Site icon Swatantra Tv

విశాఖ రాజధాని కావడం ఖాయం

    ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ..విశాఖ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. ఎన్నికల తరువాత విశాఖలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు. విశాఖను పరిపాలన రాజధాని గా చేస్తానని సీఎం జగన్ మొదటి నుంచి చెబుతున్నారు. తాజాగా సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో ఎన్నికల తరువాత విశాఖ రాజధాని కావడం ఖాయమని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

     2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే విశాఖని పరిపాలన రాజధాని చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. దీంతో చాలా రోజులుగా విశాఖ నుంచి పాలనపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. విశాఖకు రాజధాని తరలిస్తామని మంత్రులు చాలా సార్లే చెప్పుకొచ్చారు. అటు విశాఖకు షిఫ్ట్ అవుతున్నాను అంటూ సీఎం జగన్ స్వయంగా ప్రకటించినా ఇప్పటి వరకు అందుకు అనుగుణంగా అడుగులు పడలేదు. అయితే తాజాగా ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో సీఎం జగన్ మరోసారి విశాఖ రాజధాని తరలింపుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తరువాత విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత తాను విశాఖ షిఫ్ట్ అవుతున్నట్లు ప్రకటించారు.

   విశాఖ అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు జగన్. విశాఖను ఎకనామిక్ గ్రోత్ ఇంజన్‌లా మారుస్తానని భరోసా ఇచ్చారు. నగరంలోని రాడిన్‌సన్ బ్లూ హోటల్‌లో విజన్ విశాఖ సదస్సులో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 2,000 మందికి పైగా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించడం వెనుక ఎలాంటి వ్యక్తిగత స్వార్ధం లేదు అని సీఎం జగన్ చెప్పారు. రాజధానిగా విశాఖను ప్రకటించినంత మాత్రాన అమరావతిని పక్కనపెట్టినట్లు కాదని స్పష్టం చేశారు.

   ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. సీఎం జగన్ చేసిన ఈ ప్రకటన రాజకీయంగా కూడా చర్చకు దారి తీస్తోంది. ఈసారి విశాఖ సహా ఉత్తరాంధ్రా జిల్లాల సీట్లు అన్ని రాజకీయ పార్టీలకు కీలకం. ఈసారి విశాఖ సిటీతో పాటు అన్ని చోట్లా గెలవాలని వైసీపీ చూస్తోంది. అందులో భాగంగానే ఉత్తరాంధ్రా ముఖ ద్వారం అయిన విశాఖను రాజధానిగా చేస్తామని మరోమారు సీఎం గట్టిగా చెప్పారు అని అంటు న్నారు. అదే టైం లో ఏపీకి రాజధాని ఏదీ అని అడిగే విపక్షా లకు సరైన సమాధానంగా విశాఖ అని వైసీపీ కౌంటర్ ఇచ్చినట్లైందని అంటున్నారు. విశాఖను ఎపుడో రాజధానిగా ప్రకటించేవారమని అడ్డుకుంటోంది విపక్షమే అని కూడా చెప్పేందుకే ఈ ప్రకటన చేశారని అంటున్నారు. మొత్తానికి ఎన్నికల టైంలో విశాఖ రాజధాని మరోసారి తెరపైకి రావడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరి రానున్న ఎన్నికల్లో ఈ అంశం ఎంత మేర ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి.

Exit mobile version