28.7 C
Hyderabad
Friday, March 29, 2024
spot_img

జగన్‌కు పిలుపుపై బీఆర్‌ఎస్‌-వైసీపీ వర్గాల్లో ఉత్కంఠ

– ఢిల్లీ, పంజాబ్‌, కేరళ సీఎంలకు కేసీఆర్‌ ఆహ్వానం
– ఏపీ సీఎం జగన్‌ను విస్మరించడంలో ఆంతర్యమేమిటి?
– జగన్‌ను బీజేపీ ఇబ్బంది పెట్టకూడదనే పిలవలేదా?
-కొనసాగుతున్న కేసీఆర్‌-జగన్‌ సత్సంబంధాలు
– అటు బీజేపీతోనూ కొనసాగుతున్న జగన్‌ రాజకీయ బంధం
– రాజకీయంగా ఇచ్చి పుచ్చుకునే వైఖరిలో బీఆర్‌ఎస్‌-వైసీపీ
– కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత సిఫార్సు చేసిన వారికి టీటీడీ బోర్డు మెంబర్లు ఇచ్చిన జగన్‌
– తెలంగాణ సర్కారులో కాంట్రాక్టు పనులు చేస్తున్న వైసీపీ ప్రముఖులు
– ఆంధ్రాలో వ్యాపారాలు చేసుకుంటున్న బీఆర్‌ఎస్‌ నేతలు
– బీఆర్‌ఎస్‌కు మద్దతు కోసం దేశవ్యాప్త పర్యటనలు చేస్తున్న కేసీఆర్‌
– అయినా పక్కనే ఉన్న ఏపీకి వెళ్లి జగన్‌ మద్దతు కోరని వైచిత్రి
– మరోవైపు ఆంధ్రాలో బీఆర్‌ఎస్‌ బలోపేతానికి కేసీఆర్‌ కసరత్తు
– అయినా జగన్‌ మద్దతు కోరని కేసీఆర్‌ తీరుపై విస్మయం
– ఖమ్మం సభకూ జగన్‌ను ఆహ్వానించని వైనంపై చర్చ
( మార్తి సుబ్రహ్మణ్యం)

బీఆర్‌ఎస్‌ను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయం కోసం తన శక్తియుక్తులు ధారపోస్తున్నారు. అందుకోసం ఆయన దేశవ్యాప్త పర్యటనలు చేస్తున్నారు. ఢిల్లీకి వెళ్లినప్పుడు, దేశంలోని అన్ని పార్టీల ప్రముఖులతో భేటీలు వేస్తున్నారు. బీఆర్‌ఎస్‌కు మద్దతునీయాలని అభ్యర్ధిస్తున్నారు. తెలంగాణకు సరిహద్దు రాష్ర్టాలయిన కర్నాటక, మహారాష్ట్ర రాజకీయ పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు.

అయినా.. పక్కనే ఉన్న ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌ మద్దతు మాత్రం కోరడం లేదు. ఆయనను కలసి బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని, అభ్యర్ధించడం లేదు. చివరాఖరకు ఖమ్మంలో ఈనెల 18న నిర్వహించనున్న బీఆర్‌ఎస్‌ తొలి బహిరంగసభకు సైతం.. ముగ్గురు సీఎంలను పిలిచిన కేసీఆర్‌, పక్కనే ఉన్న ఏపీ సీఎం జగనన్నకు మాత్రం ఆహ్వానం పంపలేదు.

కారణం ఏమిటి? దేశంలోని బీజేపీయేతర పార్టీలను పిలుస్తున్న కేసీఆర్‌.. బీజేపీకి అధికారికంగా మిత్రపక్షం కూడా కాని.. వైసీపీ అధినేత జగనన్నను, ఖమ్మం సభకు ఎందుకు ఆహ్వానించలేదు?పోనీ ఇంకా సమయం ఉంది కాబట్టి, తర్వాత పిలుస్తారా? అసలు పిలవకుండా వదిలేస్తారా? జగన్‌ను ఆహ్వానిస్తే కేసీఆర్‌కు వచ్చే ఇబ్బంది ఏమిటి? ఒకవేళ జగన్‌ను పిలిస్తే, రాజకీయంగా నష్టపోయేది ఎవరు?.. ఇదీ ఇప్పుడు ఆంధ్రా-తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌.

