Site icon Swatantra Tv

తెలంగాణలో పోటెత్తిన ఓటర్లు

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. మొత్తం 64.93 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇవాళ తుది గణాంకాలు వెల్లడైతే ఈ పోలింగ్‌ శాతం మరింత పెరగనుంది. అక్కడక్కడా స్వల్ప సంఘటనలు మినహా లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ కొంత తక్కువగా నమోదైంది. అసెంబ్లీ ఎన్నికల్లో 71.34 శాతం ఓటింగ్‌ జరిగింది. ఓటర్లు చూపిన ఉత్సాహంతో 2019 లోక్‌సభ ఎన్నికలను మించి ఓట్లు పోలయ్యాయి.

సాధారణ ఎన్నికల నాలుగో విడతలో భాగంగా తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్‌ జరిగింది. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కూడా పూర్తయింది. కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. సమస్యత్మాక ప్రాంతాలుగా గుర్తించిన ఆదిలాబాద్‌, పెద్దపల్లి, మహబూబాబాద్‌, వరంగల్‌, ఖమ్మం నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలకు పోలింగ్‌ ముగిసింది. మిగిలిన 106 సెగ్మెంట్లలో 6 గంటల వరకు కొనసాగింది. సమయం ముగిసే సమయానికి వరుసలో నిలబడిన వారందరికీ అధికారులు ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. గిరిజన గూడేలు, తండాల్లో కూడా పోలింగ్‌ బాగా జరిగింది.

ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైన వెంటనే ఓటర్లు పెద్ద సంఖ్యలో క్యూలలో వేచి ఉన్నారు. అర్ధరాత్రి సమయానికి అందిన సమాచారం ప్రకారం 64.93 శాతం నమోదైంది. అత్యధికంగా భువనగిరిలో 76.47 శాతంగా అత్యల్పంగా హైదరాబాద్‌లో 46.08గా ఉంది. పది నియోజకవర్గాల్లో 70 శాతానికి పైగా పోలింగ్‌ నమోదైంది. 2019లో కేవలం ఐదు నియోజకవర్గాల్లోనే 70 శాతం పోలింగ్‌ దాటడం గమనార్హం. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలో 50.34 శాతం పోలింగ్‌ నమోదైంది.

రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో నమోదైన పోలింగ్‌ శాతాలతో పోల్చి చూస్తే సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ లో పోలింగ్ తక్కువగా నమోదైంది. సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ నియోజకవర్గాల్లో 50 శాతం కూడా పోలింగ్‌ నమోదు కాలేదు. హైదరాబాద్‌ నియోజకవర్గం పరిధిలోని ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద భాజపా అభ్యర్థి మాధవీలత ఓ ఓటరు నకాబ్‌ను తీయించి చూడటంపై వచ్చిన ఫిర్యాదుతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Exit mobile version