40.2 C
Hyderabad
Thursday, April 25, 2024
spot_img

కన్నడ నీటి ప్రాజెక్టుతో తెలుగు రాష్ట్రాలు ‘భద్ర’మేనా?

– ఎగువ భద్రతో ఆంధ్రా-తెలంగాణ రాష్ర్టాలకు అన్యాయం
– తుంగభద్ర ఎగువ కాలువ మరియు దిగువ కాలువ, ఆర్డీఎస్‌, కె.సి.కెనాల్ (సుంకేసుల ఆనకట్ట), శ్రీశైలం ఆధారిత ప్రాజెక్టులు, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులకు నీటి గండం
– ఏపీలో వైసీపీ-బీజేపీ మినహా అన్ని పార్టీల నిరసన
– అయినా గళమెత్తని ఆంధ్రా-తెలంగాణ ముఖ్యమంత్రులు
– కదంతొక్కుతున్న సీమ తెరపైకి మరో నీటి ఉద్యమం
– ఈ సమస్యపై తెలంగాణలో కనిపించని జల చైతన్యం
– రెండు రాష్ర్టాలకూ 30 టీఎంసీ నీరు హుళక్కేనా? తుంగభద్ర డ్యాం నుండి మరో 30 టీఎంసీలకు ఎసరు పెట్టనున్న కర్ణాటక
– బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై  సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉన్నా కేంద్రం ప్రభుత్వం అనుమతి –  నికర జలాల కేటాయింపులేని ప్రాజెక్టుకు సి.డబ్లు.సి. ఎలా అనుమతిస్తుంది? –  పోలవరం డిపిఆర్‌-2కు దిక్కులేదు గానీ ఎగువ భద్ర ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్ లో రు. 5,300 కోట్లా? 
– కర్ణాటకలో బీజేపీ సర్కారును బయటపడేసేందుకే కేంద్ర నిధులు, జాతీయ హోదా
– జాతీయ పార్టీతో  రాజకీయ ఇరకాటంలో బీఆర్‌ఎస్‌
– ఎగువ భద్ర ప్రాజెక్టుకు బీఆర్‌ఎస్‌ అనుకూలమా? వ్యతిరేకమా?

( మార్తి సుబ్రహ్మణ్యం)

 కర్ణాటక నీటి ప్రాజెక్టుతో ఆంధ్రా-తెలంగాణ రాష్ర్టాలకు కష్టాలొచ్చి పడ్డాయి. ఎగువ భద్ర ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నిధులిచ్చి గ్రీస్‌సిగ్నల్‌ ఇవ్వడం, రెండు తెలుగు రాష్ర్టాలకు శాపంలా పరిణమించింది. కర్నాటక అత్యుత్సాహం ఫలితంగా 30 టీఎంసీల నీరు రెండు తెలుగు రాష్ర్టాలకు అందనిద్రాక్షలా మారింది. కర్ణాటక దూకుడును నివారించలేని రెండు తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రుల మౌనం వల్ల.. తుంగభద్ర ఎగువ కాలువ మరియు దిగువ కాలువ, ఆర్డీఎస్‌, కె.సి.కెనాల్ (సుంకేసుల ఆనకట్ట), శ్రీశైలం ఆధారిత ప్రాజెక్టులు, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులకు అత్యంత విలువైన 30 టీఎంసీల నీరు నిలిచిపోయే ప్రమాదం వచ్చింది. కర్ణాటక జల దాష్ఠీకంపై ఏపీలో వైసీపీ-బీజేపీ మినహా, అన్ని పార్టీలూ నిరసన గళమెత్తాయి. తెలంగాణలో మాత్రం ఇంకా జలచైతన్యం కనిపించడం లేదు. రెండు తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఎవరి మొహమాటంతో వారు మిన్నకుండిపోవడం, చర్చనీయాంశమయింది. కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్న మొహమాటంతో, ఆంధ్రా-తెలంగాణ బీజేపీ నేతల స్వరం మూగోయింది. మొత్తంగా..  కర్ణాటక   ఎగువభద్రపై ఎవరి దారి వారిదే అన్నట్టుగా మారింది.

