Site icon Swatantra Tv

సనాతన ధర్మంపై ఉదయనిధి వ్యాఖ్యల దుమారం.. స్టాలిన్‌ ఏమన్నారంటే..!

స్వతంత్ర వెబ్ డెస్క్: సనాతన ధర్మం సామాజిక న్యాయానికి వ్యతిరేకమని, దాన్ని పూర్తిగా నిర్మూలించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Stalin) కుమారుడు, మంత్రి, సినీ హీరో ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. దీనిపై హిందూ సంఘాలు మండిపడుతుండగా.. అటు రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఉదయనిధి వ్యాఖ్యలపై రాష్ట్రంతో పాటు దేశంలోనూ రాజకీయంగా దుమారం రేగుతోంది. తమిళనాడులో హిందూ సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. సోషల్ మీడియాలో ఉదయనిధి గతంలో చర్చికి, ఆలయాలకు వెళ్లిన ఫొటోలతో నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఉదయనిధిపై క్రిమినల్ కేసు పెట్టాలంటూ బీజేపీ నేతలు తమిళనాడు గవర్నర్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. గవర్నర్ కు స్టాలిన్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఫుటేజీని అందజేశారు.

ఉదయనిధి వ్యాఖ్యలపై ఆయన తండ్రి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తాజాగా స్పందించారు. కొడుకు వ్యాఖ్యలను సమర్థిస్తూ ఉదయనిధికి మద్దతుగా మాట్లాడారు. తన కొడుకు చేసిన వ్యాఖ్యల్లో ఒక్క ముక్క కూడా తప్పులేదని సమర్థించారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనానికి అర్థమేంటని ప్రశ్నించారు. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధాని ఎందుకు మాట్లాడరని నిలదీశారు. మరోవైపు, సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ.. మంత్రి ఉదయనిధికి మద్దతు పలికారు. ఈ వివాదంపై ఓ ట్వీట్ చేశారు. అందులో.. సనాతన పార్లమెంట్ భవిష్యత్తు ఇలా ఉంటుందా అంటూ స్వామీజీలతో కలిసి ఉన్న మోదీ ఫొటోను షేర్ చేశారు.

Exit mobile version