ఈనెల 18న ఖమ్మంలో బీఆర్‌ఎస్‌ తొలి భారీ బహిరంగసభకు, తెలంగాణ సీఎం కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నారు. ఆ సభను ఆయన అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు. సభను సక్సెస్‌ చేసే బాధ్యతను ట్రబుల్‌షూటర్‌గా పేరున్న, మంత్రి హరీష్‌రావుకు అప్పగించారు. ఖమ్మం జిల్లా నేతలతో కేసీఆర్‌ స్వయంగా భేటీ వేశారు. ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్‌ఎస్‌ను, బీఆర్‌ఎస్‌ జాతీయ పార్టీగా ప్రకటించిన తర్వాత.. ఆ పార్టీ తొలిసారి ఖమ్మంలో భారీ సభ నిర్వహించడం ఆసక్తిగా మారింది.

గత నెలలో అదే ఖమ్మంలో.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిర్వహించిన సభ, అంచనాలకు మించి సక్సెస్‌ అవడం, తెలంగాణ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయింది. తెలంగాణలో టీడీపీ రీఎంట్రీకి, ఖమ్మం సభ దారులువేసింది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నిర్వహించనున్న ఖమ్మం సభ సక్సెస్‌పై, సహజంగానే ఉత్కంఠ నెలకొంది.

ఖమ్మం సభ జాతీయ స్థాయిని ఆకర్షించాలన్న వ్యూహంలో భాగంగా.. కేసీఆర్‌ ముగ్గురు ముఖ్యమంత్రులను ఆహ్వానించారు. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, కేరళ సీఎం పినరయి విజయన్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌తోపాటు మరో మాజీ సీఎంను ఆహ్వానించారు. ఆప్‌తో కేసీఆర్‌ తొలి నుంచీ సత్సంబంధాలు నిర్వహిస్తున్నారు. సీబీఐ- ఈడీ నమోదు చేసిన లిక్కర్‌ కేసులో కూడా, రెండు పార్టీల నేతల పేర్లు కనిపించాయి.

ఇక మునుగోడు ఉప ఎన్నిక సందర్భగా సీపీఎం కూడా, బీఆర్‌ఎస్‌తో జత కట్టింది. ఆ బంధానికి కొనసాగింపుగా.. ఆ రెండు పార్టీల సీఎంలనూ కేసీఆర్‌, ఖమ్మం సభకు ఆహ్వానించినట్లు కనిపిస్తోంది.
అంతా బాగానే ఉంది. బీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించాలని.. బీజేపీకి ప్రత్యామ్నాయం నిర్మిద్దామంటూ కేసీఆర్‌, బీజేపీయేతర పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయా పార్టీల అగ్రనేతల ఇళ్లకు వెళ్లి మరీ, జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం గురించి హితబోధ చేస్తున్నారు. ఆ మేరకు గతంలో మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ధాక్రే, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి ఇళ్లకు వెళ్లి మంతనాలు జరిపారు. కుమారస్వామి వంటి వారిని.. బీఆర్‌ఎస్‌ పేరు ప్రకటించిన తొలి సమావేశానికి ఆహ్వానించి, ఆయన మెడలో బీఆర్‌ఎస్‌ కండువా కూడా వేశారు.

అయితే.. పక్కనే ఉన్న ఏపీ సీఎం-వైసీపీ అధినేత జగన్‌ను మాత్రం, ఇప్పటివరకూ కేసీఆర్‌ కలవకపోవడమే, రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయింది. బీఆర్‌ఎస్‌కు మద్దతు కోసం, కాళ్లకు బలపాలు కట్టుకుని తిరుగుతున్న కేసీఆర్‌.. పక్కనే ఉన్న ఏపీ సీఎంను మాత్రం విస్మరించడం వ్యూహాత్మకమా? లేక జగన్‌ను రాజకీయంగా ఇబ్బందిపెట్టడం ఎందుకన్న, ముందుచూపుతో కూడిన సానుభూతా? అన్న ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి.

దానితో తెలంగాణకు సరిహద్దు రాష్ర్టాలయిన మహారాష్ట్ర, కర్నాటక రాష్ర్టాల నేతల ఇళ్లకు వెళ్లి, వారి మద్దతు కోరిన కేసీఆర్‌.. అదే సరిహద్దు రాష్ట్రమయిన ఏపీ సీఎం జగన్‌ వద్దకు, ఎందుకు వెళ్లలేదన్న చర్చకు సహజంగా తెరలేచింది.

నిజానికి కేసీఆర్‌-జగన్‌ కలిసే.. గత ఎన్నికల్లో టీడీపీని ఓడించారన్నది బహిరంగ సత్యం. తెలంగాణలో తనకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన చంద్రబాబుకు, కచ్చితంగా రిటర్ను గిఫ్ట్‌ ఇస్తానని కేసీఆర్‌ హెచ్చరించారు. అనుకున్నట్లే.. వైసీపీ అభ్యర్థుల విజయం కోసం… ప్రత్యక్షంగా-పరోక్షంగా పనిచేసి, టీడీపీ ఓటమికి కారణమయ్యారు. ఆ తర్వాత జగన్‌.. ప్రగతిభవన్‌కు వెళ్లి కేసీఆర్‌తో ముచ్చటించారు. కలసి భోజనం చేశారు.

