Site icon Swatantra Tv

లోక్ సభ మెదక్ పీఠం ఎవరికి ?

  త్రిముఖ పోరుతో సంగారెడ్డి జిల్లాలో ఎలక్షన్‌ హీట్‌ కాకరేపుతోంది. ప్రధాన పార్టీలైన బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు నువ్వా నేనా అన్నట్టు పోటీని ప్రదర్శిస్తున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో ప్రచారహోరులో దూసుకుపోతున్నాయి. ఎవరికి వారే గెలుపు ధీమాతో ఉన్నారు. మరి ఎవరి ఆశలు ఫలిస్తాయి..? ప్రజలు ఎవరికి పట్టం కడ్డారు..? మెదక్‌ పార్లమెంట్‌ ఇలాఖాలో మీసం మెలేసే నాయకుడెవరు..?

  ఎన్నికలకు సమయం ఆసన్నంకావడంతో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి రాజకీయ పార్టీలు. 10 ఏళ్ల పూర్వవైభవాన్ని చాటుతూ అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ మంచి జోష్‌లో ఉంది. ఆ ఉత్సాహంతోనే ఈ ఎన్నికల్లోనూ తమదే హవా అన్న ధీమాతో.. విజయఢంకా మోగించాలనే ధడనిశ్చ యంతో ఉంది. మరోవైపు సిట్టింగ్‌ సీటును ఎలాగైనా పదిలంగా కాపాడుకోవాలని తపనపడుతోంది గులాబీ దళం. అధికారాన్ని కోల్పోయి ఢీలా పడ్డ బీఆర్‌ఎస్‌ ఈ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్‌పై పైచేయి సాధించాలన్న కసిలో ఉంది. ఇక మోదీ చరిస్మాతో తిరిగి కేంద్రంలోకి అధికారంలోకి వచ్చేది మేమే అన్న నమ్మకంతో ఉన్న కమలనాథులు సైతం విజయకేతనం ఎగురవేస్తామన్న ఆశలు పెట్టుకుంది.

  ఇక ప్రచార రంగంలోనూ అదే దూకుడుతో వ్యవహరిస్తున్నాయి పార్టీలు. లోక్‌సభ పోరుకు క్యాడర్‌ను సిద్ధం చేస్తూ పావులు కదుపుతున్నాయి. తన కంచుకోట బద్దలవకుండా కాపాడుకునేందుకు బీఆర్‌ఎస్‌ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్‌, బీజేపీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూ పంచ్‌ డైలాగులతో జనాన్ని ఆకర్షించే పనిలోపడ్డారు మాజీ మంత్రి హరీష్‌రావు. ఇందులో భాగంగానే ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నియోజవకవర్గాల వారీగా కార్యకర్తలు, యువజన, విద్యార్థి సంఘాల వారితో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక ప్రచార రంగంలో దిగిన బీఆర్‌ఎస్‌ అధినేత, గులాబీ బాస్‌ మెదక్‌ జిల్లా క్యాడర్‌లో జోష్‌ నింపేందుకు ఈ నెల 15, 16వ తేదీల్లో భారీ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. అయితే,.. బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోవడంతో గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటోంది. కారు ఖాళీ అవుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలో పలువురు నేతలు గులాబీకి గుడ్‌బై చెప్పడంతో కలవరపడుతోంది బీఆర్‌ఎస్‌. ఇదిలా ఉంటే… బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకటరామిరెడ్డి తాను కలెక్టర్‌గా ఉన్న సమయంలో కఠినంగా వ్యవహరించిన తీరును చూసి ప్రజలు ఓటేస్తారా అన్న సందేహంలో ఉన్నారు. దీంతోనే 100 కోట్లతో ట్రస్ట్‌ ఏర్పాటు,.. ప్రతీ నియోజకవర్గలో ఒక రూపాయికే ఫంక్షన్‌ హాల్‌ వంటి ఎన్నికల హామీలను కురిపిస్తున్నారన్న టాక్‌ వినిపిస్తోంది.

 బిఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి కలెక్టర్గా పని చేసిన సమయంలో కఠినంగా వ్యవహరించి జిల్లాలో నిర్మించిన రిజర్వాయర్ల ముంపు గ్రామాల ప్రజలతో వివరించిన తీరును చూసి ప్రజలు ఓటేస్తారా లేదా అతను ఇస్తున్న హామీలలో 100 కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు ప్రతి నియోజకవర్గంలో ఒక రూపాయికే పెద్దలకు పేదలకు ఫంక్షన్ హాల్ లాంటి హామీలను విశ్వసించి బిఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో చేసిన అభివృద్ధిని చూసి ఓటేస్తారా అనేది ప్రజల చేతుల్లో ఉన్నదని చెప్పవచ్చు మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తలేరని మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు

  అయోధ్య రామ మందిర నిర్మాణంతో మంచి ఊపు మీద ఉంది బీజేపీ. హిందూ సెంటిమెంట్‌తో ప్రచారాన్ని ముమ్మరం చేశారు బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు. ఎంపీ అభ్యర్థిగా ప్రకటించనప్పటి నాటి నుంచి మెదక్‌ పార్లమెంటరీ పరిధిలో మార్నింగ్‌ వాక్‌ చేస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. దేశ ప్రగతి మోడీతో సాధ్యమని.. 10 ఏళ్లలో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అనేక అభివృద్ధి పనులు చేశామని. రామాలయా నిర్మాణం నినాదంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు రఘునందన్‌రావు. ప్రత్యర్థులపై విమర్శ నాస్త్రాలు ఎక్కుపెడుతూ వారి వైఫల్యాలే టార్గెట్‌గా నిప్పులు చెరుగుతు న్నారు రఘునందన్‌రావు.

ప్రచారం పర్వంలో కాంగ్రెస్‌ వెనుకపడిందనే చెప్పాలి. మెదక్‌ పార్లమెంటరీ పరిధిలో ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉండటంతోపాటు అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడంతో ప్రచారాన్ని ఆలస్యంగా మొదలుపెట్టింది హస్తం పార్టీ. జిల్లా మంత్రులు దామోదర నర్సింహ, పొన్నం ప్రభాకర్‌, ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ, జగ్గారెడ్డి తమ అభ్యర్థి తరపున ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నియోజకవర్గాల వారిగా కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేస్తూ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. మైనంపల్లి హనుమంతరావు ప్రచార బాధ్యతలను తమ భుజాలపై వేసుకుని అంతా తానే ముందుండి నడిపిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారెంటీ స్కీంలతోపాటు, బీఆర్‌ఎస్‌, మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ గెలుపు దిశగా సాగుతు న్నారు. మరి ఎవరికి వారు గెలుపు వ్యూహంతో పావులు కదుపుతున్న లోక్‌సభ పోరులో మెదక్‌ పార్లమెంట్‌ ప్రజలు ఎవరిపక్షాన ఉంటారు..? ఎవరి మాటలను విశ్వసిస్తారు..? ఎవరికి పట్టంకడతారు అన్నది తెలియా లంటే ఇంకొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Exit mobile version