32.2 C
Hyderabad
Saturday, April 20, 2024
spot_img

బీఆర్‌ఎస్‌తో మారిన కేసీఆర్‌ స్వరం

– ఉద్యమ కాలంలో ఆంధ్రావారిపై ఉడుకెత్తించిన టీఆర్‌ఎస్‌ ప్రసంగాలు
– ఆంధ్రా బిర్యానీని పెండతో పోల్చిన కేసీఆర్‌
– లంకలోని రాక్షసులతో ఆంధ్రులను పోల్చిన కేసీఆర్‌
– సంక్రాంతి ఆంధ్రా పండగ అని వ్యాఖ్య
– ఏపీ అధికారులకు లూప్‌ లైన్‌ పోస్టింగులు
– బీఆర్‌ఎస్‌తో మారిన రాజకీయ విధానం
– ఇప్పుడు ఏపీ అధికారి శాంతికుమారికి సీఎస్‌ పోస్టింగ్‌
– ఏపీ క్యాడర్‌ అధికారికి డీజీపీగా కొనసాగింపు
– సంక్రాంతి పండుగలో పాల్గొన్న కవిత, హరీష్‌
– కృష్ణానదీ జలాల వాటాలపై కనిపించని జగడం
– పోలవరం ఎత్తుపైనా వ్యూహాత్మక మౌనం
– విలీనమండలాలపైనా అదే మౌనం
– అటకెక్కిన విభజన పైసల పంచాయితీ
– తెలంగాణలో వైసీపీ నేతల కాంట్రాక్టులు

( మార్తి సుబ్రహ్మణ్యం)

స్టేట్‌మెంట్లు మార్చని వాడు రాజకీయ నాయకుడు కాదు పొమ్మంటాడు గిరీశం .. తన కన్యాశుల్కంలో. ఇప్పుడు తెలంగాణ సీఎం-బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సరిగ్గా, గిరీశాన్ని ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. రాజకీయాల్లో గిరీశం కవి హృదయాన్ని, కేసీఆర్‌ ఒక్కరే అర్ధం చేసుకున్నట్లున్నారు. అందుకే టీఆర్‌ఎస్‌ నుంచి బీఆర్‌ఎస్‌ ఉద్ధానంలో, ఆయన వేసిన అడుగులు చర్చనీయాంశమవుతున్నాయి. అంటే ఆంధ్రా బిర్యానీ నుంచి సంక్రాతి భోగిమంటల వరకూ అన్నమాట. లంకలో రాక్షసుల నుంచి అందరం ఒక్కటేనన్న ‘జాతీయ భావం’ వరకూ అన్నమాట. అదేదో చూద్దాం రండి.

స్వరాష్ట్ర సాధన స్లో‘గన్‌’తో టీఆర్‌ఎస్‌ను పుట్టించిన కేసీఆర్‌, భారత రాజకీయాల్లో సృష్టించిన చరిత్ర అమోఘమే కాదు.. అద్భుతం, అనిర్వచనీయం, అనన్యసామాన్యం! తన సుదీర్ఘకాల ఉద్యమంలో ఒక్క నెత్తురు చుక్క చిందించకుండా, కేవలం రాజకీయ ఒత్తిడి వ్యూహం.. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఉద్యమానికి మద్దతు కూడగట్టే ఎత్తుగడ.. ఇతర పార్టీలను ‘పరాయిపార్టీ’లన్న మానసిక రాజకీయ ముద్ర.. తెలంగాణ భావజాల విస్తరణ.. తెలంగాణ సాంస్కృతిక విప్లవంతో.. యావత్‌ తెలంగాణ సమాజాన్ని రోడ్డెక్కించి, ఉద్యమమార్గం పట్టించిన యోద్ధ కేసీఆర్‌.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అంతకుముందు, ఎంతోమంది చేసిన ఉద్యమాలతో పోలిస్తే.. కేసీఆర్‌ వ్యూహసౌధంతో నిర్మించిన ఉద్యమం మాత్రం విభిన్నం, విశిష్టం. అందుకే ఎవరు అవునన్నా.. ఎవరు కాదన్నా.. కేసీఆర్‌ తెలంగాణ జాతి పితామహుడేనన్నది జనవాక్కు.

