Site icon Swatantra Tv

కేజ్రీవాల్ ఫోన్ ఏమైంది..?

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కుంభకోణం కేసులో ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఉపయోగించిన ఫోన్‌ కనిపించడంలేదని తెలుస్తోంది. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను దర్యాప్తు అధికారులు నాలుగు గంటలపాటు ప్రశ్నించారు. ఈ సందర్భంగా పాలసీ రూపొందించే సమయంలో ఏ ఫోన్‌ ఉపయోగించారని అధికారులు ప్రశ్నించగా.. తనకు గుర్తులేదని ఆయన సమాధానమిచ్చినట్లు సమాచారం. దీంతో అందులోనే కీలక ఆధారాలు ఉన్నట్లు ఈడీ భావిస్తోంది. దాన్నుంచి ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న సమీర్‌ మహేంద్రుతో ఆయన మాట్లాడినట్లు ఈడీ ఆరోపిస్తోంది. మరోవైపు, ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన మనీశ్‌ సిసోడియా వ్యక్తిగత కార్యదర్శి సి.అరవింద్‌తో కలిపి కేజ్రీవాల్‌ను రేపు విచారించనుంది.

లిక్కర్‌ పాలసీ కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌.. జైలు నుంచే పాలన ప్రారంభించారని ఆప్‌ ప్రకటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈడీ లాకప్‌లో ఉ‍న్న ఆయన తొలి ఆదేశాలు సైతం జారీ చేశారని నిన్నంతా ఆప్ నేతలు హడావిడి చేశారు. దేశ రాజధానిలో నీటి సరఫరాకు సంబంధించి ఉత్తర్వులను జారీ చేశారని చెప్పారు. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్లు ఏర్పాటు చేయాలని చెప్పారని అన్నారు. అయితే ఈడీ ప్రకటన మరోలా ఉంది. లాకప్‌లో ఉన్న అరవింద్‌ కేజ్రీవాల్‌ దగ్గర లాప్‌ట్యాప్‌ లేదని… కనీసం ఆయనకు పేపర్లను కూడా తమ సిబ్బంది అందించలేదని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తెలిపింది. అలాంటప్పుడు ఆయన అలాంటి ఆదేశాలేవీ జారీ చేసే అవకాశమే లేదని ఈడీ స్పష్టం చేసింది. ఆ ఆదేశాలపై దృష్టి సారించామని, అసలు ఆ ఆదేశాలు బయటకు ఎలా వెళ్లాయో పరిశీలించి కోర్టుకు నివేదిస్తామని ఈడీ వర్గాలు చెబుతున్నాయి.

కేజ్రీవాల్‌కు జైలు నుంచే పాలన సాగించేందుకు చట్టపరంగా ఏ విధమైన అడ్డంకులూ లేవు. కానీ, జైలు నిబంధనలు దీనికి అవరోధాలుగా నిలుస్తాయని న్యాయనిపుణులు చెబుతున్నారు. అయితే.. కేజ్రీవాల్‌ను గృహ నిర్బంధం చేస్తే ఆయనకు పాలన సులభతరం అవుతుందని, అయితే అలా చేసేందుకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్‌కుమార్‌ సక్సేనా అనుమతి తప్పనిసరిగా ఉండాలి. అయితే, గతంలో కేజ్రీ, సక్సేనాకు మధ్య అనేక వివాదాలు జరగడం వల్ల ఆయన అనుమతిపై సందిగ్ధం నెలకొంది. కాగా కేజ్రీవాల్‌ ఇంకా సీఎం పదవికి రాజీనామా చేయకపోవడాన్ని కేంద్ర హోంశాఖ పరిశీలిస్తోంది. ఆయనను తొలగించేందుకు న్యాయపరమైన మార్గాలు అన్వేషిస్తున్నట్లు సమాచారం. ఇంకోవైపు ఎల్జీ నిర్ణయంపై కూడా కేజ్రీవాల్‌ పదవిలో కొనసాగడం ఆధారపడి ఉంటుంది.

Exit mobile version