Site icon Swatantra Tv

మోడీ సర్కార్ కు ఏది ప్లస్ ? ఏది మైనస్ ?

    వరుసగా రెండుసార్లు కేంద్రంలో ప్రభుత్వం నడపడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అది కూడా ప్రధానిగా ఉంటూ అన్ని పార్టీలనూ సమన్వయం చేసుకుంటూ ఏకతాటిపైకి తేవడం, కంటి చూపుతో శాశించడం అంటే ఇక చెప్పేదేముంది. కానీ, వీటన్నింటినీ తన పాలనతో చేసి చూపించారు ప్రధాని నరేంద్రమోడీ. అలాగని.. అన్నీ సజావుగా సాగాయా అంటే లేదనే చెప్పాలి. ప్రత్యేకించి రైతుల పోరాటం మోడీ సర్కారుకు గతంలో.. అలాగే ప్రస్తుతం కూడా ఓ పరీక్షేనని చెప్పాలి.

      బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు 2014లో అధికారాన్ని కైవసం చేసుకుంది. ప్రధానిగా నరేంద్రమోడీ బాధ్యతలు చేపట్టారు. పాలనలో తనదైన ముద్రవేశారు. ఇక, 2019 వచ్చేసరికి కమలం పార్టీపై పూర్తిస్థాయిలో పట్టుసాధించారు. అటు.. పాలనా పరంగానూ ఆయన హవాకు అడ్డు లేకుండా పోయింది. దేశవ్యాప్తంగా అప్పటివరకు అంతగా ప్రాధా న్యం లేని రాష్ట్రాల్లోనూ కమలం పార్టీ వికసించింది. అధికారాన్ని కైవసం చేసుకుంది.

   అంతర్జాతీయంగానూ పలు దేశాలతో దౌత్యపరంగా తిరుగులేని విజయాలు నమోదు చేసింది మోడీ సర్కారు. ఓవైపు రూపాయి విలువ గణనీయంగా పడిపోతోందని విపక్షాలు విమర్శిస్తున్నా… భారతదేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం ఎప్పటిక ప్పుడు కొత్త గరిష్టాలకు వెళ్లింది. స్టాక్ మార్కెట్లు పరుగులు తీశాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం సాగింది. ఈ క్రమంలో కొంత ఒడిదుడుకులు కన్పించినా.. నమో మంత్రం మాత్రం దేశవ్యాప్తంగా విన్పించింది.

  ప్రధానంగా ఆర్టికల్ 370 రద్దును మోడీ సర్కారు సాధించిన అతిపెద్ద విజయంగా కమలనాథులు చెబుతున్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ద్వారా జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి లభిస్తోంది. దీనిద్వారా ఆ రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక అధికారాలు, రాజ్యాంగం, జెండా అమల్లో ఉన్నాయి. అయితే.. ఇవన్నీ తాత్కాలిక ప్రాతిపదికనే లభిస్తా యన్న నిబంధన సైతం ఉంది. ఈ ఆర్టికల్‌ను రద్దు చేస్తామని మొదటి నుంచీ చెబుతున్న ఎన్డీఏ ప్రభుత్వం.. 2019 ఆగస్ట్‌ ఐదున దీనిపై ఓ ప్రకటన చేసింది. ఇందుకు అనుమతి తెలుపుతూ నాటి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ గెజిట్ విడుదల చేయడంతో ఆర్టికల్ 370 రద్దు అయింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, అల్లర్లు చెలరేగకుండా ఈ ప్రక్రియ మొత్తం సాఫీగా ముగించింది బీజేపీ ప్రభుత్వం. దీంతో.. రానున్న ఎన్నికల్లో 370 ఆర్టికల్ రద్దుకు గుర్తుగా తమ పార్టీకి దేశ ప్రజలు 370 సీట్లు ఇవ్వాలంటున్నారు బీజేపీ నేతలు. ఇక, అయోధ్యలో రామమందిర నిర్మాణం దేశంలోని ప్రతి ఒక్క హిందువు కల. అలాంటి కలను నిజం చేస్తూ మందిర నిర్మాణం మొదలు పెట్టడమే కాదు.. దాదాపుగా పూర్తి చేసి అయోధ్యలో ఆ పురాణ పురుషుడ్ని కొలువు తీరేలా చేసింది మోడీ నేతృత్వంలోని కేంద్రం. ఇది కూడా కమల నాథులకు అతి పెద్ద విజయమనే చెప్పాలి. దేశం మొత్తం ఓ పండగ లాగా.. అందర్నీ ఇందులో భాగస్వాములను చేస్తూ మోడీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నభూతో అనే రేంజ్‌లో నిర్వహించి ప్రశంసలు పొందింది.

       కేవలం ఈ హామీలనే కాకుండా అభివృద్ధిపైనా దృష్టి పెట్టిన మోడీ సర్కారు.. ఆ దిశగానూ ఎన్నో విజయాలు అందుకుంది. ప్రపంచంలోనే భారత్‌ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం, జీ-20 సదస్సును విజయవంతంగా నిర్వహించడం, చంద్రయాన్ 3.. ఇలా చెప్పుకుంటూ పోతే మరికొన్ని మోడీ సర్కారు సాధించిన విజయాలు ఉన్నాయి. అయితే.. అన్నీ ఘనతలేనా అపజయాలు, అపకీర్తులు ఏమీ లేవా అంటే అవీ ఉన్నాయి. పెరిగిపోతున్న ఆర్థిక ద్రవ్యోల్బణం ఆర్థిక వేత్తలను, మేధావులను కలవర పెడుతోంది. ఇక, రాజ్యాంగ సూత్రాలకు విరుద్దంగా తగినంత బలం లేకపోయినా .. ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను మోడీ-షా కలిసి కూలుస్తున్నారంటూ ఆరోపిస్తున్నాయి విపక్షాలు. ఇక, వీటన్నింటికీ మించి ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు చేస్తున్న పోరాటం కమలనాథులను కలవరపెడు తోందనే చెప్పాలి. పంటలకు గిట్టుబాటు ధర సహా పలు డిమాండ్లతో మళ్లీ ఆందోళనలకు దిగారు రైతులు. పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ సహా ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో తమ నిరసన కొనసాగిస్తున్నారు. ఎన్నికల వేళ ఇది కేంద్రంలోని మోడీ సర్కారుకు మైనస్సేనన్న అభిప్రాయం వ్యక్తమవపుతోంది.

Exit mobile version