మోదీ సర్కారు .. మధ్య కర్ణాటక ప్రాంతంలో కర్నాటక ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఎగువభద్ర ప్రాజెక్టుకు, 5300కోట్ల రూపాయలు మంజూరు చేసింది. అదొక్కటే కాదు. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించింది.  అప్పర్‌ భద్రతో ఏపీ-తెలంగాణలోని కింది ప్రాజెక్టులకు వరద వస్తే తప్ప, నీళ్లు అందవు. ఇది కర్నాటకలో ఎన్నికలు ఎదుర్కొంటున్న బీజేపీకి మోదం కాగా, రెండు తెలుగు రాష్ర్టాల రైతాంగానికి  ఖేదంగా మారింది.

ప్రస్తుతం అమలులో ఉన్న బచావత్ ట్రిబ్యునల్ తీర్పు మేరకు..  కృష్ణా నదీ జలాల్లో కర్ణాటకకు కేటాయించిన నికర జలాల వినియోగానికి,  కర్ణాటక రాష్ట్రం నీటి పారుదల ప్రాజెక్టులను నిర్మించుకుంది. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు తెలుగు ప్రజలకు శరాఘాతంగా భావించి,  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ కూడా,  ఆ కేసులో ఇంప్లీడ్ అయ్యింది. ఆ కేసు విచారణలో ఉన్నది. పర్యవసానంగా బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయలేదు. అది అమలులోకి రాలేదు.

  బచావత్ ట్రిబ్యునల్ 75% నీటి లభ్యత ప్రామాణికంగా కేటాయించిన నికర జలాలను యధాతధంగా కొనసాగిస్తూ, ఆంధ్రప్రదేశ్ కు దఖలు పరచబడిన మిగులు జలాలను వినియోగించుకునే స్వేచ్ఛను హరిస్తూ.. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ 65% -55% నీటి లభ్యత ప్రామాణికంగా లభించే నీటిని కూడా లెక్కగట్టి,  అందులో మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పంపిణీ చేసింది.   దీన్ని అవకాశంగా తీసుకొని, 65% నీటి లభ్యత ప్రామాణికంగా లభించే నీటిని వినియోగించుకొంటామంటూ..  కర్ణాటక బిజెపి ప్రభుత్వం 30 టియంసిల సామర్థ్యంతో ఎగువ భద్ర ప్రాజెక్టును రూపొందించి, కేంద్ర ప్రభుత్వానికి పంపి, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ద్వారా దాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేసుకుంది.. దాని నిర్మాణ అంచనా వ్యయం రు.16,125 కోట్లు. మోడీ ప్రభుత్వం 2023-24 వార్షిక బడ్జెట్లో రు.5,300 కోట్లు కేటాయించింది. 

బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై దాఖలైన,  స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉండగా, నికర జలాల కేటాయింపులేని ప్రాజెక్టుకు సి.డబ్లు.సి. ఎలా అనుమతిస్తుంది? కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జాతీయ ప్రాజెక్టుగా ఎలా ప్రకటిస్తుంది? కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్లో రు.5,300 కోట్లు ఎలా కేటాయిస్తారు?

పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టుకు,  గోదావరి నదీ జలాల వివాద పరిష్కారం కోసం నియమించబడిన బచావత్ ట్రిబ్యునల్ నికర జలాలను కేటాయించింది. సి.డబ్లు.సి. ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014 మేరకు,  జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడింది. కానీ, 2014-15 వార్షిక బడ్జెట్లో రు.100 కోట్లు నామమాత్రంగా కేటాయిస్తే ఆందోళన చేయగా 250 కోట్లుకు పెంచారు. తర్వాత కాలంలో వార్షిక బడ్జెట్లలో పోలవరానికి నిధులను కేటాయించకుండా, కేంద్ర ప్రభుత్వమే చెల్లించే బాధ్యతతో,  నాబార్డ్ నుండి రుణం తీసుకొని పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తున్న మొత్తాన్ని చెల్లిస్తూ వస్తున్నారు. పోలవరానికి సంబంధించి డిపీఆర్-2 కు ఆమోదం తెలియజేయకుండా మోకాలడ్డుతూ, సవతితల్లి ప్రేమ కనబరుస్తూ, నికర జలాల కేటాయింపేలేని ఎగువ భద్ర ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్లో రు.5,300 కోట్లు  కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇది తెలుగువారిపై పక్షపాతానికి నిదర్శనమని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి.

