా డిన‌ట్లుగా తెలుస్తోంది. రాజ‌య్య ఇంటికి వెళ్లి ఆయ‌న‌తో చ‌ర్చిం చాల‌ని కేసీఆర్ సూచ‌న‌లు చేసిన‌ట్లు రాజ‌య్య స‌న్నిహితులు చెబుతున్నారు. అయితే తన అనుచరులతో భేటీ అయిన తర్వాత తిరిగి పార్టీలోకి రావడంపై స్పష్టత ఇస్తానని రాజయ్య చెప్పినట్టు సమాచారం.ఓ వైపు రాజయ్య ను తిరిగి పార్టీలోకి తీసుకొని ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపడంపై కసరత్తు చేస్తూనే, మరోవైపు ఇతర ప్రత్యామ్నాయాలను కేసీఆర్‌ అన్వేషిస్తున్నట్టు సమాచారం. మరోవైపు హనుమ కొండ జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి భార్య, జెడ్పీటీసీ సభ్యురాలు పెద్ది స్వప్న తదితరుల పేర్లు కూడా తెర మీదకు వస్తున్నాయి. మరోవైపు మొన్నటి వరకు వరంగల్ పార్లమెంట్ టికెట్ కోసం ప్రయత్నించిన ఉద్యమ కారులు కడియం కావ్యను అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి అసంతృప్తితోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కావ్య తప్పుకోవడంతో ఉద్యమకారులు మళ్లీ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఉద్యమకారులు కేయూ జేఏసీ నేతలు జోరిక రమేశ్, బోడన్నా ఇద్దరూ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్ని స్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసేందుకు హైదరాబాద్ వెళ్లే యోచనలో ఉన్నారు.

      ఈ పరిణామాల మధ్య మొన్నటి వరకు బీజేపీలో కొనసాగి, ఆ తరువాత వరంగల్ ఎంపీ టికెట్ కోసం ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబు మోహన్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.ఇప్పటికే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బాబు మోహన్ ను ప్రకటించగా.. ఇప్పుడు ఆయన ప్రజాశాంతి పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. గతం లోనే వరంగల్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ తరఫున పోటీ చేసేందుకు బాబు మోహన్ ప్రయత్నాలు చేశారు. కానీ ఆ అవకాశం దక్కకపోవడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ అధినేతల టచ్ లోకి వెళ్లినా ఫలితం దక్కలేదు. చివరికి ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. అయితే,కడియం కావ్య ఇచ్చిన ఊహించని షాక్ తో బాబు మోహన్ కు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయననే అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జోరందుకుంది.

Exit mobile version