Site icon Swatantra Tv

కాంగ్రెస్ రాజకీయ భవిష్యత్తు ఏమిటి ?

  రాజకీయాల్లో రాణించాలనుకునేవారికి ప్రజా బలమే పునాది. ప్రజా బలమే పునాదిగా ఉన్న నాయకులే చరిత్రలో మాస్ లీడర్లుగా నిలిచారు. ఇన్నాళ్లూ అంతపుర రాజకీయాలకే పరిమితమైన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రస్తుతం మాస్ లీడర్‌గా ఎదిగే పనిలో బిజీగా ఉన్నారు. దేశంలోని ఏ ప్రాంతా నికి వెళ్లినా అక్కడి సామాన్య ప్రజలతో మమేకమవుతున్నారు. వాళ్లతో మనసువిప్పి మాట్లాడుతు న్నారు. సామాన్య జనం మాటలను శ్రద్ధగా వింటున్నారు. కిందటేడాది సెప్టెంబరు నెలలో రాహుల్ కార్పెంటర్‌ అవతారం ఎత్తారు. ఢిల్లీలోని అతిపెద్ద ఫర్నిచర్ మార్కెట్‌ అయిన కృతినగర్‌లో రాహుల్ పర్యటించారు. అక్కడ వడ్రంగం పనిచేసేవారితో మాట కలిపారు. వృత్తిపరంగా వాళ్లు ఎదుర్కొంటున్న సాధకబాధకాలను తెలుసుకున్నారు. రాహుల్ అక్కడితో ఆగలేదు. పనిలోపనిగా వడ్రంగం తయారీలో తానూ ఓ చెయ్యి వేశారు.

    అంతకుముందు రైల్వే కూలీ అవతారం ఎత్తారు రాహుల్ గాంధీ.ఢిల్లీ నగరంలోని ఆనంద విహార్ రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. రైల్వే కూలీల మధ్య కూర్చుని వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత కాసేపు తాను కూడా ఓ రైల్వే కూలీగా మారిపోయారు. ఒంటిపై ఉన్న వైట్‌ కలర్ టీ షర్ట్‌పైన పోర్టర్లు ధరించే రెడ్ కలర్ చొక్కా వేసుకున్నారు. చేతికి పోర్టర్ లైసెన్స్ బిళ్లను కట్టుకున్నారు. రాహల్‌, రైల్వే కూలీ గెటప్‌ వేసుకోవడంతో ఆయన చుట్టూ ఉన్నవారి ఆనందానికి అంతే లేకుండా పోయింది. ఆనందాన్ని తట్టుకోలేక చప్పట్లు కొట్టారు. పోర్టర్ డ్రస్సు వేసుకోవడంతోనే రాహుల్ గాంధీ ఊరుకోలేదు. చొక్కా చేతులను మోచేతులదాకా మడిచి, ప్రయాణీకుల లగేజీని తలమీదకు ఎత్తుకున్నారు. ఇదే గెటప్‌ల రైల్వే కూలీలు బస చేసే గదుల దగ్గరకు వెళ్లారు. గదుల్లోని అధ్వాన్న పరిస్థితులను రాహుల్ గాంధీకి వివరించారు రైల్వే కూలీలు. ఈ సందర్భంగా రాహుల్‌తో సెల్ఫీ దిగడానికి రైల్వే పోర్టర్లు పోటీ పడ్డారు. అంతకు ముందు ఢిల్లీలోని ఆజాద్‌పూర్‌ మండీకి వెళ్లారు రాహుల్. మండీలోని చిరు వ్యాపారులతో రాహుల్ గాంధీ మాట్లాడారు.రెండేళ్ల కిందట జులై నెలలో రాహుల్ గాంధీ హర్యానాలో పర్యటించారు. సోనిపట్‌ లోని వ్యవసాయ భూములున్న ప్రాంతానికి వెళ్లారు. అకస్మాత్తుగా ప్యాంట్ పైకి లాక్కుని పక్కనే ఉన్న పొలంలోకి దిగారు. అక్కడి రైతులతో మాట్లాడారు. వారి కష్టసుఖాలు కనుక్కున్నారు. అంతేకాదు ట్రాక్టర్ ఎక్కి దుక్కి దున్నారు. రైతులతో కలిసి నాట్లేశారు. అలాగే కిందటేడాది ఢిల్లీ -చండీగఢ్ హైవేపై ట్రక్కు నడిపి సోనియా తనయుడు హల్‌చల్‌ చేశారు. ట్రక్కు డ్రైవర్ల సమస్యలు స్వయంగా తెలుసుకున్నారు.

