Site icon Swatantra Tv

ఆ నాలుగు స్థానాలకు అభ్యర్థులు ఎవరు?

    అనంతపురం జిల్లా టీడీపీ కూటమికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఆ నాలుగు స్థానాలకు అభ్యర్థులు ఎవరో ఇంకా తేలలేదు. దీంతో నరాలు తెగే ఉత్కంఠతో ఆశావహులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకూ మొదటి జాబితాలో 9 మందిని, రెండవ జాబితాలో ఇద్దరిని టీడీపీ నాయకత్వం ప్రకటించింది. మూడవ జాబితాలో ఒక్క హిందూపురం ఎంపీ స్థానానికి మాత్రమే అభ్యర్థిని ప్రకటించింది. దీంతో ఇంకా మూడు శాసనసభ స్థానాలకు, ఒక ఎంపీ స్థానానికి అభ్యర్థు లను ప్రకటించాల్సి ఉంది. అధికార వైసీపీ మాత్రం ఏకబిగిన మొత్తం 14 శాసనసభ స్థానాలకూ, రెండు ఎంపీ స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించి చేతులు దులుపుకుంది. ఇప్పుడు పెండింగ్‌లో ఉన్న స్థానాలకు టీడీపీ కూటమి ప్రకటించే అభ్యర్థులు ఎవరా? అన్నది సస్పెన్స్..

    టీడీపీ- జనసేన- బీజేపీ పొత్తులో భాగంగా ధర్మవరం స్థానాన్ని బీజేపీకి కేటాయించినట్టు ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ఆ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ పోటీ చేస్తారు. అయితే, టీడీపీ తరపున నియో జకవర్గ ఇన్‌చార్జి పరిటాల శ్రీ రామ్ టికెట్ ఆశిస్తున్నారు. బీజేపీకి ధర్మవరం సీటు కేటాయించినట్టు వార్తలు రావడంతో శ్రీరామ్ వర్గీయులు పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించడం చర్చనీయాంశమైంది. పార్టీ అధినేత నిర్ణయాన్ని ప్రశ్నిం చేలా రోడ్లెక్కడం ఏమిటని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. పార్టీ నిర్ణయంపైనే నిరసనలకు దిగడం… పార్టీ ప్రతిష్టను దిగజార్చడమేనని, క్రమశిక్షణను ఉల్లంఘించడమేనని వారంటున్నారు. నిర్ణయాల విషయంలో నాన్పుడు ధోరణి వల్ల సమస్య జటిల మవుతుందనే వాస్తవాన్ని కూటమి నాయకత్వం గుర్తించాలి.

   అనంతపురం జిల్లాలో కూటమిలో పార్టీలకు స్థానాలు కేటాయించే విషయంలోనూ, అభ్యర్థుల ఎంపికలోనూ టీడీపీ నాయకత్వపు ఊగిసలాట ధోరణి పార్టీ కార్యకర్తలను గందరగోళంలో పడేస్తోంది. మొదట మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి పేరుతో ఐవీఆర్‌ఎస్ సర్వే నిర్వహించారు. తరువాత ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించినట్టు వార్తలు వచ్చాయి. బలమైన అభ్యర్థులు ఆ పార్టీలో లేనందున టీడీపీ నుంచి జనసేనలో చేరి టికెట్ తెచ్చుకునేందుకు కొంత మంది ప్రయత్నాలు చేశారు. అయితే, మళ్లీ టీడీపీకే ఈ స్థానమంటూ వార్తలు వచ్చాయి. ఈసారి ప్రభాకర్ చౌదరి, దగ్గుబాటి ప్రసాద్ పేరుతో ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించారు. సర్వేలు పూర్తయ్యేయి తప్ప అభ్యర్థుల ప్రకటన పూర్తి కాలేదు. అయితే, ఈలోగా మళ్లీ జనసేనకే ఈ స్థానం కేటాయిస్తున్నారనే చర్చ జరుగుతోంది.

   గుంతకల్లు టికెట్ గుమ్మనూరు జయరామ్‌కు ఖరారయినట్టు మొదట వార్తలు వెలువడ్డాయి. దీనికి పార్టీ శ్రేణులు నుంచి నిరసన వ్యక్తమైంది. టీడీపీ ఇన్ చార్జి, మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు. అయితే, ఈసారి కొత్తవారికి అవకాశమిస్తారని వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో అనూహ్యంగా గుమ్మనూరు జయరామ్ టీడీపీలో చేరారు. గుంతకల్లు టికెట్ హామీతోనే ఆయన పార్టీలో చేరినట్టు ప్రచారం జరుగుతోంది. స్థానికంగా ఆయనకు వ్యతిరే కత వ్యక్తమవుతున్న క్రమంలో గుంతకల్లు టికెట్ ఎవరికి లభిస్తుందో చూడాలి.

    మూడవ జాబితాలో బీకే పార్థసారధికి హిందూపురం ఎంపీ స్థానాన్ని టీడీపీ కేటాయించింది. అయితే, అనంతపురం ఎంపీ స్థానం అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. ఈ సీటు విషయంలోనూ ఆ పార్టీ తర్జనభర్జనలు సాగుతున్నాయి. పలువురి పేర్లతో ఐవీఆర్ఎస్ సర్వేలు నిర్వహించడమే ఇందుకు నిదర్శనం. ఇటీవల కమ్మూరు నాగరాజు, డాక్టర్ బీవీ పార్థసారధి, అంబికా లక్ష్మీనారాయణ, పూల నాగరాజు, దలవాయి వెంకటనారాయణ, ప్రొఫెసర్ రాజేష్ పేర్లతో పలుమా ర్లు ఐవీ ఆర్ఎస్ సర్వేలు నిర్వహించింది. కొద్ది రోజుల క్రితం జేసీ పవన్ రెడ్డి పేరు కూడా తెర పైకి వచ్చింది. ఈ క్రమంలో అనంతపురం ఎంపీ స్థానానికి ఎవరిని ఎంపిక చేస్తారనే ఆసక్తి నెలకొని ఉంది. ఆలస్యం కారణంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం సన్నగిల్లుతోంది.

Exit mobile version