బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నెల్లూరు జిల్లా తడ సమీపంలో తీరం దాటింది. 22 కిలో మీటర్ల వేగంతో వాయుగుండం తీరాన్ని తాకినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం వాయుగుండం అల్పపీడనంగా బలహీనపడింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
ఇప్పటికే నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో రెండు రోజులుగా ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల తీవ్రతకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నెల్లూరు నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లో రోడ్లు, కాలనీలను వర్షపునీరు చుట్టుముట్టడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఇతర జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.