Site icon Swatantra Tv

యుద్ధాల వల్ల భారత్‌ చమురుపై ప్రభావమెంత?

ఒకపక్క రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ఏడాదిగా కొనసాగుతోంది. పశ్చిమాసియాలో పాలస్తీనా – ఇజ్రాయెల్ యుద్ధం మొదలై నెల రోజులు దాటింది. ఈ యుద్ధాల ప్రభావం ప్రపంచ దేశాలపైనా, మన దేశం పైనా కూడా పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా భారత చమురు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందు జాగ్రత్తలు చేపడుతోంది.

ప్రపంచంలో అమెరికా, చైనా తర్వాత అత్యధికంగా చమురు వినియోగించేది భారతదేశమే. మనదేశం వినియోగించుకునే చమురులో 85 శాతం దిగుమతుల రూపంలోనే అందుతోంది. దీనిలో 60 శాతం చమురు దిగుమతులు పూర్తిగా పశ్చిమాసియాలోని గల్ఫ్ దేశాల నుంచే సరఫరా అవుతున్నాయి. దేశంలోని 70 శాతం ప్రభుత్వ రంగ రిఫైనరీలు కాంట్రాక్టు ద్వారా చమురును దిగుమతి చేసుకుంటాయి. మిగతా సంస్థలు ఎప్పటి కప్పుడు చమురు కొనుగోలు చేస్తాయి.

ప్రస్తుతం ఉక్రెయిన్ – రష్యా యుద్ధం మాదిరిగానే.. గాజాలో పాలస్తీనా – ఇజ్రాయెల్ యుద్ధం నెలల తరబడి కొనసాగితే.. చమురు దిగుమతి ఒప్పందాలకు చిక్కులు తప్పవు. భారతదేశం చమురు దిగుమతులకు ప్రత్యామ్నాయ దేశాలను చూసుకోక తప్పదు. ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా అమెరికా, పలు యురోపియన్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో మనదేశం రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకుంటోంది.

అనూహ్యంగా అంతర్జాతీయంగా సంక్షోభం తలెత్తినా తట్టుకుని నిలబడేందుకు చాలా దేశాలు వ్యూహాత్మక చమురు రిజర్వులు ఉంచుకుంటాయి. అత్యధికంగా చమురు వినియోగించే మనదేశంలో పెట్రోలియం రిజర్వులు 9-10 రోజులకు సరిపడా మాత్రమే ఉంటాయి. ప్రైవేట్ కంపెనీలు 60-65 రోజులకు సరిపడేంత రిజర్వు చేసుకుంటాయి. ఇక అమెరికాలో కనీసం 60 రోజులకు సరిపడేంత అంటే 727 మిలియన్ బారెల్స్ మేరకు రిజర్వు చేసుకుంటుంది. అదే చైనా 475 మిలియన్ బ్యారెల్స్, జపాన్ 324 బ్యారెల్స్ రిజర్వులో ఉంచుకుంటాయి.

నిరంతరం చమురు సరఫరా జరిగేటట్లు, ఎలాంటి ఆటంకాలు ఉండకుండా చూసే ఉద్దేశంతో జీ -20 దేశాల మధ్య ఓ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. భారతదేశంతో పాటు, అమెరికా, యూఏఈ, ప్రాన్స్, జర్మనీ, ఇటలీ ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ – గ్రీస్ ద్వారా భారత -పశ్చిమాసియా -యూరప్‌లను కలుపుతూ ఎకనమిక్ కారిడార్ ఏర్పాటే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం.

చమురు రంగంలో ఎదురవుతున్న సమస్యల దృష్ట్యా ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై ప్రపంచదేశాలన్నీ దృష్టి పెట్టాయి. మనదేశం కూడా సౌరవిద్యుత్, వాయు విద్యుత్‌పై దృష్టి పెట్టింది. గ్రీన్ హైడ్రోజన్, పొరుగు దేశాలతో విద్యుత్ వాణిజ్యంపై దృష్టి పెట్టి ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తోంది. గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ ఇంకా ప్రాథమిక దశలోనే ఉండగా, సీబీఈటీ ఇప్పటికే బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్‌లతో జరుగుతోంది. గల్ఫ్ లో యుద్ధం త్వరలోనే ముగుస్తుందని ఆశిస్తున్నా.. భారత ప్రభుత్వం మాత్రం చమురు రంగంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు ముందస్తు సన్నాహాలు చేస్తోంది.

Exit mobile version