Site icon Swatantra Tv

‘వివేకా హత్య’ ప్రత్యక్ష సాక్షి రంగన్న మృతి.. ఇప్పటి వరకు నలుగురు సాక్షుల మరణం

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య జరిగి అప్పుడే ఆరేళ్లు అయింది. ఈనెల 15వ తేదీకి వివేకా హత్యకు ఆరేళ్లు పూర్తికానున్నాయి. ఇన్నేళ్లయిన కేసు నత్తనడకన నడుస్తోంది. ఇందులో పెద్దగా పురోగతి లేదనే చెప్పాలి. ఈ క్రమంలో ఈ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వాచ్‌మెన్‌ రంగన్న బుధవారం మృతి చెందాడు. రంగన్న వివేకా ఇంటి దగ్గర వాచ్‌మెన్‌గా పనిచేశాడు.

రంగన్న వయస్సు 85 ఏళ్లు. ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో కొంతకాలంగా బాధపడుతున్న రంగన్న రెండు వారాల కిందట కిందపడ్డాడు. అప్పుడు కాలికి గాయమైంది. అప్పటి నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ పులివెందులలోని ఇంటి వద్దే ఉంటున్నారు. బుధవారం మధ్యాహ్నం ఊపిరాడటం లేదని తెలపడంతో కుటుంబ సభ్యులు, ఆయనకు రక్షణగా ఉన్న కానిస్టేబుల్‌ రంగన్నను కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

వివేకా హత్య కేసులో రంగన్న కీలక సాక్షి. వివేకా హత్య జరిగినప్పుడు ఇంటి మెయిన్‌ గేటు వద్దే ఆయన నిద్రపోతున్నాడు. వివేకా ఇంట్లో చాలా కాలంగా పనిచేస్తున్న నేపథ్యంలో వివేకా గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి రంగన్నే. వివేకా హత్య అనంతరం పోలీసులు, సీబీఐ అధికారులు రంగన్న వాంగ్మూలాన్ని తీసుకున్నారు. రంగన్న స్టేట్‌మెంట్ ఈ కేసులో చాలా కీలకంగా మారింది.

గత టీడీపీ హయాంలో 2019 ఎన్నికలకు ముందు మార్చి 15న వివేకా నంద హత్యకు గురయ్యరు. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ విపక్ష నేతగా ఉన్న జగన్‌ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో కేసు సీబీఐ చేతికి వెళ్లింది కానీ.. వేగంగా దర్యాప్తు సాగలేదు. హత్య జరిగిన నెలల వ్యవధిలోనే జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత అయినా బాబాయ్‌ హత్యకు సంబంధించి దర్యాప్తులో పురోగతి వస్తుందనుకున్నా.. అలాంటిదేమీ జరగలేదు. ఈ క్రమంలోనే వాచ్‌ మెన్‌ రంగన్న కూడా మృతి చెందడం కేసులో కీలక మలుపుగా పోలీసులు భావిస్తున్నారు.

ఇక ఇదే కేసులో రంగన్నతో కలిసి నలుగురు సాక్షులు మృతి చెందడం కూడా కేసు దర్యాప్తుపై మరింతగా ప్రభావం చూపనుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. . వైఎస్సార్‌ జిల్లా కసనూరుకు చెందిన కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి, కీలక వాంగ్మూలం ఇచ్చిన గంగాధరరెడ్డి , మాజీ సీఎం జగన్‌ బంధువు అభిషేక్‌ రెడ్డి మరణించారు.

Exit mobile version