    సామాన్య జనంతో మమేకం కావడానికి రాహుల్ గాంధీ చేస్తున్న ప్రయత్నాల్లో చిత్తశుద్ధి కనిపిస్తోంది. సామాన్యుల్లో సామాన్యుడిలా కలిసిపోవడమే తన లక్ష్యం అంటున్నారు రాహుల్ గాంధీ. అయితే ప్రజలతో మమేకం కావడానికి రాహుల్ ఎన్ని ప్రయత్నాలు చేసినా, లోక్‌సభ ఎన్నికల్లో వాటి ప్రభావం ఏ మేరకు ఉంటుందన్న ప్రశ్న తెరమీదకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి కేంద్రంలో అధికారానికి దూరంగా ఉంది. వరుసగా రెండు దఫాలు విజయదుందుభి మోగించిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తీవ్ర గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఇండియా కూటమి పేరుతో బీజేపీయేతర ప్రతిపక్షాలన్నిటనీ ఒక వేదిక తీసుకువచ్చినా, ఆ ప్రయోగం విజయవంతమవుతుందన్న ధీమా ఎవరిలోనూ కనిపించడం లేదు. హస్తం పార్టీతో ఇండియా కూటమిలోని అనేక భాగస్వామ్య పక్షాలకు విభేదాలు వచ్చాయి. అయితే లోక్‌సభ ఎన్నికలు తరుముకు వస్తుండడంలో మళ్లీ భాగస్వామ్యపక్షాలు సర్దుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ చివరకు అంగీకరించింది. అయితే పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌ తో కలిసి పోటీ చేసే ప్రసక్తే లేదని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ కుండబద్దలు కొట్టారు.

    వాస్తవానికి కాంగ్రెస్ విఫలమైన అనేక రాష్ట్రాల్లో అక్కడి రాజకీయ శూన్యతను పూరించడానికి ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. పంజాబ్‌లో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎదిగింది. కిందటి సారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఆమ్ ఆద్మీ పార్టీకి జై కొట్టారు పంజాబ్‌ ప్రజలు. అలాగే ఢిల్లీలో బీజేపీని ఎదుర్కోలేక కాంగ్రెస్ వెనుక బడితే అక్కడ కూడా ప్రత్యామ్నాయంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎదిగింది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలాంటి హస్తినలో ప్రస్తుతం ఆప్ సర్కార్ కొలువు దీరింది. పశ్చిమ బెంగాల్లోనూ ఇదే జరిగింది. కాంగ్రెస్ ప్రభావం తగ్గుముఖం పడుతుండడంతో మమతా బెనర్జీ ప్రాంతీయ భావాలకు అనుగుణంగా తృణమూల్ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీ పెట్టారు. వరుసగా మూడుసార్లు పశ్చిమ బెంగాల్లో అధికారానికి వచ్చారు. బెంగాల్లో కాంగ్రెస్ కు చోటు లేకుండా చేశారు. ఇలా దేశంలో కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్న ప్రాంతాల్లో ప్రాంతీయ పార్టీలు పురుడు పోసుకున్నాయి. అంతేకాదు కాలక్రమంలో ఈ ప్రాంతీయ పార్టీలే బలంగా ఎదిగాయి.

   స్వాతంత్ర్యం తరువాత చాలా కాలం పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ కేవలం మూడే మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ సర్కార్లున్నాయి. జాతీయ రాజకీయాల్లో ఎన్డీయే కూటమికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ నాయకత్వంలో యూపీఏ కూటమి ఉంది. ఇప్పటివరకు యూపీఏ కూటమికి కాంగ్రెస్ పార్టీయే నాయకత్వం వహిస్తోంది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటే…యూపీఏ నాయకత్వం కూడా కాంగ్రెస్ చేజారు తుందని జోస్యం చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.

Exit mobile version