టీటీడీ బోర్డు మెంబర్ల నియామకంలో కూడా.. కేసీఆర్‌-కేటీఆర్‌-కవిత సిఫార్సు చేసిన వారికి, జగన్‌ సర్కారు పదవులిచ్చింది. అటు పలువురు మంత్రులు, వైసీపీ కీలకనేతలు సైతం.. తెలంగాణలో జరుగుతున్న పలు ప్రాజెక్టుల్లో , కాంట్రాక్టులు చేస్తున్నారు. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో , భారీ స్థాయిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు చేస్తున్నారు. సర్కారులోని ఓ కీలకమంత్రితో, వైసీపీ నేతలు సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు.

బీఆర్‌ఎస్‌ నేతలు సైతం, ఏపీలో వైసీపీ నేతలతో కలసి వ్యాపారాలు చేసుకుంటున్నారన్నది బహిరంగరహస్యం. ఇటీవలి ఓ ప్రెస్‌మీట్‌లో కేసీఆర్‌.. ఏపీ సర్కారు కూల్చివేతకు సంబంధించి, చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ‘‘జగన్‌ ప్రభుత్వం బీజేపీకి ఎంత సహకరిస్తున్నప్పటికీ, ఏపీ సర్కారును కూడా కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంద’’ంటూ ఆరోపించారు.

ఈవిధంగా బీఆర్‌ఎస్‌-వైసీపీ బంధం, రాజకీయంగా బలంగా ఉన్నప్పటికీ.. ఖమ్మం సభకు జగన్‌ను ఆహ్వానించని వైనంపై, రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ఆ కారణాలపై, రాజకీయ పరిశీలకుల విశ్లేషణ ఆసక్తికరంగానే కనిపిస్తోంది. ఇప్పటివరకూ జగన్‌… కేంద్రంలోని బీజేపీ సర్కారుతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఏమాత్రం ఘర్షణ వైఖరి అవలంబించడం లేదు. పార్లమెంటులో అన్ని బిల్లులకూ, బీజేపీ కోరకపోయినప్పటికీ కేంద్రానికి వైసీపీ మద్దతునిస్తోంది.

వైసీపీ కీలక నేతల కోరిక ప్రకారమే, అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణను తొలగించారు. నలుగురైదుగురు బీజేపీ అగ్రనేతలు, వైసీపీ సర్కారుతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఓ బీజేపీ అగ్రనేతకు గోదావరిలో ఇసుక రీచ్‌, ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రానైట్‌ వ్యాపారంలో వాటాలు ఇచ్చినట్లు, బీజేపీ వర్గాల్లోనే ప్రచారం జరిగింది.

రాష్ట్రం ఆర్ధికంగా ఇబ్బందిలో పడిన ప్రతిసారీ.. కేంద్రం ఏదో ఒక రూపంలో ఆదుకుంటూనే ఉంది. ఆర్ధిక మంత్రితో సహా, పలువురు కేంద్రమంత్రులతో.. వైసీపీ ప్రముఖులు వ్యక్తిగత సంబంధాలు కొనసాగిస్తున్నారు. గతంలో పలువురు కేంద్రమంత్రులు సూచించిన వారికి, టీటీడీ బోర్డు పదవులు కూడా ఇచ్చారు.

ఈ దృష్ట్యా … తనకు సన్నిహితుడైన జగన్‌ను ఖమ్మం సభకు పిలిచి, ఆయనను రాజకీయంగా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే, జగన్‌ను ఆహ్వానించి ఉండకపోవచ్చంటున్నారు. ఒకవేళ తాను జగన్‌ను ఖమ్మం సభకు ఆహ్వానిస్తే.. అది బీజేపీకి ఆగ్రహంగా మారి, ఆ పరిణామాలు సహజంగా టీడీపీకి ఉపయోగపడుతుందన్న, ముందుచూపు కూడా కేసీఆర్‌లో ఉండవచ్చంటున్నారు.

జగన్‌ ఖమ్మం సభకు వచ్చినా, హాజరుకాకున్నా.. ఆయన తమతోనే ఉంటారన్న ధీమా కూడా, కేసీఆర్‌ నిర్ణయానికి మరో కారణమయి ఉండవచ్చని, రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Latest Articles

మత్స్యకారుల జీవితాలను ప్రతిబింబించేలా ‘సముద్రుడు’

కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరో హీరోయిన్లుగా నగేష్ నారదాసి దర్శకత్వంలో బధా వత్ కిషన్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ "సముద్రుడు". అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది.. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్