అలాంటి తెలంగాణ రాష్ట్ర పితామహుడైన కేసీఆర్‌.. భారత రాష్ట్ర సమితి ఏర్పాటుతో తన పూర్వ సిద్ధాంతాలు మరుగుపరిచి, తన బీఆర్‌ఎస్‌కు అదనపు మెరుగులు పెట్టేందుకు సిద్ధమవుతుండటం, అన్ని వర్గాల్లో ఆసక్తికలిగిస్తోంది. ప్రధానంగా ఏపీ ప్రజలు అమితంగా ఇష్టపడే.. సంక్రాంతి పండుగ సమయంలో చేసిన వ్యాఖ్యల నుంచి, ఆంధ్రా బిర్యానీపై చేసిన వ్యాఖ్యల వరకూ, ఇప్పుడు సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం అవన్నీ ఏపీలో సోషల్‌మీడియా వేదికగా వైరల్‌ అవుతున్నాయి.

తెలంగాణ ఉద్యమ సమయంలో, ఆంధ్రులను జాగో-భాగో అని నినదించిన కేసీఆర్‌.. సంక్రాంతిని ఆంధ్రుల పండుగగా అభివర్ణించారు. ఆనాడు కేసీఆర్‌ ఇంకా అనేక ఆవేశపూరిత ప్రసంగాలే చేశారు. ఆంధ్రా కుక్కల్లారా.. 24 గంటల్లో తెలంగాణను విడిచిపెట్టకపోతే, తన్ని వెళ్లగొడతారని హెచ్చరించారు. ఆంధ్రా బిర్యానీని పెండతో పోల్చారు. ‘‘అసలు మీ ముఖాలకు బిర్యానీ వండొస్తదా.. అది పెండలా ఉంటది’’ అని ఎద్దేవా చేశారు.‘‘ ఆంధ్రాలో పుట్టినోళ్లంతా తెలంగాణ ద్రోహులే. తెలంగాణను దోచుకోవడానికి వచ్చినోళ్లే.. మేం ఇన్ని తిట్టినా, బండతో బాదినా, ఉమ్మేసినా ఇంకా ఇక్కడే సిగ్గులేకుండా ఎట్లుంటరు చెప్పు’’ అని వ్యంగ్యాస్ర్తాలు సంధించారు.

‘‘లంకలో ఉన్నవాళ్లంతా రాక్షసులే. తెలంగాణలో ఉన్న ఆంధ్రావాళ్లంతా రాక్షసులే’’నని తేల్చారు. ‘‘గోదావరి పుష్కరాలకు ఆంధ్రా పంతుళ్లే బాగుపడాలా? తెలంగాణ పంతుళ్లు బాగుపడకూడదా?’’ అని ప్రశ్నించారు. ‘‘తెలంగాణలో కాంట్రాక్టర్లు లేరా? ఆంధ్రా కాంట్రాక్టర్లకే అన్నీ ఇయ్యాలా’’? అని నిలదీశారు. ‘‘ఉన్నతస్థాయి పదవులకు తెలంగాణ అధికారులు పనికిరారా’’? అని కన్నెర్ర చేశారు. కృష్ణా నదీ జలాలను ఏపీ సర్కారు దోచుకుంటోందని ఆగ్రహిస్తూ, మా వాటా మాకు కావల్సిందేనని డిమాండ్‌ చేశారు. ఇవన్నీ తెలంగాణ రాష్ర్టం ఏర్పడకముందు.. కేసీఆర్‌ ఆంధ్రావారిపై సంధించిన విమర్శనాస్ర్తాలు.

తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత.. కృష్ణానదీ జలాల్లో వాటా కోసం, కేసీఆర్‌ సర్కారు సీరియస్‌గానే యుద్ధం చేసింది. నాటి చంద్రబాబు సర్కారుకు వ్యతిరేకంగా కోర్టుకెక్కింది. పోలవరం ఎత్తు తగ్గాల్సిందేనని, దాని వల్లే భద్రాచలం మునిగిపోతోందని, పార్లమెంటులో సైతం ఎలుగెత్తి చాటింది. విలీన మండలాలు తెలంగాణకు బదలాయించాలని డిమాండ్‌ చేసింది.