ఎగువ భద్ర ప్రాజెక్టు నిర్మాణం ఆంధ్రప్రదేశ్, ప్రత్యేకించి వెనుకబడ్డ – కరవు పీడిత రాయలసీమ ప్రాంత నీటి హక్కులపై గొడ్డలి పెట్టుగా మారింది. 133 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించబడిన తుంగభద్ర డ్యాంలో పూడిక వల్ల 101 టియంసిల నిల్వ సామర్థ్యానికి పడిపోయింది. దీన్ని సాకుగా చూపెడుతూ,  తుంగభద్ర డ్యాంలో నీటి నిల్వ చివర భాగంలో ఉన్న నవలి వద్ద కర్ణాటక ప్రభుత్వం 30 టియంసిల తరలింపునకు మరొక ఎత్తిపోతల పథకాన్ని నిర్మించుకోవడానికి శతవిధాలా  ప్రయత్నిస్తోంది. కర్ణాటక ప్రభుత్వం ఎగువ భద్ర, నవలి ఎత్తిపోతల పథకాలను నిర్మిస్తే బచావత్ ట్రిబ్యునల్ నికర జలాలు కేటాయించిన తుంగభద్ర ఎగువ కాలువ,  తుంగభద్ర దిగువ కాలువ, కె.సి.కెనాల్, రాజోలి బండ మళ్లింపు పథకం ప్రాజెక్టులకు నీటి సమస్య జఠిలంగా మారుతుంది. తుంగభద్ర డ్యాం నుండి నీరు క్రిందికి ప్రవహించి సుంకేసుల ఆనకట్ట మీదుగా శ్రీశైలం జలాశయానికి చేరడం ప్రశ్నార్థకమౌతుంది. అంటే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నీటి హక్కులకు శాశ్వతంగా నష్టం వాటిల్లుతుంది.ఇప్పటికే  ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న రాయలసీమ – ఉత్తరాంధ్ర అభివృద్ధి పథకానికి నిధులు కేటాయించక పోయినా..  కడప ఉక్కు ప్యాక్టరీ ఊసే ఎత్తక పోయినా.. రాయలసీమ ప్రాంత నీటి హక్కులపై గొడ్డలి పెట్టువేస్తూ ఎగువ భద్ర ప్రాజెక్టుకు రు.5,300 కోట్లు మోడీ ప్రభుత్వం నిధులు కేటాయించినా..  నిరసన కూడా వ్యక్తం చేయలేని ఇరకాట పరిస్థితిలో ఏపీ సర్కారు ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అప్పర్‌ భద్ర ప్రాజెక్టుతో తెలంగాణ లోని ఆర్డీఎస్‌, శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులకు విఘాతం కలిగే ప్రమాదం ఉన్నప్పటికీ తెలంగాణ సర్కారు మౌనం వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీశైలం-సాగర్‌ ఉమ్మడి రాష్ర్టాల ప్రాజెక్టులయిన నేపథ్యంలో.. ఎగువ భద్ర ప్రాజెక్టుతో వాటికీ నీళ్లు వచ్చే పరిస్థితి లేదన్న వాస్తవాన్ని తెలంగాణ సర్కారు విస్మరించడంపై  ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

బీఆర్‌ఎస్‌ పార్టీని కర్నాటకలో విస్తరిస్తున్న నేపథ్యంలో ఎగువభద్ర అంశంపై వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్లు ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటీవలే కర్నాటక రాయచూర్‌లో బీఆర్‌ఎస్‌ నిర్వహించిన సమావేశానికి,  కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి కూడా హాజరయ్యారు. తనకు  కేసీఆర్‌కు విబేధాలు లేవని ఆ సభలోనే కుమారస్వామి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్పర్‌ భద్ర అంశాన్ని ప్రస్తావిస్తే, రాజకీయంగా అక్కడ  ప్రతికూలత వచ్చే ప్రమాదం ఉంది. అందుకే  బీఆర్‌ఎస్‌ ఆ అంశంపై మాట్లాడటం లేదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

   అటు ఏపీ సీఎం జగన్‌ సైతం,  ఈ అంశంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తుండటం చర్చనీయాంశమయింది. కేంద్రం జాతీయ హోదా ఇచ్చిన అప్పర్‌ భద్రను అడ్డుకుంటే, రాబోయే రాజకీయ విపరిమాణాల దృష్ట్యా,  వైసీపీ మౌనంగా ఉందన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో  వినిపిస్తున్నాయి. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం అప్పర్‌ భద్ర వల్ల రాయలసీమ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్‌ చేతకానితనం, కేసుల భయంతోనే ప్రశ్నించేందుకు భయపడుతున్నారని బాబు ధ్వజమెత్తారు.

 రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు-  మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఏపీ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక అధ్యక్షుడు టి.లక్ష్మీనారాయణ తదితరులు కర్ణాటక దాష్ఠీకంపై విరుచుకుపడుతున్నారు. బైరెడ్డి అయితే ఏకంగా ర్యాలీ నిర్వహించారు. కర్ణాటక అప్పర్‌ భద్ర వ్యవహారంపై,  రాయమసీమలో ఇప్పుడిప్పుడే ఉద్యమం రగులుతోంది. మూడు జిల్లాల్లో భారీ సభలు నిర్వహించేందుకు వామపక్ష-ప్రజాసంఘాలు సిద్ధమవుతున్నాయి. ఆ తర్వాత అది ఏ రూపం సంతరించుకుంటుందో చూడాలి. 

ఈ వ్యవహారం అటు రెండు తెలుగురాష్ర్టాల్లోని బీజేపీ నేతలకు ప్రాణసంకటంలా పరిణమించింది. గతంలో రాయలసీమ డిక్లరేషన్‌ పేరిట హడావిడి చేసిన బీజేపీ, ఇప్పుడు అప్పర్‌ భద్ర అంశంపై గళం విప్పకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇటు తెలంగాణ బీజేపీ నేతలదీ అదే మౌన మొహమాటం. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున, అప్పర్‌ భద్ర ప్రాజెక్టుపై వ్యతిరేక స్వరం వినిపిస్తే.. వచ్చే రాజకీయ ప్రతికూల పరిణామాలు,  బీజేపీని మౌనరాగంలో పడేసినట్లు కనిపిస్తోంది. ఇప్పటిదాకా బీజేపీ రెండు రాష్ర్టాల నేతలెవరూ, ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గళం విప్పకపోవడం ఆశ్చర్యం.

   ‘‘ ఈ విధంగా కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అప్పర్‌ భద్ర నిర్మిస్తున్నా … ఏపీ సీఎం జగన్‌తోపాటు బీజేపీ, అటు తెలంగాణ సీఎం కేసీఆర్‌తోపాటు బీజేపీ వ్యతిరేకించకపోవడం కర్ణాటకకు కలిసివచ్చే అంశమేనని ఏపీ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక అధ్యక్షుడు టి.లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. కర్ణాటక ప్రభుత్వం మరొక వైపున ఆల్మట్టి ఎత్తు పెంచడం వల రాయలసీమతోపాటు కోస్తా ప్రాజెక్టులు కూడా నష్టపోతాయని తెలిసినా సీఎం జగన్‌ మౌనంగా ఉన్నారంటే, ఆయన బీజేపీకి భయపడుతున్నారని అర్ధమవుతోందని వ్యాఖ్యానించారు.  

అసలు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశాన్ని తేల్చకుండా, కేంద్రం కర్ణాటక నిర్మించ తలపెట్టిన ఎగువ భద్ర ప్రాజెక్టుకు అన్ని వేల కోట్ల రూపాయల నిధులు ఎలా ఇచ్చింది? పోలవరం డిపిఆర్‌-2ను ఆమోదించని వైనంపై కూడా,  జగన్‌ కేంద్రాన్ని  ప్రశ్నించడం మానేశారు. కేసీఆర్‌కు కర్ణాటకలో బీఆర్‌ఎస్‌ పార్టీతో మొహమాటం ఉన్నందున ఆయన దానిపై మాట్లాడరు. కానీ జగన్‌ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు? అని లక్ష్మీనారాయణ నిలదీశారు.

Latest Articles

ఏపీలో నామినేషన్ల పర్వం

వైసీపీ అభ్యర్థి ఖలీల్ నామినేషన్ నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థి ఖలీల్ నామినేషన్ సందర్భంగా వైసిపి నాయకులు, అభిమానులు భారీ ర్యాలీ చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఖలీల్ నామినేషన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్