- అమెరికాలో క్రమక్రమంగా సాధారణ పరిస్థితులు
- రోడ్లపై ప్రయాణీకులకు అధికారుల అనుమతి
- పశ్చిమ న్యూయార్క్‌లో ఇప్పటివరకు 36 మంది మృతి
కొన్ని రోజులుగా మంచు తుఫానుకు గురైన న్యూయార్క్ రాష్ట్రంలోని బఫెలో నగరం మెల్లమెల్లగా తేరుకుంటోంది. మెయిన్ రోడ్లపై మంచును స్థానిక సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన తొలగించారు. దీంతో రోడ్డు ప్రయాణాలపై నిషాధాన్ని ఎత్తివేస్తున్నట్లు న్యూయార్క్ నగర మేయర్ ప్రకటించారు.

అమెరికా వ్యాప్తంగా హిమపాతం బీభత్సం సృష్టించింది. ప్రధానంగా పశ్చిమ న్యూయార్క్ ప్రాంతం బాగా దెబ్బతింది. ఒక్క పశ్చిమ న్యూయార్క్ ప్రాంతంలోనే ఇప్పటివరకు 36 మంది చనిపోయారు. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. న్యూయార్క్ రాష్ట్రంలోని బఫెలో ప్రాంతం మంచులో కూరుకుపోయింది. ఒక దశలో ప్రజలు బయటకు రావడానికి కూడా భయపడ్డారు. ఎటు చూసినా మంచు కురుస్తున్న దృశ్యాలే కనిపించాయి. కొంతమంది మంచులో చిక్కుకు పోయారు. దీంతో నేషనల్ గార్డ్ సిబ్బంది రంగంలోకి దిగారు. ఇక్కడ మంచులో చిక్కుకుపోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే ప్రతి ఇంటికి వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. విద్యుత్ సరఫరా, ఆహారం, తాగునీరు, వైద్య సమస్యలు ఇలాంటి మౌలిక వసతుల గురించి ఆరా తీశారు. కొంతమందికి అక్కడికక్కడే నిత్యావసర వస్తువులు అందించారు.

ఐదు రోజుల కిందట మూసివేతకు గురైన నయాగరా విమానాశ్రయం తాజాగా తెరచుకుంది. అయితే చాలావరకు విమాన సర్వీసుల పునరుద్ధరణ జరగలేదు. వరద వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు వాతావరణ నిపుణులు. దీంతో వరదను ఎదుర్కొనేలా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.