Site icon Swatantra Tv

ఏపీ సీఎం జగన్ పై దాడి ఘటనకు సంబంధించి ఎవరు చెప్పేది నిజం? 

ఏపీ సీఎం జగన్‌పై జరిగిన రాళ్ల దాడితో.. రాష్ట్ర రాజకీయాలు మరింత హీటెక్కాయి. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాళ్ల దాడి పిరికిపందల చర్య అని వైసీపీ అంటుంటే.. ఓటమి భయంతోనే మరో కోడికత్తి డ్రామాకు తెరలేపారంటూ విమర్శిస్తోంది టీడీపీ. మరోవైపు.. ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసనలు చేపట్టింది.

ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న వేళ సీఎం జగన్‌పై జరిగిన రాళ్ల దాడి.. ఏపీ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఒక్కసారిగా అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ముఖ్యమంత్రిపై జరిగిన దాడి పిరికిపందల చర్యగా అభివర్ణించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఎయిర్‌గన్‌ లాంటి దానితో ఇది చేసినట్లుగా అనుమానం ఉందంటూ చెప్పుకొచ్చిన ఆయన.. కాస్త ఉంటే కన్నుపోయేదని ఆందోళన వ్యక్తం చేశారు.

రాజకీయంగా జగన్‌ను ఎదుర్కొనలేకే ఆయనపై దాడి చేశారన్నారు మాజీ మంత్రి కొడాలినాని. చంద్రబాబు ప్రేరణతోనే గతంలోనూ, ఇప్పుడూ దాడులు జరిగాయని ఆరోపించారు. వైసీపీకి భారీ మెజార్టీ రావడం ఖాయమని సర్వేల్లో చెప్పడం వల్లే చంద్రబాబు ఇలా చేయించారంటూ ఫైరయ్యారు కొడాలి నాని.

ఎన్నికల్లో సానుభూతి కోసమే కొత్త డ్రామాకు సీఎం జగన్ తెరలేపారన్నారు ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించిన ఆయన.. తక్షణమే ఈ కేసును ఎలక్షన్ కమిషన్.. సీబీఐకి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

రాళ్ల దాడి.. కుట్రలో భాగమేనని అన్నారు టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్. సీఎం కాన్వాయ్‌లో ఉండే అంబులెన్స్ ఏమైందని ప్రశ్నించారాయన. అంతేకాదు.. దాడి జరిగిన పది నిమిషా ల్లోనే పోస్టర్లు పట్టుకొని ధర్నా చేశారని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉండి ఇలాంటి డ్రామాలు అవసరమా అని ప్రశ్నించారు పట్టాభి.

ఇక, సీఎం జగన్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు, శ్రేణులు నిరసనలు చేపట్టారు. ధర్నాలకు దిగారు. జగన్‌పై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఈ ఘటనకు పాల్పడ్డారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌ తమ ప్రసంగాల ద్వారా యువతను రెచ్చగొడుతున్నారని ఈ సందర్భంగా ఆరోపించారు వైసీపీ నేత రోజా.

మరోవైపు.. సీఎం జగన్‌పై జరిగిన దాడిని తీవ్రంగా పరిగణిస్తోంది వైసీపీ. ఇందులో భాగంగానే ఈ అంశంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. సజ్జల సహా పలువురు వైసీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారితో సమావేశమై జరిగిన ఘటనను వివరించారు. ఉద్దేశపూర్వకంగానే ఈ దాడి జరిగిందని.. దీని వెనుక రాజకీయ ప్రేరేపిత కుట్ర ఉందని వివరించారు. మొత్తంగా చూస్తే.. ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న వేళ జరిగిన ఈ ఘటన రాష్ట్ర రాజకీయాలను తీవ్ర ప్రభావితం చేసిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

Exit mobile version