విభజన హామీల ప్రకారం తమకు రావలసిన, 7 వేల కోట్ల రూపాయల సంగతేమిటని ప్రశ్నించింది. కానీ జగన్‌ సీఎం అయిన తర్వాత, కృష్ణాజలాల వాటాపై స్వరం తగ్గించింది. పోలవరం ఎత్తుపై మౌనం దాల్చింది. కానీ అటు ఏపీ సర్కారు.. విభజన అంశాలు, కృష్ణాజలాలపై తన వాటా విషయంలో మాత్రం.. తెలంగాణకు వ్యతిరేకంగా ప్రధాని నుంచి, ట్రిబ్యునల్‌ వరకూ ఫిర్యాదు చేస్తూనే ఉంది.

ఈ నేపథ్యంలో.. టీఆర్‌ఎస్‌ను, బీఆర్‌ఎస్‌ జాతీయ పార్టీగా మార్చిన తర్వాత కేసీఆర్‌.. తన పార్టీ పేరుతోపాటు, ఆంధ్రాపై తన పాత ఆలోచనలు సమూలంగా మార్చుకోవడమే ఆసక్తికలిగిస్తోంది. ఉద్యమ సమయంలో సంక్రాంతిని, ఆంధ్రుల పండుగగా అభివర్ణించిన నాటి కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ.. ఇప్పుడు బీఆర్‌ఎస్‌గా అవతరించిన తర్వాత, స్వయంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం విశేషం. వాటికి భారత జాగృతి అధినేత్రి కవిత, మంత్రి హరీష్‌రావు స్వయంగా హాజరవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. గతంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో, బతుకమ్మ సంబురాలు తప్ప.. ఎప్పుడూ సంక్రాంతి సంబరాలు చేసిన దాఖలాలు లేవని రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.

ఇక సీఎస్‌, డీజీపీ వంటి కీలక పోస్టింగులు కూడా ఆంధ్రావారికి, ఆంధ్రా క్యాడర్‌ అధికారులకు ఇవ్వడం.. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ రాజకీయ ప్రత్యర్ధులకు, అస్త్రంగా మారింది. ఒకప్పుడు ఏపీ మూలాలు ఉన్న అధికారులకు, లూప్‌లైన్‌ పోస్టింగులు ఇచ్చిన కేసీఆర్‌ సర్కారు.. ఇప్పుడు ఏకంగా.. ఆంధ్రా కాపు వర్గానికి చెందిన శాంతికుమారిని, సీఎస్‌గా నియమించడం చర్చనీయాంశమయింది.

ఇటీవలే హైకోర్టు ఆదేశాలతో, ఏపీకి రిపోర్టు చేసిన సీఎస్‌ సోమేష్‌ కూడా, ఏపీ క్యాడర్‌కు చెందిన వారే. అటు ఏపీ క్యాడర్‌కు చెందిన అంజనీకుమార్‌ను, డీజీపీగా కొనసాగిస్తున్నారు. ఏపీ అధికారులను తెలంగాణకు డిప్యుటేషన్‌పై, అత్యంత సులభంగా తీసుకుంటున్నారు.

తెలంగాణ వచ్చిన కొత్తలో.. ఏపీ మూలాలు ఉన్న అధికారులకు లూప్‌లైన్‌ పోస్టింగులు ఇచ్చిన కేసీఆర్‌ సర్కారు.. ఇప్పుడు సీఎస్‌ వంటి అత్యంత కీలకమైన పదవి కూడా, ఆంధ్రా మూలాలు ఉన్న వారికి ఇవ్వడాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.

