లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్ విధులు సమర్దవంతం గా నిర్వహించాలన్నారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా పకడ్బందీ గా జరగాలని, ఏ చిన్న పొరపాటుకు తావివ్వరాదన్నారు. కౌంటింగ్ హాల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతించబడవన్నారు. సిబ్బందికి శిక్షణ కార్యక్రమంలో అధికారులకు దిశా నిర్దేశం చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్.
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ సిబ్బందికి సూచించారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా బంజారా హిల్స్‌లోని కొమరం భీమ్ భవనంలో మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్ సూపర్వై జర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, ఏఆర్వోలకు కౌంటింగ్ ప్రక్రియపై శిక్షణ తరగతులు నిర్వహించారు. కౌంటింగ్ సిబ్బంది ఓట్ల లెక్కింపును సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. జిల్లాలో ఓట్ల లెక్కింపునకు మొత్తం 16 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపు పక్కాగా జరిగేలా పర్యవేక్షణ ఉంటుందన్నారు. కౌంటింగ్ ఉదయం 8:00 గంటలకు ప్రారంభమవుతుందని.. నిర్ణీత సమయానికి ఓట్ల లెక్కింపు ప్రారంభించాలన్నారు. ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలని సూచించారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే సంబంధిత నిపుణులు అందుబాటులో ఉండి సరి చేస్తారని తెలిపారు.
ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా అన్ని సెగ్మెంట్లలో ఓట్ల లెక్కింపుకు ప్రతి హాల్లో 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నామని.. రౌండ్ల వారీగా కౌంటింగ్ జరుగుతుందని తెలిపారు. ప్రతి టేబుల్‌కు ఒక మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పారదర్శకంగా కౌంటింగ్ జరగడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర చాలా కీలకమైందన్నారు. మైక్రో అబ్జర్వర్లు రౌండ్ వారీగా ప్రతి రిపోర్ట్‌ను ఎన్నికల అబ్జర్వర్లకు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియలో ఏ సమస్య ఉన్నా ఏఆర్వోకు తెలపాలని సూచించారు.
కౌంటింగ్ హాల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతించబడవు అని స్పష్టం చేశారు. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అన్ని విషయాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. నిబంధనలను పాటిస్తూ, పూర్తి పారదర్శకంగా నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. కౌంటింగ్ హాల్లో ఉండే ఏర్పాట్లు, కౌంటింగ్ ప్రక్రియలో పాటించాల్సిన ఆయా విషయాలపై రోనాల్డ్ రోస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఎలక్ట్రానిక్ మెషిన్ కౌంటింగ్‌కి సంబంధించిన సందేహాలను నివృత్తి చేశారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి అనుదీప్ దురిశెట్టి ఈ సందర్భంగా వీవీ ప్యాట్ స్లిప్పుల కౌంటింగ్, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కు సంబంధించిన ఆయా ప్రక్రియను ఆయన వివరించారు. కౌంటింగ్ సిబ్బంది ప్రతి ఒక్కరు జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని కోరారు. కౌంటింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజకీయ నేతలు ఎవరికి వారే గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి కేంద్రంలో ఏ పార్టీ అధికారం దక్కించుకుంటుందో వేచి చూడాలి.


