Site icon Swatantra Tv

వాణీ జయరామ్ మృతిపై ఎన్నో అనుమానాలు

vani jayram: సంగీత స్వర సరస్వతి వాణీ జయరామ్ (78) మృతి చెందారన్న వార్త జీర్ణించుకోక ముందే…ఆమె అనుమానస్పద స్థితిలో మరణించారన్న నిజం తెలిసి అభిమానులు మరింత ఆవేదన చెందుతున్నారు. ఒక్కరోజు తేడాలో ఇద్దరు మహా వ్యక్తుల మరణంతో చిత్రపరిశ్రమ తీవ్ర శోకంలో మునిగిపోయింది. కళా తపస్వి కె.విశ్వనాథ్ మరణించిన ఒక్కరోజులోనే తన గాత్రంతో అశేష భారతీయులను అలరించిన వాణీ జయరాం మరణించడంతో సంగీతాభిమానులు విలవిల్లాడుతున్నారు.

అటు కె.విశ్వనాథ్ సంగీత ప్రాధాన్యం ఉన్న చిత్రాలే తీసి చరిత్రలో నిలిచారు. వాణీ జయరాం కూడా సంగీత సరస్వతి…శాస్త్రీయ సంగీతంలో చిన్ననాటి నుంచే ఓనమాలు నేర్చుకుని భారతీయ సంగీతాన్ని సుసంపన్నం చేశారు.

తమిళనాడులోని రాయవెల్లూరులో పద్మావతి, దొరస్వామిల ఆరో సంతానంగా 1945 నవంబరు 30న వాణీ జయరాం జన్మించారు. అంతా సంగీత కుటుంబం కావడంతో చిన్ననాటి నుంచి ఆమెకు స్వరజ్నానం అబ్బింది. మొదట కలైవాణి అంటే విద్యావాణి అనే పేరు తల్లిదండ్రులు పెట్టారు.

50 ఏళ్ల సినీ ప్రయాణంలో సుమారు 18 భారతీయ భాషల్లో 10వేలకు పైగా ఆమె పాటలు పాడారు. ముంబైలో ఉద్యోగం చేస్తున్న జయరాంతో వివాహమైంది. అప్పటికి ఆమె హైదరాబాద్ లో బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నారు. భర్త ప్రోత్సాహంతోనే చలనచిత్ర గీతాల్లో ఆమె పాటలు పాడటం మొదలైంది.

2018లో భర్త జయరాం కన్నుమూశారు. అయితే వీరికి పిల్లలు లేరు. ఇటీవలే వాణీ జయరాంకు పద్మభూషన్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ అవార్డు తీసుకోకుండానే ఆమె స్వర్గస్తులయ్యారు.

ఎప్పటిలాగే ఉదయం ఇంటికి వెళ్లిన పని మనిషికి…వాణీ జయరాం తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి బంధువులకు ఫోను చేసింది. దాంతో వాళ్లు వచ్చి తలుపు కొట్టినా తీయలేదు. వాళ్లు పోలీసులకు ఫోను చేశారు. వాళ్లు వచ్చి తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళితే తలకు బలమైన గాయమై, అచేతనమైన స్థితిలో ఆమె మంచం మీద ఉన్నారు.

ముఖం మీద కూడా గాట్లు ఉండటంతో ఎవరైనా వచ్చారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీ కెమెరాలు అన్నీ చూస్తున్నారు. దాంతో పోస్ట్ మార్టంకి పంపించారు. ఆ నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. అది వస్తేనేగానీ ఏ విషయం అంచనాకు రాలేమని పోలీసులు చెబుతున్నారు. పోస్ట్ మార్గం అనంతరం ఆమె పార్థీవ దేహానికి అంత్య క్రియలు చేసేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Exit mobile version