ఇక తెలంగాణలోని అత్యంత కీలక శాఖలన్నీ, బిహార్‌ అధికారులకు అప్పగించిన వైనం విమర్శలకు దారితీసింది. ప్రధానంగా ఐదు కీలక శాఖలన్నీ, బిహారీల గుప్పిటలో ఉన్నాయన్నది వినిపిస్తున్న విమర్శ. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి దీనిపై, అనేకసార్లు విమర్శనాస్ర్తాలు సంధించారు. తెలంగాణ మూలాలు ఉన్న అధికారులకు.. అప్రాధాన్య శాఖలివ్వడానికి నిరసనగా, ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

ఇప్పుడు తెలంగాణలోని ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో, ఏపీకి చెందిన మేఘా కంపెనీదే హవా. తెలంగాణలో మేఘా చేయని పనులు లేవు. ఇక వైసీపీి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలకనేతలు తెలంగాణలోని ముఖ్యమైన ప్రాజెక్టుల్లో ..కాంట్రాక్టులు-సబ్‌ కాంట్రాక్టర్లుగా పనిచేస్తున్న వైనంపై, కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

కొద్దినెలల క్రితం తెలంగాణలో భారీ వర్షాలు వచ్చిన సమయంలో, భద్రాచలం ప్రమాదంలో పడింది. ఆ సందర్భంలో పోలవరం ఎత్తు పెంచడం వల్లే, భద్రాచలం ప్రమాదంలో పడిందని టీఆర్‌ఎస్‌ ఆరోపించింది. విభజన సమయంలో ఏపీలో విలీనం చేసిన మండలాలను, తిరిగి తెలంగాణలో కలపాలని టీఆర్‌ఎస్‌ నేతలు డిమాండ్‌ చేశారు.

అయితే బీఆర్‌ఎస్‌ జాతీయ పార్టీని ప్రకటించిన తర్వాత, మళ్లీ ఆ పార్టీ నేతల నుంచి ఆ డిమాండ్‌ వినిపించడం ఆగిపోయింది. ఇప్పుడు పోలవరం ఎత్తుపై, తెలంగాణ రాష్ట్ర వైఖరి ఏమిటో, ఎవరికీ తెలియని ఆశ్చర్యకర పరిస్థితి. పైగా ఇకపై తాము అంత ర్‌ రాష్ట్ర నీటి వివాదాల గురించి మాట్లాడబోమని, స్వయంగా కేసీఆర్‌ ప్రకటించడం మరో ఆశ్చర్యం. ఇక విభజన సమస్యలపై, చాలా ఏళ్లు ఎలుగెత్తి చాటిన కేసీఆర్‌ సర్కారు.. ఇప్పుడు దానిపై వ్యూహాత్మక మౌనం పాటించడం ఆశ్చర్యం.

బీఆర్‌ఎస్‌ స్థాపన తర్వాత ఆంధ్రాతో ఉన్న భవిష్యత్తు అవసరాల మేరకే.. ఆ పార్టీ అధినేత కేసీఆర్‌, తన పాత వైఖరి మార్చుకున్నట్లు స్పష్టమవుతోందన్న వ్యాఖ్యలు, రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. జాతీయ పార్టీకి సాంకేతికంగా కావలసిన ఓట్ల దృష్ట్యా.. ఏపీపై కేసీఆర్‌ తన పూర్వ పంథాను వ్యూహాత్మకంగా మార్చుకున్నట్లు, రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

అందుకే కీలకమైన పోలవరం ఎత్తు, విభజన అంశాలు, విలీన మండలాల అంశం, కృష్ణాజలాల వాటా వంటి కీలక అంశాలపై.. బీఆర్‌ఎస్‌ వ్యూహాత్మక మౌనం పాటిస్తోందన్న వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి.

Latest Articles

కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల లేఖ

 కేంద్ర ఎన్నికల సంఘానికి మాజీ ఎంపీ కనకమేడల రవింద్ర కుమార్ లేఖ రాశారు. ఏపీలో ఎన్నికల కోడ్ వచ్చినా, పోలీసులు ఇంకా అధికార పార్టీ నీడలోనే పని చేస్తున్నారన్నారు. పోలీసులను అస్త్రంగా మార్చుకొని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్